close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

తల్లడిల్లిన బంధుగణం

కన్నీరుమున్నీరుగా అంతిమయాత్ర
ఒక్కసారిగా కాలనీల్లో విషాద ఛాయలు

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: గోదావరిలో పడవ మునిగిన సంఘటనలో మృతిచెందిన పాడి భరణికుమార్‌, కోదండ విశాల్‌ అంత్యక్రియలు బుధవారం హయత్‌నగర్‌లో బంధు మిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పూర్తయ్యాయి. ఈనెల 15న ఆదివారం పాపికొండల విహారయాత్రకు స్నేహితులతో కలిసి వెళ్లిన భరణి, విశాల్‌ గల్లంతయిన విషయం తెలిసిందే. వారితో పాటు వెళ్లిన జరణికుమార్‌, అర్జున్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతయిన వారికోసం ఆదివారం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించగా.. మంగళవారం మధ్యాహ్నం తరువాత భరణి మృతదేహం ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో, విశాల్‌ మృతదేహం బోటు మునిగిన ప్రాంతానికి సమీపంలో దొరికినట్లు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తయిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి నగరానికి ప్రత్యేక వాహనంలో పంపించారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో వారు హయత్‌నగర్‌కు చేరుకున్నారు.

దు:ఖ సాగరంలో బంధుమిత్రులు..
పాపికొండల విహార యాత్ర రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. చేతికి అందిన కొడుకులను గోదారమ్మ తనలో కలిపివేసుకోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మృతులు ఇరువురిదీ ఒకే బస్తీ. దీంతో రెండు రోజులుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బస్తీవాసులు వారిద్దరూ క్షేమంగా ఇల్లుచేరాలని ప్రార్థించారు. మృతదేహాలు దొరికినట్లు సమాచారం అందుకున్నప్పటి నుంచి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. భరణికుమార్‌ ఫోన్‌పేలో ఉద్యోగం చేస్తుండగా.. విశాల్‌ ఉప్పల్‌లోని 24/7లో పనిచేస్తున్నాడు. భరణికుమార్‌ సోదరి పరిస్థితి మరింత బాధగా ఉంది. నిన్నటి వరకు తన సోదరుడు క్షేమంగానే వస్తాడన్న ధీమా ఆమెలో కన్పించింది. కానీ అతని మరణవార్త విన్నతరువాత ఆమె దు:ఖం కట్టలు తెంచుకుంది.  చేతికందిన పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి పిల్లలతో సంతోషంగా ఆడుకుందామనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలయ్యాయి.

ప్రజాప్రతినిధుల పరామర్శ..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోమవారం ఉదయం బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వెంటనే  అనుచరులతో కలిసి రాజమండ్రికి బయలుదేరారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జరణికుమార్‌, అర్జున్‌ను కలిసి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. గల్లంతయిన వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించారు. మంగళవారం సాయంత్రం ఆయన తిరిగి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలు హయత్‌నగర్‌కు రాగానే అక్కడకు చేరుకుని వారికి నివాళులర్పించారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు సామతిరుమల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి ఉన్నారు.
* జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాయకులు సామరంగారెడ్డి, రామ్మోహన్‌గౌడ్‌ హయత్‌నగర్‌కు వచ్చి మృతులకు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వారి అంతిమ యాత్రలో పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.