ఈసారైనా కల నెరవేరేనా?
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

ఈసారైనా కల నెరవేరేనా?

విస్తరణపై మళ్లీ కసరత్తు 

కనీస వెడల్పుతో అభివృద్ధికి యోచన

రోడ్డుకి ఆనించి నిర్మించిన డ్రైనేజీ

సోంపేట, న్యూస్‌టుడే : ఐదు దశాబ్ధాలుగా నలుగుతున్న సోంపేట మెయిన్‌ రోడ్డు విస్తరణ కథ మళ్లీ తెర పైకి వచ్చింది. జిల్లా అంతటా చిన్న, చిన్న మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ పనులు జరిగినా సోంపేటలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. అన్నిచోట్లా 80 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా ఇక్కడ నాలుగేళ్లక్రితం 34 అడుగులతో సరిపెట్టడంతో ప్రయోజనం లేకుండాపోయింది. అస్తవ్యస్తంగా మారిన సోంపేట రోడ్డుని ఇతర పట్టణాల్లా విస్తరణ చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని పంచాయతీ పాలకవర్గంతో పాటు నాయకులు భావిస్తున్నారు. మందస, పలాస మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో సోంపేట రోడ్డు అభివృద్ధి విషయంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. పంచాయతీ పాలకవర్గం ప్రతినిధులు, మోటారు యూనియన్‌ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌కు వినతిపత్రాలు ఇచ్చి సోంపేట రోడ్డు విస్తరణ పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరగా, రోడ్డు వెడల్పు పెంచేందుకు నాయకులు కసరత్తు ప్రారంభించారు.

ఇతర పట్టణాల మాదిరిగా...

కనీసస్థాయిలో మెయిన్‌రోడ్డు వెడల్పు ఉండేలా విస్తరణ పనులు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం ప్రతినిధులు భావిస్తున్నారు. వ్యాపారులు, యజమానులకు ఇబ్బందులు లేకుండా అందరి సమ్మతితో సోంపేట అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు జరిగేలా చర్యలు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో టెక్కలి, ఇచ్ఛాపురం, హరిపురం, మందస రోడ్ల విస్తరణతో వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. ఇతరవిధాలా ప్రజలకు మెరుగైన సదుపాయాలు సమకూరడంతో సోంపేటలో రోడ్డు విస్తరణ పనులు చేపడితే ఉద్దానం ప్రాంతానికి కేంద్రంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు గిరిజన, ఉద్దానం, తీరప్రాంత గ్రామాలకు కూడలిలా సోంపేట ఉండడంతో పట్టణంలో వసతులు సమకూర్చితే ఇతరరంగాల పరంగా అభివృద్ధి జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు

సోంపేట రోడ్డు మీదుగా బారువ వైపు వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సివస్తోంది. ఇరుకు రోడ్డు కావడం, రోడ్డు పైనే వాహనాలు పార్కింగ్‌ చేయడంతో అర కిలోమీటరు ప్రయాణానికి అరగంట పడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు రద్దీగా ఉంటూ పాదచారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువైపులా లింకు రోడ్లకు సంబంధించిన వీధులు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌తో అవస్థలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పెద్దకోమటి వీధి, గాంధీమండపం, ఆరోగ్యవరం, చర్చివీధి కూడలి ప్రాంతాల్లో ప్రయాణికులు, పాదచారులు యాతన అనుభవిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం, స్టేట్‌బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు ఆవరణలు ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తో పాదచారులు నడిచేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇరుకురోడ్ల వల్ల వ్యాపారాలు, ఇతర ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇతర పట్టణాల్లా సోంపేట రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరణ చేపడితే రవాణా ఇబ్బందులు తీరడంతో పాటు వ్యాపార, వాణిజ్యపరంగా పరిస్థితి మెరుగుపడుతుందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


అందరి సహకారంతో చర్యలు

వ్యాపారులు, ఇతరవర్గాల సహకారంతో సోంపేట రోడ్డు విస్తరణకు చర్యలు చేపడతాం. ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌కు పంచాయతీ పాలకవర్గం వినతిపత్రం ఇచ్చాం. మంత్రులు, ఇతరపెద్దలు కలిసి సోంపేట అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మిగిలిన పట్టణాల్లా సోంపేట రోడ్డు కనీస స్థాయి వెడల్పు చేయగలిగితేనే పార్కింగ్‌, ఇతర ఇబ్బందులు పరిష్కారం కాగలవు. త్వరలో విస్తరణ పనులు ప్రారంభించేలా పెద్దలు చర్యలు చేపడుతున్నారు.

- నగిరి ప్రభావతి, సర్పంచి, సోంపేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని