close

సోమవారం, ఆగస్టు 19, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రంలో 12.. జిల్లాలో 1

రాష్ట్రంలోని 12 పురపాలికల్లో ఒకటిగా గుర్తింపు
ఉమ్మడి జిల్లాలో వరుసగా రెండోసారి ప్రథమం
  న్యూస్‌టుడే, ఆర్మూర్‌

పన్నుల చెల్లింపులో ఆర్మూర్‌ పట్టణ వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వంద శాతం చెల్లించి రాష్ట్రంలోని 12 పురపాలికల్లో ఒకటిగా ఆర్మూర్‌ పురపాలక సంఘానికి గుర్తింపు సాధించిపెట్టారు. పురపాలక కమిషనర్‌, ఉద్యోగులు, బిల్‌ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఛైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించడంతో వరుసగా రెండేళ్లు వంద శాతం పన్నులు వసూలైన బల్దియాగా ఆర్మూర్‌ ప్రత్యేక ఘనతను సొంతం చేసుకొంది.

రాష్ట్రంలో ఉన్న 142 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మాత్రమే వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయగలిగాయి. ఇందులో ఆర్మూర్‌ ఒకటిగా నిలవడం, ఉమ్మడి జిల్లాలో కేవలం ఈ బల్దియా మాత్రమే ఈ ఘనతను సాధించడం విశేషం. ఈ ఘనత వరుసగా రెండోసారి అందుకోవడం విశేషం. 10,800 ఇళ్లు, వాణిజ్య భవనాలకు సంబంధించి రూ.1,90,11,000 ఆస్తి పన్నును మార్చి 31లోపు వసూలు చేయడమే కాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను(రూ.41 లక్షలు)ను ముందస్తుగా వసూలు చేయడం గమనార్హం. రెండేళ్లు ఈ ఘనతను సాధించినందుకు పురపాలక కమిషనర్‌ శైలజ సీడీఎంఏ శ్రీదేవి చేతుల మీదుగా రెండుసార్లు ప్రశంసాపత్రాలు, అభినందనలు అందుకున్నారు.

పెరిగిన చైతన్యానికి నిదర్శనం
తక్కువ సంఖ్యలో ఇళ్లు, వాణిజ్య దుకాణాలు ఉండే గ్రామాల్లో ఆస్తి పన్ను వంద శాతం వసూలు కావడం సాధారణ విషయమే. పది వేలకు పైగా ఇళ్లు, వాణిజ్య భవనాలు ఉన్న ఆర్మూర్‌ పట్టణంలో  వసూలు కావడం మాములు విషయం కాదనే చెప్పాలి. పురపాలక ఉద్యోగులు ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రజలు మొండిగా వ్యవహరిస్తే కష్టసాధ్యమే. అలా చేయకుండా వందశాతం పన్నులు చెల్లించడం పుర ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆరు నెలలకోసారి డిమాండ్‌ నోటీసు ఇచ్చినా గతంలో ఏడాదికోసారి కూడా చెల్లించే వారు కాదు. ఆలస్య రుసుముతో కలిపి చెల్లించేవారు. ఆర్థికంగా కొంత నష్టం జరిగినా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఆరునెలలకోసారి లేదా ఏడాదికి ఒకసారి సకాలంలో చెల్లిస్తున్నారు. ఆలస్య రుసుము అనే ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు.

ముందస్తుగా చెల్లింపులు
ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను గడువులోపు చెల్లించడమే కాదు.. వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా కొంత మంది ముందుగానే చెల్లిస్తున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తుండటంతో చాలా మంది ముందస్తు చెల్లింపులు చేసేస్తున్నారు. ఇలా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41 లక్షలు (28శాతం) చెల్లించడం విశేషం. ఈ మధ్యే బల్దియాలో విలీనమైన పెర్కిట్‌, మామిడిపల్లి, కోటార్మూర్‌లలో పురపాలక అధికారులు, ఉద్యోగులు ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో 90 శాతం పన్నులు వసూలయ్యాయి.

అందరి సహకారంతోనే ...
- ఎ. శైలజ, పురపాలక కమిషనర్‌
పన్నులు సక్రమంగా వసూలైతేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రజలకు సరైన సేవలు అందుతాయి. రెండేళ్లుగా ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్లే వందశాతం పన్నులు వసూలు చేయగలిగాం. ఛైర్‌పర్సన్‌, పాలకవర్గ సభ్యులు చక్కని తోడ్పాటును అందించారు. ప్రత్యేకించి ప్రజల నుంచి లభించిన సహకారం మరువలేనిది.

ఇళ్లు, వాణిజ్య భవనాల వివరాలు
* పట్టణ జనాభా దాదాపు - 60 వేలు
* మొత్తం ఇళ్లు, వాణిజ్య సంస్థలు - 10,800
* ఇళ్లు, మిక్స్‌డ్‌ ప్రాపర్టీ కలిపి - 8,132
* వాణిజ్య భవనాలు - 2,668

ఉద్యోగుల పట్టుదలకు ప్రజల తోడ్పాటు
పురపాలక ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుంచి వంద శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు. కమిషనర్‌ శైలజ మూడేళ్లుగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులను ముందుకు నడిపించారు. పాలకవర్గ సహకారం తీసుకున్నారు. మొండి బకాయిదారులపై కొంత కఠినంగా వ్యవహరించారు. చివరి రెండు, మూడు నెలలు ఉద్యోగులు బృందాలుగా విడిపోయి ఇంటింటికి తిరిగారు. ప్రజలు వారికి అన్ని విధాలా తోడ్పాటునందించారు. ఆర్మూర్‌ పురపాలక సంఘం ఏర్పాటైన 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా గతేడాది వంద శాతం ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని అందుకున్నారు. ఈసారి కూడా అంతే ఉత్సాహంతో పని చేసి మరోసారి వందశాతం లక్ష్యాన్ని చేరుకొని రాష్ట్రంలో అరుదైన గుర్తింపు తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.