close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

బియ్యం మిల్లర్ల ధరాఘాతం

రూ. కోట్లల్లో రైతులకు నష్టం

న్యూస్‌టుడే, బోధన్‌

ప్రతి సీజన్‌లో బియ్యం మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో ధరాఘాతానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా నష్టపరుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన కర్షకుల శ్రమను గాల్లో కలిపేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అజమాయిషీ చేయాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకొని అటువైపు కన్నెత్తి చూడటంలేదు. తనిఖీల జోలికి అసలు వెళ్లడంలేదు. కస్టం మిల్లింగ్‌ వరకే తమ బాధ్యతగా భావిస్తున్నారు.

పాలకులు ప్రతి పంటకు ఏటా మద్దతు ధర ప్రకటిస్తారు. స్వయంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇవి కాకుండా మిల్లర్లు నేరుగా సేకరిస్తారు. నిజం చెప్పాలంటే సర్కారు కన్నా వ్యాపారులే రైతుల నుంచి ఎక్కువ పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేస్తారు. దాన్ని బియ్యంగా మార్చి వ్యాపారం నిర్వహిస్తారు. మొన్నటి యాసంగిలో(రబీ) వాతావరణం అనుకూలించక వరి సాగు విస్తీర్ణం తగ్గింది. అయినా ఉభయ జిల్లాల్లో వీరు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం సుమారు 5 లక్షల టన్నులు కొనుగోలు చేసింది.

అంతా అడ్డగోలు

సర్కారు కేంద్రాల ఏర్పాటులో జాప్యం మిల్లర్లకు కలిసి వస్తోంది. ఆ తర్వాత సంచుల కొరత, రద్దీ ఇతర అంశాలు రైతులను ఇబ్బంది పెట్టడం సర్వసాధారణమయ్యాయి. దీనికితోడు అప్పుల వడ్డీ నెత్తిన ఉండటంతో కర్షకులు మిల్లర్లను శరణు వేడుతున్నారు. మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో పైసా తగ్గించడానికి వీలులేదు. రైతుకు సంబంధించిన చిరునామా, పట్టాపాసు పుస్తకం, భూ విస్తీర్ణం తదితర వివరాలను పుస్తకంలో నమోదు చేయాలి. సర్కారు ధర చెల్లించినట్లు కర్షకుడి సంతకం తీసుకోవాలి. ప్రతిరోజు పౌరసరఫరా శాఖ అధికారులు ఈ ప్రక్రియను పరిశీలించి రైతుకు అండగా ఉండాలి. కానీ జరిగే తంతు వేరుగా ఉంటోంది. ప్రభుత్వ మద్దతు ధర ముట్టజెప్పినట్లు సంతకాలు తీసుకుంటారు... కానీ ఇవ్వరు. ఇక తరుగు వారి ఇష్టం. సర్కారు ధర క్వింటాలుకు రూ.1,770 నిర్ణయిస్తే.. మిల్లర్లు గరిష్ఠంగా రూ.1,650 చేతికిచ్చారు. తరుగు పేరుతో బస్తాకు రెండు కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకున్నారు.

తనిఖీలు పూజ్యం

ఒక సీజన్‌లో ధాన్యం విక్రయాలు ముగిశాక మిల్లర్లకు అమ్ముకొన్న రైతుల చిరునామాకు అధికారులు వెళ్లాలి. వారు పొందిన ధర ఇతర ఇబ్బందులను తెలుసుకొని చర్యలు తీసుకోవాలి. కానీ ఇది వాస్తవ రూపం దాల్చడంలేదు. నిజామాబాద్‌ జిల్లాలో 60 వరకు పారా బాయిల్డ్‌, 170 వరకు రా రైస్‌ మిల్లులు ఉన్నాయి. మిల్లు యజమానులు రాసిన దస్త్రాలను పరిశీలించి అంతా సజావుగా ఉన్నట్లు సంతకాలు చేస్తున్నారేగాని, క్షేత్ర పరిశీలనకు వెళ్లడంలేదు.

అవకాశం ఉన్నా..

యాసంగి ధాన్యం కొనుగోళ్లు నెలకిందట ముగిశాయి. ఇప్పటికీ వాస్తవాలను ఆరా తీసి అక్రమాలపై చర్యలు తీసుకునే వీలుంది. అయితే మిల్లర్లు ముట్టజెప్పే మామూళ్లకు రాజీపడి అన్నదాతను విస్మరిస్తున్నారు. నాన్‌ట్రేడింగ్‌ మిల్లులు బియ్యం వ్యాపారం చేయడానికి వీలులేదు. రైతుల గృహ అవసరాల బియ్యాన్ని మాత్రమే మరపట్టాలి. ఇందుకు క్వింటాలు ధాన్యానికి నిర్ణీత రుసుము తీసుకోవాలి. ధాన్యం పొట్టు, తవుడు నాన్‌ట్రేడింగ్‌ మిల్లులకు అదనపు లాభాలు. అయితే ఈ మిల్లు యజమానులు నేరుగా ధాన్యం కొనుగోలు చేసి బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఈ దందాను అధికారులు పట్టించుకోవడంలేదు.

ఇష్టారీతిన చెల్లింపు

మిల్లర్లు సర్కారు ధర కంటే గరిష్ఠంగా క్వింటాలుకు రూ.170 తగ్గించారు. గట్టిగా ప్రశ్నించిన వారికి రూ.1,650 చొప్పున ముట్టజెప్పారు. అప్పటికీ తరుగు పేరుతో రెండు కిలోలు అదనంగా తూకం వేశారు. నిజామాబాద్‌ జిల్లాలో యాసంగిలో 1,50,185 ఎకరాల్లో వరి సాగైంది. 4.22 టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో సర్కారు 3.52 లక్షల టన్నులు కొనుగోలు చేయగా మిగతాది మిల్లర్లు సేకరించారు. కామారెడ్డిలో లక్షా 50 వేల టన్నులు సర్కారుకు, సుమారు 30 వేల టన్నులు మిల్లర్లకు చేరాయి.

ధర వ్యత్యాసం విలువ రూ.12 కోట్లు

ఉభయ జిల్లాల్లో లక్ష టన్నులు(పది లక్షల క్వింటాళ్లకు సమానం) మిల్లర్లు కొనుగోలు చేశారు. రూ.1,650 ధరతో కొనుగోలు చేసినా సర్కారు ధర వ్యత్యాసం విలువ రూ.12 కోట్లు. అంటే కేవలం ధర తగ్గించి వారు ఒక్క సీజన్‌లో పొందిన లాభం ఇది. పంట విస్తీర్ణం ఎక్కువ ఉంటే మిల్లర్ల లాభాలు రూ.వంద కోట్లలో ఉంటుంది. తరుగు పేరుతో ప్రతి 70 కిలోల బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకున్నారు. 14,285 బస్తాలకు ఇలా సేకరించిన ధాన్యం మొత్తం 285 క్వింటాళ్లు అవుతుంది. దాని విలువ రూ.ఐదు లక్షలకు పైమాటే. ఇక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో సేకరిస్తున్న ధాన్యాన్ని కొందరు కార్యదర్శులు అమ్ముకొంటున్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని ఒక కార్యదర్శి ఈ రకంగా ఏటా రెండు సీజన్‌ల్లో రూ.4 లక్షలు ఆర్జిస్తున్నాడు.

రూ. 1,650 ఇచ్చారు

- పూల్‌సింగ్‌, రైతు మట్టయ్యఫారం, నవీపేట

యాసంగికి సంబంధించి 70 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించా. క్వింటాలుకు రూ.1,650 ధర చెల్లించారు. తరుగు పేరుతో కిలో తీసుకున్నారు. సర్కారు కేంద్రాల ఇబ్బందితో మిల్లర్ల వద్దకు వెళ్లగా దోచుకొన్నారు.

రూ. 120 తగ్గించారు

- పోశెట్టి, రైతు బ్రాహ్మణపల్లి, ఎడపల్లి

మిల్లరుకు పంట దిగుబడి విక్రయించా. రెండు కిలోల తరుగు తీసుకొని క్వింటాలుకు రూ.1,650 చొప్పున ధర చెల్లించారు. ప్రభుత్వం ధర కంటే రూ.120 తగ్గించి ముట్టజెప్పారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.