Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగదు జమ కావట్లే!!

కేసీఆర్‌ కిట్‌ అందజేతలో జాప్యం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: గర్భిణులు, బాలింతలకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్టు పథకం అమల్లో జాప్యం అవుతోంది. సకాలంలో నగదు ప్రోత్సాహకం అందక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడాది కాలంగా నగదు కోసం ఎదురుచూస్తున్నారు. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాని పథకం అమలుకు కావల్సిన నిధులు కేటాయించడంలో జాప్యం అవుతోంది. దీంతో లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నాయి.

ఏడాది నుంచి ఎదురు చూపులే..

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచేందుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే కేసీఆర్‌ కిట్‌ను కూడా ప్రవేశ పెట్టారు. తల్లి, శిశువుకు కావాల్సిన వస్తువులతో కూడిన కిట్‌తో పాటు నగదును ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. గర్భిణీ నుంచి శిశువు జన్మించిన తొమ్మిది నెలల వరకు 4 విడతల్లో నగదు సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు అయితే రూ.12 వేలు అందిస్తారు. మొదటి విడత గర్భవతిగా ఉన్నప్పుడు, రెండో విడత కాన్పు సమయంలో, మూడు, నాలుగో విడతలు టీకా సమయంలో నేరుగా లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తారు. మొదటగా గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో కేసీఆర్‌ కిట్‌ పథకంలో నమోదు చేస్తారు. గర్భిణి మూడో నెలలో మొదటి విడత డబ్బులు జమ అవుతాయి. అయితే చాలా మందికి ఏడాదిగా డబ్బులు రావడం లేదు. కాన్పు సమయంలో కేవలం కిట్టు మాత్రమే ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహం వస్తుంది అని చెబుతున్నా ఎవరికీ నగదు జమ కావడంలేదు. అసలు డబ్బులు వస్తాయా రావా అనేది అధికారులు సైతం చెప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పై నుంచే రావాలని చెబుతూ దాటవేస్తున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 7647 రావాలి

జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం కింద నమెదైనవారిలో మొదటి విడతలో లబ్ధిదారులు 2483 మందికి గానూ 582 మందికి మాత్రమే నగదు జమ అయింది. ఇంకా 1901 మంది నిరీక్షిస్తున్నారు. రెండోవిడతలో 848 మందికి గానూ 217 మందికి మాత్రమే నగదు జమ అయ్యింది. మూడో విడతలో 3368 మందిలో 608 మందికి నగదు రాగా, 2760 మందికి రావాల్సి ఉంది. నాలుగో విడతలో 2962 మందికి గానూ 572 మందికి నగదు జమ కాగా, ఇంకా 2390 మందికి రావాల్సి ఉంది. జయశంకర్‌ జిల్లాలో మొత్తం లబ్ధిదారులు 9661 మందికి గానూ 7647 మంది నగదు కోసం ఎదురుచూస్తున్నారు.


మూడు నెలలు కావస్తున్నా డబ్బులు రాలేదు

- ఎం. శ్రీలత, వెంకటేశ్వరపల్లి, రేగొండ మండలం

కాన్పు అయి మూడు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం జమ కాలేదు. అధికారులు ఆన్‌లైన్‌లో పేరు నమోదు అయిందని చెబుతున్నారు. కాని ఇంకా ఖాతాలోకి రాలేదు. ఆ డబ్బులు వస్తే అవసరాలకు ఉపయోగపడుతాయని ఎదురుచూస్తున్నాం. వస్తాయని చెబుతున్నారు కాని, ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. త్వరగా వచ్చేలా చూడాలి.


నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం

- డాక్టర్‌ ఉమాదేవి, మాతా, శిశు సంరక్షణ పోగ్రాం అధికారిణి(ఎంసీహెచ్‌)

కేసీఆర్‌ కిట్‌కు సంబంధించి నిధులు విడుదల చేయగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. వారి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ అవుతాయి. త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా పేరు నమోదు చేసుకున్న అర్హులందరికీ డబ్బు కచ్చితంగా వస్తుంది. ఎవరూ ఆందోళన చెందవద్ధు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని