యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం: పీఎస్‌ఐ
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం: పీఎస్‌ఐ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో ఓమిక్స్‌ ప్రభావంపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ సీసీఎంబీ(సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సెంటర్‌)లో మూడు రోజుల పాటు జరిగిన ఓమిక్స్‌-2021 సదస్సు శనివారం ముగిసింది. ప్రొటామిక్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(పీఎస్‌ఐ)తో కలిసి నిర్వహించిన ఈ సదస్సులో 8 దేశాల నుంచి 35మంది విషయ నిపుణులు, 300పైగా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జన్యు పరిశోధనల్లో ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్స్‌, మెటబాలైట్లు, ఇతర సూక్ష్మ పదార్థాల ప్రభావంపై శాస్త్రవేత్తలు చర్చించారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పీఎస్‌ఐ అధ్యక్షుడు డాక్టర్‌ శుభ్రా చక్రవర్తి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువ శాస్త్రవేత్తలకు అన్నిరకాలుగా ప్రోత్సాహమందించేందుకు పీఎస్‌ఐ ముందుంటుందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతల్ని అందిపుచ్చుకుంటేనే శాస్త్రీయ రంగంలో రాణించగలమని తెలిపారు. అనంతరం ఈ సదస్సు కన్వీనర్‌, సీసీఎంబీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ స్వస్థి రాయ్‌ చౌదరి మాట్లాడుతూ.. వినూత్న ఓమిక్స్‌ సాంకేతికతల్ని వినియోగించుకొని భారత్‌ సామర్థ్యం పెంచుకుంటోందన్నారు. గత రెండు దశాబ్దాల్లో శాస్త్రీయ రంగం అనూహ్య ప్రగతి సాధించిందనే దానికి ఈ పరిశోధనలు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ఇటీవలె అంతర్జాతీయ స్థాయి సంస్థలతో చేసుకున్న హ్యూమన్‌ ప్రొటోమ్‌ ప్రాజెక్టు ఒప్పందం రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులి తెస్తుందని అభిప్రాయపడ్డారు. పీఎస్‌ఐతో కలిసి పనిచేయడం గొప్ప విషయమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని