పారిశ్రామికం.. నిరాశాజనకం
eenadu telugu news
Published : 21/10/2021 06:05 IST

పారిశ్రామికం.. నిరాశాజనకం

అభివృద్ధి సూచిలో రాష్ట్రస్థాయిలో 13వ స్థానం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

పరిశ్రమలు.. నిరుద్యోగాన్ని రూపుమాపుతాయి.. ఉపాధి అవకాశాలు పెంచుతాయి.. ప్రగతికి బాటలు వేస్తాయి.. తలసరి ఆదాయాన్ని పెంచుతాయి. ఇవేవీ లేకపోవడంతో కామారెడ్డి జిల్లా వెనుకబడిన ప్రాంతంగానే కొనసాగుతోంది. ఇటీవల ప్రకటించిన సామాజిక ఆర్థిక నివేదిక-21లో జిల్లా అభివృద్థి సూచి 0.17గా ఉన్నట్లు వెల్లడైంది. జీవనోపాధి, ఆరోగ్యం, విద్య, ఉపాధి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల వారీగా దీనిని రూపొందించారు. ముఖ్యంగా పారిశ్రామికంగా అడుగులు ముందుకు పడడం లేదు. ప్రజాప్రతినిధులు ఆ దిశగా శ్రమించడం లేదు.

రాజధానికి సమీపంలో ఉన్నా..
జిల్లాలో ప్రైవేటు చక్కెర కర్మాగారాలు, ఫార్మా, బీడీల తయారీ, సోలార్‌ విద్యుదుత్పత్తి కంపెనీలు తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమలు ఎక్కడా లేవు. జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయినా చెప్పుకోదగ్గ కొత్తవేవీ రాలేదు. ఫలితంగా తలసరి ఆదాయంతో పాటు స్థూల ఉత్పత్తిలో జిల్లా వెనుకబడి ఉంది. రాజధానికి సమీపంలో ఉన్నా పరిశ్రమల స్థాపనలో మాత్రం వెనుకంజలో ఉంది.

తోళ్ల పరిశ్రమ వెనక్కేనా..?
ఎల్లారెడ్డి శివారులో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన చాన్నాళ్లుగా ఉంది. దీనితో వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రిని సైతం కలిశారు. రూ.270 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సమర్పించారు. 57 ఎకరాల్లో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ముందడుగు పడలేదు.

అపార వనరులు
గాంధారి, భిక్కనూరు, బాన్సువాడ మండలాల్లో లేటరైట్‌తో పాటు వివిధ ఖనిజాలున్నాయి. నాలుగైదేళ్ల క్రితం ఇక్కడ రెండు కంపెనీలు తవ్వకాలు చేపట్టాయి. కొంత మేర నిక్షేపాలు తవ్వి తరలించాయి. తర్వాత వివిధ కారణాలతో నిలిపివేశారు. ఇలాంటి చోట్ల ప్రభుత్వమే గనులు ఏర్పాటు చేస్తే ఆదాయం వస్తుంది. స్థానికులకు ఉపాధి కలుగుతుంది. వాటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

‘దశ’ తిరిగేనా..?
* సదాశివనగర్‌ మండలం లింగంపల్లి శివారులో ఆహార శుద్ధి పరిశ్రమల పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 675 ఎకరాల భూమిని కేటాయించింది.
* ఇటీవల వాటిని అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచింది.
* జనపనార సంచుల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కాళేశ్వరం అగ్రిటెక్‌ అనే సంస్థ ముందుకొచ్చింది.
*ముఖ్యంగా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు భూములను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మరిన్ని భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.
* జుక్కల్‌ నియోజకవర్గం మీదుగా సంగారెడ్డి- నాందేడ్‌- అకోలా(ఎస్‌ఎన్‌ఏ) రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
* జుక్కల్‌ నియోజకవర్గంలోని పిట్లం, పెద్దకొడపగల్‌, జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తే జిల్లా ఆహార పరిశ్రమల హబ్‌గా మారే వీలుంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని