close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఊరిస్తూ..ఉసూరుమనిపిస్తూ..!

న్యూస్‌టుడే, నిజాంసాగర్‌

నిజాంసాగర్‌ జలాశయం.. ఈ పేరు చెప్పగానే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల వరప్రదాయనిగా అన్నపూర్ణగా గుర్తుకొస్తుంది. దీనికి అనుసంధానంగా 1962లో అచ్చంపేటలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. 1997 వరకు ఇక్కడే చేప విత్తును ఉత్పత్తి చేసి స్థానిక చెరువులతోపాటు, హైదరాబాద్‌, మహారాష్ట్రకు తరలించేవారు. ఆ తర్వాత కేంద్రంపై నీలినీడలు కమ్ముకొని మూలనపడింది. దీనిని నమ్ముకున్న రెండు వేల మత్స్యకార్మిక కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది.

2016లో అప్పటి మంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సందర్శించారు. దీనిని ఆధునికీకరించి పాత రోజులు వచ్చేలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ మేరకు మత్స్య, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. మూడేళ్ల కిందట రూ.2.50 కోట్ల నిధులు విడుదల కానున్నాయని జీవో కూడా వచ్చినట్లు అధికారులు ప్రకటనలు చేశారు. కానీ అతీగతీ లేదు. తాజాగా రూ.4.50 లక్షలతో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.

కేంద్రంపై ఆధారపడ్డ వారు..
* సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని కల్హేర్‌, శంకరంపేట, పాపన్నపేట, నారాయణఖేడ్‌ మండలాలకు చెందిన 50 గ్రామాల మత్స్యకార్మికులు
* కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి, సోమర్‌పేట, సాతెల్లి గ్రామాల వారు
* నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌ మండలాల్లోని 27 పంచాయతీల పరిధిలో ఉన్న 800 కుటుంబాలు

ఏర్పడిన సమస్యలు..
కేంద్రంలో 22 ఏళ్లుగా చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాండ్స్‌, ఐస్‌ ఫ్యాక్టరీ, పంపింగ్‌ గదులు, కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ పనిచేసే కార్మికులు ప్రభుత్వం ఏటా ప్రాజెక్టులో విడుదల చేసే పిల్లలు పెద్దయ్యేంత వరకు వేచి చూసి, ఆ తర్వాత వేటాడి దళారులకు విక్రయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంత మంది వలస వెళ్లారు.

ఐదేళ్లుగా ఆశ చూపుతున్నారు
చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రానికి నిధులు విడుదల కానున్నాయి.. బతుకులు మారుతాయి.. అంటూ ఎదురు చూడటం తప్ప.. కార్మికులు చేసేది ఏమీ లేకుండా పోయింది. గత ఐదేళ్లుగా అధికారులు, నాయకులు విత్తనోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించడం.. నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం.. ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీయడం తప్ప నిధుల జాడ లేకుండా పోయింది.

రూ.4.50 లక్షలతో ప్రతిపాదనలు
విత్తనోత్పత్తి కేంద్రం ఆధునికీకరణ కోసం 2017 మార్చిలో రూ.2.50 కోట్ల నిధుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.30 లక్షలతో రెండు హెచరీలు, రూ.7.50 లక్షలతో ఆరు పాండ్స్‌, రూ.16.00 లక్షలతో 80 నర్సరీల నిర్మాణాలతోపాటు రూ.20 లక్షలతో కార్మికులకు శిక్షణ గది, పైప్‌లైను పనులు, కార్యాలయం గది, విద్యుత్తు, ఫర్నిచర్‌, ప్రస్తుతం ఉన్న పాండ్స్‌ మరమ్మతులు చేపడతామంటూ అధికారులు అప్పట్లో ప్రకటించారు. కానీ ఆచరించలేదు. పది రోజుల కిందట జాయింట్‌ డైరక్టర్‌ శంకర్‌ రాథోడ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినప్పటికీ నిధులు విడుదల కాలేవని, అందుకే తాత్కాలిక మరమ్మతు పనులు చేయనున్నామని, ఇందుకు రూ.4.50 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నామని పేర్కొన్నారు.

36 నెలలు గడుస్తోంది
- సాయిలు, మత్స్యకార్మికుడు, అచ్చంపేట
విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వవైభవం రానుందని, నిధులు కూడా విడుదల కానున్నాయంటూ.. అధికారులు తెలిపి 36 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. కేంద్రం అలాగే ఉంది.

ఉపాధి మెరుగుపర్చాలి
- శ్రీనివాస్‌, మత్స్యకార్మికుడు, గాలీపూర్‌
కేంద్రం ఆధునికీకరిస్తే మాకు మరింత ఉపాధి కలుగుతుంది. మేము వేటాడిన చేపలను ఇక్కడే విక్రయించుకొని మద్దతు ధర పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మేము వేటాడిన చేపలను దళారులకు విక్రయించుకొంటూ నష్టపోతున్నాం.

ప్రతిపాదనలు పంపారు
- డోలిసింగ్‌, ఎఫ్‌డీవో
మత్స్యశాఖ అధికారులు పది రోజుల కిందట కేంద్రాన్ని పరిశీలించారు. కేవలం రూ.4.50 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు పనులు చేసేందుకు నివేదిక తయారు చేయించి ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రూ.2.50 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆ నిధులు విడుదల కావనే విషయం స్పష్టం అయింది. తాత్కాలిక పనులు మాత్రమే చేపట్టనున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.