మదర్‌ డెయిరీ పాలక మండలి ఎన్నికల్లో తెరాస ప్యానల్‌ విజయం
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

మదర్‌ డెయిరీ పాలక మండలి ఎన్నికల్లో తెరాస ప్యానల్‌ విజయం

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(నార్ముల్‌ మదర్‌ డెయిరీ) పాలక వర్గ సభ్యుల ఎన్నికల్లో తెరాస ప్యానల్‌కు చెందిన సభ్యులు ఘన విజయం సాధించారు. పాలక మండలిలో మొత్తం ఆరుగురు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు మహిళా జనరల్‌ స్థానాలకు డైరెక్టర్లుగా కందాల అలివేలు, కర్నాటి జయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలకు హయత్‌నగర్‌లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 306 మంది సభ్యులకుగాను 303 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో అధికార తెరాస ప్యానల్‌కు చెందిన గూడూరు శ్రీధర్‌రెడ్డి 255 ఓట్లు, కోట్ల జలందర్‌రెడ్డి 243 ఓట్లు, చల్లా సురేందర్‌రెడ్డి 232 ఓట్లు, రచ్చ లక్ష్మినర్సింహరెడ్డి 219 ఓట్లతో ఘన విజయం సాధించారు.

నేడు ఛైర్మన్‌ ఎన్నిక...! : నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యుల పదవీ కాలాన్ని ఎన్నికల అధికారి జి.వి.హన్మంతరావు డ్రా ద్వారా ఎంపిక చేశారు. వీరిలో జలేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అలివేలు ఐదేళ్లు, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, జయశ్రీ నాలుగేళ్ల పాటు  డైరెక్టర్ల పదవిలో కొనసాగుతారు. ఆరుగురు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు పూర్తికావడంతో బుధవారం డెయిరీ ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. పాలకవర్గంలో మొత్తం ఛైర్మన్‌తో కలిపి 15 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరందరి పదవీ కాలాన్ని డ్రా ద్వారా నిర్ణయిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని