ఎరవు - Bhadradri - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఎరవు

ఉభయ జిల్లాల్లో యూరియాకు పెరిగిన డిమాండ్‌

కాంప్లెక్స్‌ ఎరువులతో లింకు పెట్టి విక్రయాలు

కర్షకులపై తప్పని అదనపు భారం

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

ఖరీఫ్‌ సాగు ముమ్మరం కావడంతో ఎరువుల కంపెనీలు, వ్యాపారులు రైతుల నుంచి అందినంత దండుకొంటున్నారు. యూరియా కొనుగోలు చేసేందుకు వెళ్లిన రైతులకు అవసరం లేని వాటిని బలవంతంగా అంటగడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కర్షకులు ఎరువుల్ని కొనుగోలు చేయక తప్పడంలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్న అన్నదాతలకు అదనపు భారం అవుతోంది. మరోవైపు రైతులకు ఎర వేసి కొన్ని కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి.

ఆలస్యంగానైనా విస్తారంగా వర్షాలు కురవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వేసిన పంటలు ప్రాణం పోసుకుంటున్న తరుణంలో కర్షకులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఉభయ జిల్లాల్లో యూరియా అరకొరగానే సరఫరా అవుతోంది. పత్తి, మొక్కజొన్న, చెరకు వంటి మెట్ట పంటలతోపాటు ఇప్పుడు గణనీయంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

బంపర్‌ ఆఫర్‌ పేరుతో..

ఓవైపు భూసారాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతుల్ని చైతన్యవంతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా అందుకు విరుద్ధంగా ఎరువుల కంపెనీలు ప్రవర్తిస్తున్నాయి. తమ కాంప్లెక్స్‌ ఎరువులను అధికంగా కొనుగోలు చేసిన రైతులకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, వెండి, బంగారం నాణేలు బహుమతులుగా ఇస్తామని రైతులకు కూపన్లు ఇచ్చి ప్రచారం ఊదరగొడుతున్నాయి. 20 బస్తాలు కొన్న రైతులకు 20 బస్తాలు కూపన్లు ఇస్తామని రైతులకు ఆశ చూపి కాంప్లెక్స్‌ ఎరువులను విరివిగా వాడేలా చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతిని పంటలపై చీడపీడలు ఆశించి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ కొరతతో..

మెట్ట పంటలకు ఇప్పటి వరకు కాంప్లెక్స్‌ ఎరువులు వేసిన రైతులు ఇప్పుడు పచ్చగా ఉన్న తమ పంట పెరుగుదలకు యూరియా అవసరమైంది. అయితే సరఫరాదారులు తమ బాధ్యతలను విస్మరించి కృత్రిమ కొరత సృష్టించటం వల్ల యూరియా సక్రమంగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు అవసరాలను ఆసరాగా చేసుకున్న కొన్ని యూరియా కంపెనీలు తమకు ప్రభుత్వం కేటాయించిన కోటాను జిల్లాకు సక్రమంగా సరఫరా చేయకుండా తాత్సారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొన్ని కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువులతోపాటు పొటాష్‌ కూడా యూరియాతో లింకు పెట్టి ఇవ్వటంతో రైతులపై భారం మోపుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. యూరియా కొరత రానీయకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మార్క్‌ఫెడ్‌ వద్ద బఫర్‌ నిల్వలను సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా ఇప్పటి వరకు సరఫరా చేశారు. జిల్లాకు ఇప్పటి వరకు 30వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేశారు. ఇప్పుడు మరో 8 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంది. ఈనెలాఖరు వరకు దీన్ని తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మికుమారి ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడటం వల్ల జిల్లాకు చాలా వరకు యూరియాను తెప్పించగలిగారు.

పెరిగిన డిమాండ్‌

ఆగస్టులో యూరియా వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. పత్తి విత్తేకాలం ముగిసే నాటికి జిల్లాలో సుమారు 45వేల హెక్టార్లలో మాత్రమే రైతులు పంట సాగు చేశారు. ఎప్పుడైతే వర్షాలు రావటం ఎక్కువైందో అప్పటి నుంచి మళ్లీ పత్తిని విత్తటం మొదలు పెట్టారు. తరుణం మించి పోయినప్పటికీ ఇతర పంటలు వేసుకునే అవకాశం లేదని చెప్పి రైతులు పత్తినే ఆలస్యంగా సాగు చేశారు. దీనివల్ల ఇప్పుడు పత్తి సాగు విస్తీర్ణం 82వేల హెక్టార్లకు పెరిగింది. ఈసారి సాగర్‌ జలాలను కూడా విడుదల చేస్తున్నారు. దీని వల్ల వరి సాగు విస్తీర్ణం కూడా పెరగనుంది. దీంతో యూరియా అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలాంటి అనుకోని పరిస్థితుల వల్ల యూరియాకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది.

అరకొరగా సరఫరా

జిల్లాకు ఏటా యూరియాను సరఫరా చేసే పలు కంపెనీలు ఈ ఖరీఫ్‌ సీజన్లో చాలా వరకు ముఖం చాటేశాయి. కొన్ని కంపెనీలు తమ కర్మాగారంలోనే నేరుగా సన్న యూరియాను సరఫరా ఉత్పత్తి చేయగా, దొడ్డు యూరియాని మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి ఆయా కంపెనీలకు ప్రభుత్వం నిర్దేశించిన కోటాను జిల్లాలకు చేరవేసి రైతుల అవసరాలకు అనుగుణంగా డీలర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే కంపెనీలకు విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియాని కేటాయిస్తే దానిని వ్యాపార వస్తువుగా మార్చి ఇతర ఎరువులతో లింకులు పెట్టి రైతులపై పెనుభారం మోపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దిగుమతి అయిన దొడ్డు యూరియాని ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, ఇఫ్కో, క్రిభ్‌కో, ఆర్‌సీఎఫ్‌ వంటి వాటి ద్వారా సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌ డీలర్ల నుంచి రైతులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే సంబంధిత సంస్థలు కూడా తమకు లాభదాయకంగా మారిన కాంప్లెక్స్‌ ఎరువులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి జిల్లాకు తెచ్చి గోదాముల్లో నిల్వ చేశాయి. ఈనెల 20న ఖమ్మంకు వ్యాగన్‌లో దొడ్డు యూరియాను తెచ్చిన ఎన్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ దీనితోపాటు పొటాష్‌ని కూడా ముడిపెట్టి విక్రయించాయి.


యూరియా కొరత లేదు

ఝాన్సీలక్ష్మికుమారి, డీఏవో, ఖమ్మం

జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత లేదు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం. యూరియా కొరత ఎక్కడా లేదు. కావాల్సినంత సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.