స్లాట్లకు దివ్యాంగుల పాట్లు
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

స్లాట్లకు దివ్యాంగుల పాట్లు

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: సదరం క్యాంపులో దివ్యాంగులు వైకల్య పరీక్ష చేయించుకొని ధ్రువపత్రాలు పొందేందుకు ప్రభుత్వం స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలులోకి తీసుకొచ్చింది. నెలకు నాలుగు సార్లు స్లాట్‌బుకింగ్‌ అవకాశం కల్పిస్తున్నామని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నా బుకింగ్‌ కోసం చాలామంది దివ్యాంగులు నెలల తరబడి మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ ధ్రువపత్రం ఉంటేనే వికలాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోనే అవకాశం ఉంటుంది. ఆ స్లాట్‌ బుకింగ్‌కు సంబంధించి ఒక నిర్ధారిత సమయం లేకపోవడం, కొన్నిసార్లు రాత్రి సమయంలోనూ అవకాశమిస్తుండడంతో గ్రామాలకు చెందిన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. ఈ నెల 12న నేరేడుచర్లలోని ఓ మీసేవాకేంద్రానికి 30 మంది దివ్యాంగులు స్లాట్‌బుకింగ్‌ కోసం వచ్చారు. అందులో ఒక్కరికి మాత్రమే స్లాట్‌ బుక్‌ చేయగలిగారు. మిగిలిన వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. తాము పడుతున్న ఇబ్బందులపై కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

నిర్దిష్ట సమయం కేటాయిస్తాం: సుందరి కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీవో, సూర్యాపేట
సదరం క్యాంపు కోసం స్లాట్‌బుకింగ్‌ నెలకు నాలుగుసార్లు చేస్తున్నాం. స్లాట్‌ బుకింగ్‌కి నిర్దిష్ట సమయం ఉండేలా చూస్తాం. క్యాంపుకి మూడు రోజుల ముందు స్లాట్‌బుక్‌ చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా వ్యాప్తంగా అవకాశమిచ్చిన సమయంలో 150 మందికి స్లాట్‌బుకింగ్‌ చేస్తున్నాం.


పదిసార్లు వెళ్లినా స్లాట్‌బుక్‌ కాలేదు
కట్టా దానమ్మ, సోమారం, నేరేడుచర్ల

కాలుకు పోలియో వల్ల వైకల్యానికి గురయ్యాను. పెళ్లికాక ముందు ఆంధ్రాలో పింఛన్‌ పొందాను. పెళ్లయిన తర్వాత అక్కడ పింఛన్‌ రద్దయింది. ఇక్కడ గతేడాది మార్చిలో స్లాట్‌బుక్‌ అయినప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల రద్దయింది. ఆ తర్వాత పదిసార్లకు పైనే మీసేవాకేంద్రాలకు స్లాట్‌బుకింగ్‌ కోసం వెళ్లినా నమోదు కాలేదు. ఈ విషయమై కలెక్టర్‌కి ఫిర్యాదు చేశాం. ఇప్పటికైనా స్లాట్‌బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.


ధ్రువపత్రం రెన్యూవల్‌ చేయాలి
అంకిరెడ్డి సైదులు, వైకుంఠాపురం, నేరేడుచర్ల

2018లో వికలాంగ ధ్రువపత్రం పొంది రెండేళ్లు పింఛన్‌ వచ్చింది. దానిని తిరిగి పునరుద్ధరించాల్సి ఉంది. స్లాట్‌బుకింగ్‌ కోసం మీసేవాకేంద్రం చుట్టూ తిరుగుతున్నా. స్లాట్‌బుక్‌ కావడం లేదు.


పోలియోతో చేయి పని చేయదు
జులు రాంబాబు, వైకుంఠాపురం, నేరేడుచర్ల

తొమ్మిదో తరగతి వరకు చదివాను. పోలియోతో ఒక చేయి పనిచేయదు. తల్లిదండ్రులు పని చేస్తారు. చేతనైన చిన్నచిన్న పనులు చేస్తుంటాను. ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేయాలి. కొత్తవిధానంలో ఆన్‌లైన్‌ స్లాట్‌బుక్‌ చేయాలని చెబుతున్నారు. వెంటనే బుక్‌ కావడం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని