కూలీ..కావాలి - Nizamabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

కూలీ..కావాలి

రోజువారీగా రూ.400-600 వరకు డిమాండు
ఇతర జిల్లాల నుంచి రాకపోకలు - పెట్టుబడి భారంతో అన్నదాత అగచాట్లు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

‘‘పది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌ పనులు ఊపందుకొన్నాయి. ముదిరిపోయిన నారును నీరున్నప్పుడే నాటుకోవాలని అన్నదాతలు ఆరాటపడుతున్నారు. వీటికి తోడు వరి, ఇతర ఆరుతడి పంటల కలుపు ఒకేసారి రావడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది.’’


‘‘మొక్కజొన్న, పసుపు, సోయాబీన్‌, అపరాల పంటల్లో కలుపు తీసేందుకు అనువైన సమయం కావడంతో చిన్నా పెద్ద తేడా లేకుండా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటడం, ఉపాధిహామీలో కాల్వల పూడికలు తీసే పనులపైనా ఇప్పుడు ప్రభావం పడింది.’’
గతంలో కంటే రెండింతల డబ్బులు కూలీలకు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగుతున్నాయి. ఇదివరకు మహిళలకు రూ.200-250 వరకు ఉండేది. పురుషులకు  రూ.300-350 ఇచ్చేవారు. ఇప్పుడు ఆడవాళ్లకు రూ.400-450, మగవాళ్లకు రూ.550-650 చెల్లిస్తున్నారు. గతంతో పొలిస్తే రెట్టింపు కూలీ ఇవ్వాల్సి రావడంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు పొలాలు దూరంగా ఉంటే ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. టీ, టిఫిన్లు సమకూరుస్తున్నారు. కొన్ని చోట్ల మగవారికి కల్లు(బీరు) ఖర్చు కింద మరో రూ.100 అదనంగా చెల్లిస్తున్నారు. ఇదివరకు ఎకరం నాటేందుకు రూ.2,000-2,500 అయ్యే వ్యయం ఇప్పుడు రూ.4-5 వేల వరకు కేవలం కూలీలకే వెచ్చించాల్సి వస్తోంది.
మిగతా పనులన్నీ పక్కకు..
జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువ. ఇందులో 80 శాతం మంది వ్యవసాయ పనులు తెలిసినప్పటికీ దూరంగా ఉంటున్నారు. ఇటీవల పెరిగిన కూలీతో వీరూ సామర్థ్యాన్ని బట్టి నాటేందుకో, లేదంటే కలుపు తీసేందుకో వెళ్తున్నారు. ఒక్క రోజు బీడీలు చేస్తే గరిష్ఠంగా వచ్చే(రూ.186) వచ్చే కూలికి రెట్టింపు వస్తోందని కాస్త కష్టమైనా పొలంబాట పడుతున్నారు. వీరే కాదు మొక్కలు నాటడం, పంట పొలాలకు కాల్వలు తీయడం లాటి ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలోనూ చాలా మంది కార్డుదారులు వ్యవసాయ పనులకే మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ కూలీల కొరత తీరడం లేదు.  
పక్క జిల్లాలకు పయనం..
ఇదివరకు ఏ ఊరి వారు అదే ఊళ్లో పనికెళ్లేవారు. మన జిల్లాలో చాలా చోట్ల నల్గొండ, మహబూబ్‌నగర్‌ పూర్వ జిల్లాల నుంచి కూలీలను ఎప్పటి మాదిరే గంపగుత్తాగా తీసుకొచ్చారు. ఇలా సుమారు 5 వేల మంది వరకు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సరిపోవడం లేదు. ఒక ఊరి నుంచి మరొక ఊరికి, ఒక మండలం నుంచి మరో మండలానికి దాటి.. ఇప్పుడు సరిహద్దు జిల్లాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. నందిపేట మండలం నుంచి అయిదు రోజులుగా ఉమ్మెడ వంతెన నుంచి నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం, ముథోల్‌ మండలాలకు పనులకు వెళ్తున్నారు. ఇదివరకు అక్కడి నుంచి ఇక్కడికి రప్పించేవారు. ఇప్పుడు అక్కడ నాట్లు జోరందుకోవడంతో ఇక్కడ నుంచి నిత్యం 500 మంది తరలివెళ్తున్నారు. ఇక్కడే కొరత ఉందంటే అక్కడ ఎక్కువ ఇస్తామనే ఆఫర్లతో తీసుకెళ్తుండటంతో స్థానిక రైతులు  లబోదిబోమంటున్నారు.

బదిలీలతోనే నెట్టుకొస్తున్నాం
- తేలు హన్మాండ్లు, రైతు, వేంపల్లి

పనులన్నీ ఒకేసారి రావడంతో కూలీ సమస్య వచ్చింది. గ్రామాల్లో ఎంతిచ్చినా దొరకడం లేదు. పొరుగురు నుంచి తెచ్చేదాకంటే ఒకరి పనులకు ఒకరు వెళ్లి కూలీ బదిలీ చేసుకోవాల్సి వస్తోంది. ఒకటి, రెండు రోజులు చేసే పని అయిదారు రోజులు పడుతోంది. పెట్టుబడి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.