జ్వరమొస్తే దడే..!
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

జ్వరమొస్తే దడే..!

ఈనాడు-విజయనగరం, రింగురోడ్డు, న్యూస్‌టుడే

జిల్లాలో జ్వరాల తీవ్రతకు ఈ చిత్రమే నిదర్శనం. గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి సామాజిక ఆసుపత్రి వరండాలో ఇలా చికిత్స అందిస్తున్నారు.

ఇక్కడ 30 పడకలుండగా బాలింతలు పది మంది ఉన్నారు.

సుమారు 25 మంది జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. చివరికి ఇలా వరండాలో చికిత్స చేస్తున్నారు.

జిల్లాలో జ్వరాలతో మరణించిన వారు లేరు... ఇది అధికారులు చెబుతున్న మాట. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జ్వరాలు జిల్లాను కుదిపేస్తున్నాయి.. పట్టణం, గ్రామీణం తేడా లేకుండా జనం మంచాన పడుతున్నారు. చాలామంది ప్రైవేటు దవాఖానాలను నమ్ముకొని వేలాది రూపాయలు భరిస్తున్నారు. ఎక్కువగా తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోతుండటంతో భయపడిపోతున్నారు. ఇదే అదనుగా కొందరు అందినంత దండుకుంటున్నారు. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో అయ్యన్నపేటలో పదుల సంఖ్యలో మంచానపడ్డారు. పలువురు డెంగీతో బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కువ శాతం మంది ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తుండటంతో దీని తీవ్రత అధికారులకు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువ మందికి తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతోంది. ఆసుపత్రుల్లో చేరి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కేంద్రాసుపత్రి, పార్వతీపురంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో మినహా ఎక్కడా డెంగీ నిర్ధారణ పరీక్షలకు అనుమతి లేదు. అనధికారికంగా కొందరు చేస్తున్నా నియంత్రించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇవిగో ఉదాహరణలు

మా బాబు పేరు తేజ. వయసు 26. ముర్రి మిక్చర్‌ బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొడుకే మాకు ఆధారం. ఈ నెల 12న జ్వరం రావడంతో రక్త పరీక్షలు చేయించాం. డెంగీ అని తేలింది. తరువాత ప్లేట్‌లెట్లు 32 వేలకు పడిపోవడంతో ఈ నెల 16న విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. - ఎం.వెంకటలక్ష్మి

మా పాప పేరు గిరిజ. ఎనిమిదేళ్లు. మూడో తరగతి చదువుతోంది. ఈ నెల 8న జ్వరం వచ్చిందని అన్ని పరీక్షలు చేయించాం. 10న మరోసారి రావడంతో వెంటనే విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. మందులు రాసిచ్చారు. తగ్గకపోతే మరోసారి రమ్మన్నారు. 12న మరోసారి 103 డిగ్రీల జ్వరం రావడంతో వేరే ఆసుపత్రికి వెళ్లాం. పాపకు డెంగీ లక్షణాలు ఉన్నాయని, మూడు, నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పారు. రోజూ పరీక్షలకు తీసుకెళ్లాం. 14న రాత్రి వాంతులు కావడంతో పాటు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయాసం వస్తోందని విజయనగరంలోని కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లాం. చిన్న పిల్లలకు సంబంధించిన పరికరాలు లేవని చెప్పడంతో అక్కడి నుంచి ఘోషాసుపత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి విషమించిందని విశాఖలోని కేజీహెచ్‌కు పంపించారు. అక్కడి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం 10.30 గంటలకు చనిపోయింది.- ఎడ్ల సంతోష్‌, అయ్యన్నపేట, విజయనగరం

l జిల్లా కేంద్రంలోని కణపాకలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ కుమారుడికి జ్వరంతో పాటు ప్లేట్‌లెట్లు పడిపోయాయి. రూ.10 వేలతో కొనుగోలు చేసి ఎక్కించినా పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

l కురుపాం మండలం అంటిజోల గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక జ్వరంతో చనిపోయింది.

l బొండపల్లి మండలంలోని ఓ మహిళ జ్వరంతో బాధపడుతూ చనిపోయింది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్త కరోనాతో మృతి చెందగా.. ఇప్పుడా పిల్లలు అనాథలయ్యారు.

పట్టణాల్లోనే ఎక్కువ..

డెంగీ బాధితులు పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 17 వరకు 160 కేసులు నమోదయ్యాయి. 42 కేసులు విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరులలోనే ఉన్నాయి. 28 కేసులు జిల్లా కేంద్రంలో నమోదయ్యాయి. మండలాల్లో 99, ఐటీడీఏ పరిధిలో 19 కేసులున్నాయి. మలేరియా కేసులు ఏజెన్సీలోనే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 90 కేసులు నమోదవ్వగా ఏజెన్సీలో 76, గ్రామీణ ప్రాంతాల్లో 11, సాలూరు, బొబ్బిలి పురపాలక సంఘాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

అధికారులేమన్నారంటే..! l ‘జ్వరాల నియంత్రణకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. తనకు తెలిసి ఓ గర్భిణి మృతి చెందినట్లు సమాచారం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాలు సంభవిస్తే సమాచారం ఇవ్వాలి’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి ఎస్‌.వి.రమణకుమారి తెలిపారు. l కేంద్రాసుపత్రిలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు’ అని డీసీహెచ్‌ నాగభూషణరావు తెలిపారు.

డోలీపై మోసుకొస్తుండగా యువకుడి మృతి

గంగులు (పాత చిత్రం)

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడ్ని డోలీపై తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన విషాద ఘటన శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీలో చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. చిట్టంపాడు గిరిశిఖర గ్రామానికి చెందిన జన్ని గంగులు(25) కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. చిట్టంపాడు నుంచి సుమారు 8 కి.మీ. నడిచి మెట్టపాలెం వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తరలించాలని భావించారు. బంధువులు, స్నేహితులు డోలీ కట్టి.. కొండలు దాటుతుండగా మార్గమధ్యలో గంగులు మృతి చెందాడు. ఇక మాకు దిక్కెవరంటూ భార్య చిన్నాలమ్మ కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దారపర్తి పంచాయతీ రోడ్డుకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని.. నాలుగేళ్లుగా చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని, ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని