చదువులు  ప్రశ్నార్థకం!
eenadu telugu news
Updated : 28/10/2021 06:22 IST

చదువులు  ప్రశ్నార్థకం!

అయోమయంగా ఎయిడెడ్‌ విలీన ప్రక్రియ

3,697 మంది విద్యార్థుల సర్దుబాటులో గందరగోళం

నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ పాఠశాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రస్తుతం 160 మంది విద్యార్థులు చదువుతుండగా- ఇక్కడ విద్యాబోధన చేస్తున్న 11 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి.. మీ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్చుకోవాలని నచ్చజెప్పేందుకు యత్నించారు. మీరు ఇష్టపూర్వకంగానే ఇతర పాఠశాలలకు వెళుతున్నట్లు లేఖ రాసివ్వాలని కోరారు. దానికి అత్యధిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఇక్కడ ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. పిల్లలకు చదువు ఎలా? ఎవరు? చెబుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే : జిల్లాలో మొత్తం 122 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా- 24 బడుల్లో అయిదేళ్లుగా హాజరుశాతం లేకపోవడంతో మూసివేశారు. మిగిలిన 98లో తొలుత 78 పాఠశాలల యాజమాన్యాలు తమ ఉపాధ్యాయులను అప్పగించేందుకు అంగీకారం తెలిపాయి. వీటిలో 26 మంది కరస్పాండెంట్లు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు విధుల నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు 7 యాజమాన్యాలు మాత్రమే తమ ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపాయి. అక్కడ ఎయిడెడ్‌ టీచర్లను కొనసాగిస్తారు. ఇకపై అవి ప్రభుత్వ బడులే. 13 మంది కోర్టును ఆశ్రయించారు. ఎవరినీ బలవంతం చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ.. మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుండటం విద్యార్థులను కలవరపెడుతోంది.

ముందుగా సన్నద్ధమైతేనే...

ఎయిడెడ్‌లో చదివే పిల్లలను ప్రత్యామ్నాయ పాఠశాలలో చేర్చే వరకు విధులకు హాజరై బోధించాలనే ఆదేశాలున్నా ఆచరణలో అమలు కాలేదు. విలీనానికి ఆమోదం తెలిపిన చోట.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే బాధ్యత ఎంఈవోలకు అప్పగించగా... వారు సక్రమంగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క పాఠశాల వివరాలూ డీఈవో కార్యాలయానికి చేరలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఎయిడెడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి.. ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ లోపు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కొనసాగించాల్సి ఉంది. ఇవన్నీ ఎంత మాత్రం సాధ్యమవుతాయో అర్థంగాక.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్జీవో కాలనీలో కెఎన్‌ఆర్‌, దర్గామిట్ట జడ్పీ, ఏసీనగర్‌ మున్సిపల్‌ హైస్కూళ్లలో ఇప్పటికే వందల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా చేర్చుకోలేమని చేతులెత్తేస్తున్నారు. కొత్తగా వచ్చే విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి రాబోతోంది. విద్యాశాఖ అధికారులు ముందస్తుగా సన్నద్ధమవ్వాల్సి ఉంది.

ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లాలో 52 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ ఉపాధ్యాయులను అప్పగించేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో ఈ పాఠశాలల్లోని పిల్లలను తమ దగ్గరలోని నగరపాలక, ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేస్తున్నారు. అక్టోబరు 31 నాటికి విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించే ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలివ్వగా.. అది ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు విముఖత చూపడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మధ్యలో రద్దు చేయడం సరికాదు - సూర్యకుమారి, విద్యార్థిని తల్లి

వీఆర్‌సీ పాఠశాలకు చాలా పేరుంది. ఇందులో చదువుకున్న వారిలో ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చక్కటి చరిత్ర కలిగిన పాఠశాలను మూసివేయడం సరికాదు. విద్యా బోధన బాగుంటుందనే ఉద్దేశంతోనే మా పాపను ఇక్కడ చేర్పించాం. చదువు మధ్యలో వేరే పాఠశాలలో చేరాలని చెప్పడం సరికాదు. వీఆర్‌సీ మూసేస్తే.. చాలా మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.

ఇబ్బంది కలగనివ్వం - పి.రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి

ఎయిడెడ్‌లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వం. యాజమాన్యాల ఇష్టప్రకారమే ఉపాధ్యాయులను తీసుకుంటున్నాం. ఇప్పటికే అంగీకారం తెలిపిన పాఠశాలలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఉపాధ్యాయులను, ఆస్తులను ఇచ్చేందుకు అంగీకరించిన పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇతర పాఠశాలల్లో చేర్చే పరిస్థితి లేదు. విద్యార్థులున్నంత వరకు ఆ పాఠశాలల్లో ఇప్పుడున్న ఉపాధ్యాయులు బోధిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని