close

శుక్రవారం, జులై 19, 2019

ప్రధానాంశాలు

పడకలు పెంచితే సర్వజన వైద్యమే

 తాగునీటి పథకాలకు రూ.126 కోట్లు చెల్లించాలి

 బీమా పరిహారం అందిస్తే రైతులకు మేలు

 సీఎం సమీక్షలో కలెక్టర్‌ వీరపాండియన్‌

 

సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ వీరపాండియన్‌

 

ఈనాడు డిజిటల్‌-కర్నూలు: కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రస్తుతం ఉన్న 1,050 పడకల సంఖ్యను 1,550కు పెంచాలని, వెంటనే అనుమతులు ఇవ్వాలని జిల్లా సర్వోన్నతాధికారి వీరపాండియన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని జిల్లాలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కలెక్టర్లతో మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఒక చెట్టు నాటాలని, గ్రామ వాలంటీర్లను భాగస్వాములు చేయాలని సూచించారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తును ప్రణాళికాబద్ధంగా ఫీడర్లవారీగా ఇవ్వాలని, పంపుసెట్లకు సంబంధించి కనెక్షన్లు పెండింగ్‌ ఉంటే వెంటనే ఇవ్వాలన్నారు. భూముల రీ సర్వేకు సైతం ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

అనుమతిస్తే అందుబాటులోకి..: కర్నూలు ఆసుపత్రిలో మరో 500 పడకలను పెంచితే జిల్లాతోపాటు అనంతపురం, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల నుంచి వచ్చే ఇన్‌, ఔట్‌ పేషెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని కలెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కర్నూలు విమానాశ్రయం పనులు పూర్తయ్యాయని, ఆపరేటింగ్‌ చేసే పరికరాలు, సిగ్నల్‌ వ్యవస్థ వంటి వాటికి అనుమతులు వస్తే వెంటనే అందుబాటులోకి వస్తుందని కలెక్టర్‌ సీఎంకు తెలపగా సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని వివిధ తాగునీటి పథకాలకు, పనులకు వెంటనే రూ.126 కోట్లు చెల్లించాలని, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఓర్వకల్లు, తంగడంచెకు నీరివ్వాలి: ఓర్వకల్లు, తంగడంచె పారిశ్రామిక కారిడార్‌లో 1.9 టీఎంసీ నీరు కేటాయించాల్సి ఉందని కలెక్టర్‌ వివరించారు. వీటితోపాటు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వేతనాలు 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని రూ.8 కోట్లు మంజూరు చేస్తే సమస్య తీరుతుందని సదస్సులో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కేటాయింపులు చేస్తే ఉపయుక్తం

ఏటా 3 టీఎంసీల నీటిని హంద్రీనీవా నుంచి జీడీపీకి కేటాయింపులు చేస్తే శాశ్వత తాగునీటి పరిష్కారం చూపగలుగుతామని కలెక్టర్‌ వీరపాండియన్‌ సీఎంకు వివరించారు. ప్రధాన కాల్వ నుంచి కర్నూలు కార్పొరేషన్‌తోపాటు డోన్‌, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాలకు తాగునీరు అందించవచ్చన్నారు. పీఎంఎఫ్‌బీవై పంటల బీమాలో భాగంగా 2018-19లో 1,74,574 రైతులకు సంబంధించి బీమా పరిహారం ఇంకా పెండింగులో ఉందని వివరించారు. జిల్లాలో 6.11 లక్షల మందికి సంబంధించి రూ.659.40 కోట్ల పంట నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని సీఎంకు కలెక్టర్‌ తెలిపారు. నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం సరఫరా చేసేందుకు రూ.4.46 కోట్లు విడుదల చేయాలన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.