సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

సంక్షిప్త వార్తలు

నాడు-నేడు పనులపై సమీక్ష

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నాడు-నేడు పథకంలో భాగంగా చేపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాల పనులను పర్యవేక్షించాలని ఐసీడీఎస్‌ పీడీ జయదేవి సూచించారు. కార్యాలయంలో మంగళవారం సీడీపీవోలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలకు సమీపంలో ఉన్న కేంద్రాలను మ్యాపింగ్‌ చేయాలని చెప్పారు. ఉపాధిహామీ పథకంలో మంజూరైన నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ నెల నుంచి బయోమెట్రిక్‌ విధానం ద్వారా పాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల వివరాల నమోదు పూర్తి చేయాలని పీడీ ఆదేశించారు. సమావేశంలో సీడీపీవోలు శోభారాణి, ఝాన్సీ పాల్గొన్నారు.


కార్మిక వ్యతిరేక విధానాలపై 9న ఆందోళనలు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ ప్రతినిధులు శ్రీకాకుళంలోని కార్యాలయం వద్ద ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్‌ కోడ్‌లు, తదితరాలను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు టి.తిరుపతిరావు, ఎం.సూర్యనారాయణ, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.


ఒప్పంద అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళంవిద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకుల నుంచి రెన్యువల్‌ చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయవిద్యా సంయుక్త సంచాలకులు డా.సీహెచ్‌.కృష్ణ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి పనిచేసిన వారు మాత్రమే అర్హులన్నారు. 2021-22లో చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 5వ తేదీలోగా ప్రిన్సిపల్‌ సమర్పించాలన్నారు. 10న వచ్చిన దరఖాస్తులకు జిల్లా ఎంపిక కమిటీ సమక్షంలో కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. 12న రెన్యువల్‌ అయిన వారు అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


రేపు వన మహోత్సవం

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని అటవీశాఖ అధికారి సచిన్‌గుప్తా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, శాసన సభాపతి తమ్మినేని సీీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


24,197 మందికి టీకా

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 24,197 మందికి టీకా వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కేసీ చంద్రనాయక్‌ తెలిపారు. కొవిషీల్డ్‌ 21,760 మంది, కొవాగ్జిన్‌ 2381, స్పుత్నిక్‌ వి 56 మంది వేయించుకున్నారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని