close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

పత్తిపై పంజా?

తెగులుతో తీవ్రంగా దెబ్బతిన్న పంట
జిల్లా  అన్నదాతల ఆశలపై నీళ్లు

మల్దకల్‌ : ఎద్దులగూడెంలో తెగుళ్లతో దెబ్బతిన్న పత్తి పంటను చూపిస్తున్న రైతు చిన్న నర్సింహులు

జిల్లాలో ఈసారి 40వేల హెక్టార్లలో విత్తనపత్తి, సాధారణ పత్తి పంటలు సాగయ్యాయి. మొక్క ఏపుగా పెరిగి పూత, పిందె పట్టి కాయపగిలే దశలో అంతు చిక్కని తెగులు సోకి పంట ఎర్రబారటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ పండించిన సర్టిఫైడ్‌ పత్తి విత్తనాలనే కంపెనీలు శుద్ధిచేసి దేశవ్యాప్తంగా రైతులకు విక్రయిస్తుంటాయి. ఈ కారణంగా సాధారణ పత్తి సాగుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.  జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, గద్వాల

పత్తిపంటలో తెగులు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదట రెండు, మూడు మొక్కలకే పరిమితమైన తెగులు పది రోజుల్లోనే పొలమంతా వ్యాపిస్తోంది. మొక్కల ఆకులు మొత్తం పిందె, పక్వానికి వచ్చిన కాయలు కూడా రాలిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) తెగులు సోకిన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై వివరాలు సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. సోకిన తెగులు పేరేంటో, నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పలేకపోతున్నారు. ఏం చేయాలో తెలియక రైతులు తెగులును అరికట్టటం కోసం పురుగు మందుల డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారిచ్చే మందులను ఇష్టానుసారంగా పిచికారి చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

ఆశలు ఆవిరవుతున్నాయి : తెగులుతో మా ఆశలు ఆవిరవుతున్నాయి. కష్టపడి క్రాసింగ్‌ చేసి చెట్టుకు కాయలు నిలిబడేలా చేశాం. చివరి దశలో తెగులు సోకి తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గి నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలి. 

- నర్సింహులుగౌడు, రైతు, ఎద్దులగూడెం(మల్దకల్‌)

మా దృష్టికి వచ్చింది : జిల్లాలో విత్తన, సాధారణ పత్తిపంట ఎర్రబారుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఏఈవోలతో నేను కూడా వెళ్లి పరిశీలించా. ఉన్నతాధికారులకు వివరించాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు త్వరలోనే జిల్లాకు వస్తారు. తెగులు సోకిన పొలలను పరిశీలించి రైతులకు నివారణ చర్యలు సూచిస్తారు. 

- గోవిందు నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి, జోగులాంబ గద్వాల

విత్తన పత్తిలోనే ఎక్కువగా.. : విత్తనపత్తి పంట క్రాసింగ్‌ పనులు ప్రారంభించిన 50 రోజులకే ఈ తెగులు సోకింది. పంట ప్రస్తుతం కాయ పగిలే స్థితిలో ఉంది. ఇది సోకటం వల్ల గింజ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది ఏం తెగులో వ్యవసాయాధికారులు కూడా చెప్పటం లేదు. జిల్లాలో వేల ఎకరాల్లో పంట దిబ్బతింది.

- చిన్న నర్సింహులు, రైతు, ఎద్దులగూడెం(మల్దకల్‌)

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.