చేదోడు.. అందని తోడు
eenadu telugu news
Updated : 28/10/2021 05:29 IST

చేదోడు.. అందని తోడు

ఈ చిత్రంలో కనిపిస్తున్న వారంతా దత్తిరాజేరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దర్జీలు. గతేడాది పథకంలో భాగంగా అర్హులుగా ఎంపికై లబ్ధి పొందారు. అయితే ఈసారి వివిధ కారణాలతో అనర్హులయ్యారు. దీంతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి మండలాధికారులకు వినతిపత్రం అందించి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఓ గ్రామంలో పథకం అందరూ కావాలంటున్నారని, అందుకే అందరినీ అనర్హులుగా తేల్చేశామని ఇటీవల ఇదే మండలంలోని ఓ సచివాలయ సంక్షేమ సహాయకుడు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.

న్యూస్‌టుడే, మయూరికూడలి, దత్తిరాజేరు ఆర్థికంగా వెనుకబడిన దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేదోడు పథకాన్ని ప్రారంభించింది. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే విధంగా సంవత్సరానికి రూ.10 వేల చొప్పున మొత్తం ఐదేళ్లలో రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయింది. 2019-20కి సంబంధించి ఇప్పటికే నిధులు చెల్లించింది. మరికొన్ని రోజుల్లో 2020-21 ఏడాది సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమకానుంది. ఈమేరకు అధికారులు సర్వే చేశారు. ఇందులో ఇప్పటికే 8 వేలమందిని తొలగించారు. ఇటీవల మళ్లీ సామాజిక ఆడిట్‌ పేరుతో ప్రత్యేక సర్వే చేస్తున్నారు. దీంతో మరింత మంది అర్హత కోల్పోయే అవకాశం ఉంది.

పథకం అమలుకు ప్రభుత్వం ప్రస్తుతం సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తోంది. ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్ల లాగిన్ల ద్వారా ఆయా వివరాలను సచివాలయాలకు పంపిస్తున్నారు. వారు స్థానికంగా మళ్లీ పరిశీలించి, తుది జాబితాను పంపిస్తారు. అయితే ఇప్పటికే ఓసారి సర్వే చేశారని, మళ్లీ చేస్తున్నారని, కొందరు రాజకీయ నాయకులు తమ పేర్లను కావాలనే తొలగింపజేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వీరిలో గతంలో లబ్ధిపొందినవారు కూడా ఉండడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈమె పేరు ఎస్‌.కృష్ణవేణి. దత్తిరాజేరు మండలం, ఇంగినాపల్లి గ్రామం. తన కుమార్తెతో ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఇంటి సమీపంలో దుకాణం ఏర్పాటు చేసుకుని 15 సంవత్సరాల నుంచి దర్జీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది చేదోడు పథకానికి ఎంపికై రూ.10 వేల లబ్ధి పొందారు. కానీ ఈసారి అనర్హురాలిగా మిగిలిపోయారు. సచివాలయానికి వెళ్లి అడగ్గా.. దుకాణం ఇంటి వద్ద కాదని, రోడ్డుపై ఉండాలని చెప్పడంతో కంగుతిన్నారు. రోడ్డుపై దుకాణం పెట్టేంత స్తోమత లేదని, ఆదుకోవాలని వాపోతున్నారు.

ముమ్మరంగా వడపోత..

గతేడాదితో పోలిస్తే ఈసారి నిబంధనలు కఠినతనం చేశారు. అప్పట్లో సొంత దుకాణం ఉన్నా... లేకున్నా.. ఇంటివద్ద వృత్తి చేసేవారికి పథకాన్ని వర్తింపజేశారు. ఈసారి మాత్రం విధిగా ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా దుకాణాలు ఇంట్లో కాకుండా రోడ్లు, వీధుల్లో ఉండాలని షరతు పెట్టారు. అలాగే అధిక విద్యుత్తు బిల్లు, పన్ను చెల్లింపు, అధిక వార్షికాదాయం, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం తదితర నిబంధనలు విధించారు. దీంతో చాలామంది అనర్హులవుతున్నారు.

అర్హులందరినీ ఎంపిక చేస్తున్నాం..

సచివాలయాల వారీగా వివరాలను సేకరించి అర్హుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ముందుకెళుతున్నాం. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కొంతమంది మాదృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్‌ ఆడిట్‌ జరుగుతోంది. అర్హులందరినీ ఎంపిక చేస్తాం. ఇది పూర్తయిన తర్వాత తుది జాబితా వస్తుంది.-పెంటోజీరావు, ఈడీ, బీసీ సంక్షేమశాఖ, విజయనగరం

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని