బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ చేప! - East%20Godavari - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ చేప!

● అనుమతుల్లేని చెరువులకు విద్యుత్తు రాయితీలు

● కలెక్టర్‌ ఆదేశాలతో మేల్కొన్న అధికారులు

● జిల్లాలో ఇప్పటికే 95 మందికి తాఖీదులు

ముమ్మిడివరం మండలం అన్నంపల్లిలో అనధికార ఆక్వా చెరువుకు ఏర్పాటు

చేసిన విద్యుత్తు నియంత్రిక

పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లు తయారైంది కొందరు అధికారుల పరిస్థితి.. పత్రాలు అసలువో, నకిలీవో సరిచూసుకోకుండా ‘అడిగిందే’ తడవుగా ఆక్వా చెరువులకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేశారు.. వారు ఎంచక్కా రాయితీపై విద్యుత్తును

పొందుతున్నారు.. ఈ తంతు ఎప్పట్నుంచో కొనసాగుతుండగా... ఇటీవల కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మత్స్య, విద్యుత్తు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనధికార చెరువులకు విద్యుత్తు కనెక్షన్లు ఎలా పొందారు? ప్రభుత్వం అందించే విద్యుత్తు రాయితీ ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నీళ్లు నమలడం సదరు అధికారుల వంతయింది.

న్యూస్‌టుడే, ముమ్మిడివరం : జిల్లాలో ఆక్వా సాగు ఎప్పుడో గతి తప్పగా... అనుమతులు తీసుకున్నవి, తీసుకోనివి అన్న తేడా లేకుండా అడిగిన వారికి అడిగినట్లుగా విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చి తమ ‘చేతికి’ ఎముక లేదనిపించుకున్నారు విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మత్స్య, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు నిబంధనలను గాలికి వదిలేయడంతో ఇప్పటికే కోనసీమలో వరిచేలు, కొబ్బరి తోటలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. రామచంద్రపురం, కాజులూరు, జగ్గంపేట తదితర ..మిగతా 9లోమండలాలకు సైతం ఆక్వా సాగు వ్యాపించింది. ఈ రంగాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో జిల్లాలో 46 మండలాల్లోని 351 రెవెన్యూ గ్రామాలను ఆక్వా జోన్లుగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే 19,243 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తుండగా, మరో 8,395 హెక్టార్లలో సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆక్వాజోన్లు పరిధిలోని రాని ఎన్నో గ్రామాల్లో అనధికారికంగా చెరువులు తవ్వారు. అది సుమారు 30 వేల ఎకరాల వరకు ఉంటుంది. అధికారికం.. అనధికారికం అనే తేడా లేకుండా ఆక్వా చెరువులకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయడంతో వారంతా ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్తు రాయితీలను పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు దీనిపై దృష్టి సారించారు.

రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్తు

మత్స్యశాఖ నుంచి అనుమతులు పొందినవి, అనధికారికంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువుల్లో సుమారు 80 శాతం వరకు విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఆక్వా సాగుకు నెలకు సుమారు 32.50 మిలియన్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. కేటగిరీ-3లో వినియోగించే యూనిట్‌ విద్యుత్తు ధర రూ.3.85 పైసలు వంతున ఏటా రూ. 150.54 కోట్లు చెల్లించేవారు. గత ప్రభుత్వం ఆక్వా సాగుకు యూనిట్‌కు రూ..2 లు మాత్రమే రైతులు చెల్లిస్తే.. మిగిలిన రూ.1.86 పైసలు మత్స్యశాఖ ద్వారా రాయితీగా అందించేవారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వాసాగులో యూనిట్‌కు రూ.1.50లు రైతులు చెల్లిస్తే ప్రభుత్వ రాయితీ రూ.2.35 అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏటా ప్రభుత్వం ఆక్వా సాగులో రైతులకు రాయితీ రూపేణా రూ. 90 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. వీటిలో అనుమతులు లేని ఆక్వా చెరువులకు వారు అధికంగా రాయితీలు పొందుతున్నారు.

నిశితంగా పరిశీలిస్తే..

విద్యుత్తు శాఖ నుంచి అధికారికంగా కనెక్షన్లు పొందిన చెరువుల్లో కొన్నింటికి మత్స్యశాఖ అనుమతులు లేవు. ఆక్వా సాగుదారులకు విద్యుత్తు రాయితీకి సంబంధించి దరఖాస్తులను మత్స్యశాఖ అధికారులు పరిశీలన సందర్భంగా ఇవి బయటపడుతున్నాయి. ఎలాగంటే.. ఎవరో ఒక రైతు దళారుల ద్వారా మత్స్యశాఖ నుంచి ఆక్వాసాగుకు అనుమతులు తీసుకువస్తే.. సదరు అనుమతి పత్రాల్లో భూమి సర్వే నెంబరు, రైతు పేర్లు మార్చి వాటిని జిరాక్స్‌ కాపీలు తీసి విద్యుత్తు శాఖ అధికారులకు సమర్పించి కనెక్షన్లు పొందిన ఘటనలున్నాయి. విద్యుత్తు శాఖ ద్వారా రూ.

100 స్టాంపు పేపర్‌పై తమ వివరాలను విశదీకరించి.. ఆక్వా చెరువుకు వచ్చిన విద్యుత్తు బిల్లు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌లను సమర్పించి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందుతున్నారు. ఇటీవల విద్యుత్తు శాఖ అధికారులిచ్చిన కనెక్షన్లకు సంబంధించి రైతులు సమర్పించిన పత్రాలు తేడా ఉండడం గమనించి మత్స్యశాఖకు పంపించారు. వారు పరిశీలన అనంతరం అవి తాము మంజూరు చేయలేదని తేలడంతో వారు వాటి తొలగింపునకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 95 కనెక్షన్లు ఇలా బయటపడ్డాయి. ఈ విధంగా ఇంకా ఎన్నో ఉండే అవకాశం ఉంది. సర్వే నెంబర్ల ఆధారంగా మత్స్యశాఖ నుంచి అనుమతులు ఉన్నాయా.. లేదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అది అక్రమమో.. సక్రమమో తేలిపోతుంది.

నోటీసులు ఇస్తున్నాం..

ఆక్వాసాగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విద్యుత్తు కనెక్షన్లు పొందినట్లు గుర్తించాం. మత్స్యశాఖ అనుమతి తీసుకున్నట్లుగా వచ్చిన పలు ధ్రువీకరణ పత్రాలపై అనుమానం వచ్చి సదరు శాఖను సంప్రదించాం. ఆ శాఖ అధికారులు మంజూరు చేసినవి కాదని తేలింది. అమలాపురం, కాకినాడ డివిజన్‌లలోని ఆయా మండలాల్లో అక్రమ విద్యుత్తు కనెక్షన్లు పొందిన రైతులకు అసిస్టెంట్‌ ఇంజినీర్ల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాం. అక్రమ కనెక్షన్లుగా గుర్తించిన వాటికి ప్రభుత్వం అందించే రాయితీని నిలిపివేస్తున్నాం. ఆక్వా చెరువు సాగులో ఉంటే.. పంట తీసే వరకు అవకాశం ఇచ్ఛి. అప్పటి వరకు యూనిట్‌కు రూ.3.85 చొప్పున రుసుం వసూలు చేస్తాం. తర్వాత ఆ విధంగా విద్యుత్‌ రుసుం చెల్లిస్తామని ముందుకువచ్చినా ఉపేక్షించకుండా కనెక్షన్‌ను తొలగిస్తాం. - సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ, విద్యుత్తు సంస్థ

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.