అట్టుడికిన సిక్కోలు
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

అట్టుడికిన సిక్కోలు

ఎక్కడికక్కడే తెదేపా నేతల గృహ నిర్బంధం

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట, బృందం

శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు

తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకల దాడికి నిరసనగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లాలో బుధవారం జరిగిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. దాదాపు అన్నిచోట్లా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధినేత ఆదేశంతో తెదేపా శ్రేణులు రోడ్డెక్కాయి. తెల్లవారుజాము నుంచే పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతపట్టి శాంతియుతంగా బంద్‌ నిర్వహణకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు. చాలామందిని గృహనిర్బంధం చేశారు. బయటకొచ్చిన వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పార్టీ కార్యకర్తలతో కలసి ఉదయం 5.30కే జిల్లా కేంద్రంలోని బస్‌కాంప్లెక్సుకు చేరుకున్నారు. బస్సులను అడ్డగించి ఆందోళనకు దిగారు. వైకాపా అరాచకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారందరినీ అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో డీఎస్పీ వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఎంపీని మీడియాతో కూడా మాట్లాడనీయకుండా వాహనం ఎక్కించే ప్రయత్నం చేయగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒక ఎంపీని అయినా తనకు క నీసం మీడియాతో కూడా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించారు.

కొత్తూరులో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో..

శ్రీకాకుళంలో ఉద్రిక్తం

ముఖ్య నేతలైన పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌, ఇచ్ఛాఫురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కార్యకర్తలను అరెస్టు చేశారు. కొత్తూరులో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, సాగర్‌లను కొత్తూరు స్టేషన్‌కు తరలించారు. పలాసలో వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. టెక్కలిలో తెదేపా కార్యాలయం సమీపంలోకి వైకాపా శ్రేణులు రావడంతో ఇరు పార్టీల వారిని పోలీసులు చెదరగొట్టారు. జిల్లా వ్యాప్తంగా 395 మందిని అరెస్టుచేసి పోలీస్‌ స్టేషన్లకుతరలించారు. 35 కేసులు నమోదు చేశారు.

395  మంది అరెస్టు... 

35 కేసులు నమోదు 


వైకాపా శ్రేణుల నిరసన

పాలకొండ పట్టణంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్‌ ఆధ్వర్యంలో ఆందోళన

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై తెదేపా నేత పట్టాభిరాం అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసనలకు దిగారు. ఓ వైపు తెదేపా, మరోపక్క వైకాపా ఆందోళనలతో వీరిని అదుపుచేయడం పోలీసులకు సవాలుగా మారింది. తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసులు వైకాపా నేతలను అడ్డుకోలేదనే విమర్శలు వచ్చాయి. పాలకొండ, సీతంపేట, పలాస-కాశీబుగ్గ, టెక్కలి, వీరఘట్టం, లావేరు, ఎచ్చెర్ల మండల కేంద్రాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసనలు చేపట్టారు. చంద్రబాబు, పట్టాభికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యాఖ్యలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల ద్విచక్రవాహన ర్యాలీలు చేశారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వినతిపత్రాలు అందించారు. పలాస-కాశీబుగ్గలో చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మలపై పోసిన పెట్రోల్‌ తుళ్లి వైకాపా కార్యకర్త శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, బృందం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని