close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

అక్షరాస్యత సవాల్‌!

రాష్ట్రంలో చివరి స్థానాల్లో నాలుగు జిల్లాలు
పిల్లలతో చదువు చెప్పించేందుకు కార్యాచరణ
పకడ్బందీగా ముందుకు వెళ్లకుంటే ఇబ్బందే
న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), రాజోలి

రాజోలిలోని సాక్షరభారత్‌ కేంద్రంలో అక్షరాలు నేర్చుకుంటున్న మహిళలు (పాత)

ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాగా పేరు.. దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్న మండలం జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు.. రాష్ట్రంలో జిల్లాల విభజన తరవాత కూడా ఈ పరిస్థితుల్లో మార్పులు కనిపించలేదు.. రాష్ట్రంలో ఏకంగా నాలుగు జిల్లాలు చివరి నుంచి నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి.. మహబూబ్‌నగర్‌ జిల్లా మాత్రం కొంత పరవాలేదనిపించింది.. పురుషుల అక్షరాస్యతతో పోలిస్తే మహిళల అక్షరాస్యత ఉమ్మడి జిల్లాలో మరీ తక్కువగా ఉంది.. ఈ పరిస్థితి మారాలని పిల్లలతో తల్లిదండ్రులకు చదువు చెప్పించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించి అక్షరాస్యత పెంచేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోకుంటే ఈ కార్యక్రమం అనుకున్న ఫలితం వచ్చే అవకాశం లేదు.. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పరిస్థితి.. తక్కువ అక్షరాస్యతకు కారణాలు.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

బిజినేపల్లి మండలం పాలెంలో విద్యార్థి- తల్లిదండ్రుల అక్షరాస్యత కార్యక్రమంపై

అవగాహన కరదీపికలు విడుదల చేస్తున్న అధికారులు

మహిళల అక్షరాస్యత తక్కువ :  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 70.67 శాతం పురుషుల అక్షరాస్యత ఉండగా మహిళల అక్షరాస్యత 51.22 శాతంగా ఉంది. పురుషుల అక్షరాస్యత 19.45 శాతం అధికం.
* వనపర్తి జిల్లాలో పురుషుల అక్షరాస్యత  శాతం 65.73 కాగా మహిళల అక్షరాస్యత శాతం 45.27. మహిళల అక్షరాస్యత 20.46 శాతం తక్కువగా ఉంది.
* నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పురుషుల అక్షరాస్యత 64.85 శాతం ఉండగా మహిళల అక్షరాస్యత 43.64గా ఉంది. పురుషుల కంటే మహిళల అక్షరాస్యత 21.21 శాతం తక్కువగా ఉంది.
* నారాయణపేట జిల్లాలో పురుషుల అక్షరాస్యత 60.32 శాతం ఉండగా మహిళల అక్షరాస్యత 39.72గా ఉంది. మహిళల కంటే పురుషుల అక్షరాస్యత 20.84 శాతం అధికంగా ఉంది.
* జోగులాంబ గద్వాల జిల్లాలో పురుషుల అక్షరాస్యత 60.05 శాతం ఉండగా మహిళల అక్షరాస్యత 39.48 శాతం ఉంది. పురుషుల అక్షరాస్యత 20.57 శాతం అధికంగా ఉంది.
* ఎందుకీ వెనుకబాటు?
* ఆడపిల్లలకు చదువు చెప్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి వయసు వచ్చిన వెంటనే వివాహం చేస్తే ఇల్లు చూసుకుంటుంది అనే అభిప్రాయం ఇంకా చాలామందిలో ఉంది. ఇటీవల కాలంలో కొంచెం మార్పు కనిపిస్తున్నా, అది అక్షరాస్యతలో పెద్దగా మార్పు తెచ్చే స్థాయిలో లేదు.
* జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికీ పిల్లలను పాఠశాలలకు పంపించకుండా కూలీ పనులకు పంపిస్తుంటారు. బడుల్లో చదువుకునే చిన్నారులు రెండు, మూడు నెలలు ఇలాంటి పనులకు వెళ్లడంతో వారు చదువులో వెనుకంజలో ఉంటున్నారు.

* మహబూబ్‌నగర్‌ జిల్లాలో అక్షరాస్యత మిగతా జిల్లాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఈ ప్రాంతంలో చదువుపై అవగాహన ఉండటంతో అక్షరాస్యత కొంత ఎక్కువగా ఉంది. మహిళల అక్షరాస్యత మాత్రం తక్కువగానే ఉంది. ప్రధానంగా ఆడపిల్లలను చదువుకు దూరంగా ఉంచుతున్నారు. ఇప్పటికి మగ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఆడపిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు.
* నారాయణపేట జిల్లాలో వలసలు ఎక్కువ. మద్దూరు, ధన్వాడ, దామరగిద్ద తదితర ప్రాంతాల నుంచి వలసలు వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను తమ వెంట తీసుకెళ్లడం ఎక్కువ. దీంతో అక్షరాస్యత మెరుగవడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు వస్తున్నప్పటికి ఆశించినంత మేర ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడే పిల్లలను పెట్టి చదివించేందుకు అవకాశం ఉంది.
* వనపర్తి జిల్లా పది, ఇంటర్‌ ఫలితాల్లో ముందు వరుసలో ఉన్నప్పటికి అక్షరాస్యతలో వెనుకబడి ఉండటం గమనార్హం. సర్కారు బడులు తక్కువగా ఉండటం, పాఠశాలల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతంలో అప్పట్లో చాలా మంది విద్యకు దూరమై వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
* నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతం, కొల్లాపూర్‌, బిజినేపల్లి, తిమ్మాజిపేట వంటి ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వలస వెళ్లడంతో వారి పిల్లలు వెళ్తుంటారు. దీంతో చదువు తక్కువే. ఇటీవల కాలంలో కొంత ప్రజల్లో అవగాహన పెరిగి పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు.

ఎవరిది బాధ్యత?
సాక్షర భారత్‌ కార్యక్రమం సమయంలో గ్రామానికి కనీసం ఒకరి నుంచి ఇద్దరు సమన్వయకర్తలు ఉండేవారు. కాని ప్రస్తుతం వారిని తొలగించారు. పిల్లలతో తల్లిదండ్రులకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం పెద్దగా సిబ్బంది లేని పరిస్థితి ఉంది. వయోజన విద్యాశాఖ నుంచి జిల్లాకు కనీసం ఒక్క అధికారి కూడా లేరు. అయిదు జిల్లాలు ఉండగా నలుగురు మాత్రమే అధికారులు ఉన్నారు. ఇక పిల్లలు చదువు చెప్పేందుకు ప్రత్యేక పుస్తకాలు లేవు. మొదటి తరగతి పుస్తకాలతోనే చదువు చెప్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండు శాఖలు సమన్వయం చేయకుంటే కార్యక్రమం అమలు సరిగ్గా కాదు. బాధ్యతాయుతంగా శాఖలు వ్యవహరించకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు.

అక్షరాలు నేర్పించేలా చర్యలు తీసుకుంటాం :  విద్యార్థులే గురువులుగా వారి తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పించే కార్యక్రమం చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ విషయంపై వారం రోజుల్లో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తాం. ఈ ప్రత్యేక కార్యక్రమంతో వారి పిల్లలు ప్రేమతో చెబితే తల్లిదండ్రులు అక్షరాలు నేర్చుకుంటారని భావిస్తున్నాం. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభించి విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- సుశీంద్రరావ్‌, డీఈవో, జోగులాంబ గద్వాల

చర్యలు చేపట్టాం.. : ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు సాక్షరభారత్‌ ద్వారా చదువు చెప్పే కార్యక్రమాలను నిర్వహించాం. ఇప్పుడు పిల్లలతో చదువు చెప్పించే కార్యక్రమం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా అక్షరాస్యతలో కొంత మెరుగవుతుందన్న నమ్మకం ఉంది. కనీసం చదవడం, రాయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం.

- వీరభద్రరావు, వయోజనశాఖ ఉప సంచాలకులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.