పరిహారం ఊసేది.. ఆదుకునే మాటేది!!
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

పరిహారం ఊసేది.. ఆదుకునే మాటేది!!

గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి భూ సేకరణ
తమ సంగతేంటంటూ రైతుల ఆవేదన
ఆనందపురం, న్యూస్‌టుడే

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న తొలి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. విశాఖ నగర సమీప ఆనందపురం మండలం జన్నాథపురంలో ఈ కేంద్రానికి భూములు కేటాయించారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ శిక్షణ కేంద్రం ద్వారా గ్రేహౌండ్స్‌ దళాలకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం గత ఆర్థిక సంవత్సరం చివరిలో మౌలిక వసతుల కల్పనకు రూ.10 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు ఈ భూమికి సంబంధించి నష్టపరిహారం అందక మూడేళ్లుగా నిర్వాసిత రైతులకు ఎదురు చూపులు తప్పలేదు.

త్రిసభ్య కమిటీ ఏర్పాటు ఇలా

ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి జగన్నాథపురం రెవెన్యూ గ్రామంలో 385 ఎకరాల భూమి ఇవ్వడానికి గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇందులో కొంత భాగంగాలో ఉన్న రైతులకు నష్టపరిహారం ప్రకటించకపోవడంతో పలుసార్లు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే ప్రక్రియను ఇక్కడి రైతులు అడ్డుకున్నారు. తమకు తగినన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

* రైతుల నిలదీతతో క్షేత్రస్థాయిలో భూస్వరూపం, రైతుల పరిస్థితి, పంటల సాగు తదితర అంశాలు తెలుసుకునేందుకు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి గత ఏడాది జూన్‌లో జగన్నాథపురంలో పర్యటించారు.

కేటాయించిన భూములు ఏవంటే

జగన్నాథపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే సంఖ్య ఒకటిలో 807 ఎకరాలు ఉండగా గ్రౌహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి అవసరమైన 385 ఎకరాల భూమిని గతంలో రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. ● దీనిలో డిపట్టా, 4సి అడంగల్‌, రైతుల సాగులో ఉన్న ప్రభుత్వ భూమి మొత్తంగా కలిపి 127.13 ఎకరాల వరకు ఉంది. ఈ భూమిలో 11.84 ఎకరాలకు గతంలో పది మంది రైతులకు ప్రభుత్వం డీపట్టాలు ఇచ్చింది. 25.03 ఎకరాల్లో 4సి అడంగల్‌ కలిగిన రైతులు 13 మంది ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా 90.26 ఎకరాల్లో 69 మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. ఆ భూముల్లో ఉన్న చాలా మంది రైతులను పరిగణనలోకి తీసుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.


* పలుమార్లు రైతులు అందించిన వినతిపత్రాలు పరిశీలించడానికి సీసీఎల్‌ఏ ఛైర్మన్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్‌ సభ్యులుగా త్రిసభ్య కమిటీ వేశారు.


నష్టపరిహారం ఇచ్చేదెప్పుడో

జగన్నాథపురం సర్వే సంఖ్య 1లో చాలా భాగం కొండ గుట్ట, కొండ గెడ్డతో కూడి ఉంది. దీంతో అక్కడ సాగుకు అనుకూలంగా ఉన్న భూముల్లో మామిడి, జీడిమామిడి, సరుగుడు తదితర తోటపంటలను సాగుచేస్తూ స్థానికులు జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో త్రిసభ్య కమిటీ వేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వడం గానీ, ప్రకటించడం గానీ లేదు. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే మౌలిక వసతుల కల్పనకు రూ.10 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ కావడంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు రెవెన్యూ అధికారులు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టినా వారి పేర్లు కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.


భూమిని అప్పగించాం

-కోరాడ వేణుగోపాల్‌, తహసీల్దార్‌ ఆనందపురం

ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే సంబంధిత శాఖకు అప్పగించాం. కొవిడ్‌-19 కారణంగా రైతుల కోసం కేటాయించిన పరిహారం నగదు పంపిణీ జరగలేదు. నగరానికి వచ్చిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ భూములను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం అందించిన తర్వాత అక్కడ పనులు ప్రారంభిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని