close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

ఇల్లు కట్టలేమా..

 ఏజెన్సీ పంచాయతీల్లో  ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు

విధానంతో గిరిజనేతరుల అవస్థలు

జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి వేలమంది ఎదురుచూపులు

నాన్‌ ఏజెన్సీలో వెబ్‌సైట్‌ సమస్యలు

అశ్వాపురం, న్యూస్‌టుడే

కొన్ని నెలలుగా జిల్లాలో గిరిజనేతరులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ నిబంధనలు వారికి బంధనాలు వేస్తున్నాయి. నూతనంగా ఇళ్లు కట్టుకునేందుకు, ఇళ్ల స్థలాల కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి పురోగతికీ అధికారులు ఆస్కారం ఇవ్వటం లేదు. ఇక నాన్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియకు వెబ్‌సైట్‌ తెరుచుకోవటం లేదు. అధికారులనడిగితే అంతా సవ్యంగానే ఉందంటున్నారు. పారదర్శకత కోసం గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ నమోదు విధానం ఉండీ ఉపయోగంలేని చందంగా తయారైంది. మూడు నెలలుగా అన్ని ఏజెన్సీ గ్రామాల్లో ఈ సమస్య నానుతోంది.

ద్రాద్రి జిల్లాలో మొత్తం 479 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిల్లో కేవలం 25 గ్రామ పంచాయతీలు నాన్‌ ఏజెన్సీలో ఉన్నాయి. మిగిలిన 454 గ్రామ పంచాయతీలూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1/70 చట్టం అమలవుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య, అలాగే గిరిజనేతరుల మధ్య అటవీ ప్రాంతంలో లావాదేవీలు నిషిద్ధం. ఒకవేళ జరిగినా అవి అనధికారంగా ఉంటాయి. వాటికి చట్టబద్ధత ఎలాంటి ఉండదు. ఇక్కడ ఇళ్లకు, ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్లు ఉండేవికావు. అనుమతులు లేకుండానే గిరిజనేతరులు ఇళ్లు నిర్మించుకునేవారు. తర్వాత ఆ వివరాలు గ్రామ పంచాయతీల్లో అందిస్తే వారు ఏదో ఇంటి నంబరు కేటాయించి ఇంటి పన్ను వసూలు చేసేవారు. ఇంటిపన్ను చెల్లింపులకు సంబంధించి రసీదులు ఇచ్చేవారు. స్థానిక పంచాయతీలు రాతపూర్వకంగా ఇచ్చే ఈ రసీదుల సాయంతో విద్యుత్తు సదుపాయం సమకూర్చుకుంటున్నారు. ఇతరత్రా అవసరాలకు, గుర్తింపునకు రసీదులను ఆధారంగా చేసుకుంటున్నారు. పై ప్రక్రియల్లో వేటికీ చట్టబద్ధత లేకున్నా నివాస విషయాల్లో గిరిజనులకు ఇబ్బందులు లేకుండా ఉండేది. ఆయా పంచాయతీల పరిధిలోనే కార్యకలాపాలు జరుగుతుండేవి.

తాజా నిబంధనలతో..

ప్రభుత్వం మూడు నెలల క్రితం తెచ్చిన నిబంధనలతో పీటముడి పడింది. పంచాయతీల్లోనూ ఇళ్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి చేసింది. దీంతో గిరిజనేతరులు నానా అవస్థలు పడుతున్నారు. ఆన్‌లైన్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే రిజిస్ట్రేషను సంఖ్య, తేదీ, ప్లాట్‌ సంఖ్య, రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం తదితరాలు అనేకం అడుగుతోంది. అవన్నీ సబ్‌మిట్‌ చేస్తేనే ఆన్‌లైన్‌ అవుతున్నాయి. వాటిల్లో ఏ ఒక్కటీ లేకున్నా కావడం లేదు. నిజానికి అవేవీ ఏజెన్సీలో గిరిజనేతరులకు ఉండవు. ఈ పరిస్థితుల్లో చిన్నాచితక, మారుమూల గ్రామ పంచాయతీల్లో పదుల సంఖ్యలో, పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతోన్న గ్రామ పంచాయతీల్లో వందల సంఖ్యలో పలువురు ఇల్లు కట్టుకోవటానికి, ఇళ్ల స్థలం కొనుగోలుకు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వారి సంఖ్య దాదాపుగా 12 వేలకు పైగా ఉండవచ్చుననేది అంచనా. ఒక్క మండల కేంద్రమైన అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోనే వంద మంది బాధితులున్నారు. పంచాయతీల్లో ఇళ్లు, ఇంటి స్థలాలు నమోదు చేసుకోకపోవటంతో నల్లాలు పెట్టుకోవాలన్నా, బోర్లు వేసుకోవాలన్నా, విద్యుత్తు మీటర్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నా కుదరడం లేదు. జిల్లాలో 454 గ్రామ పంచాయతీల్లోనూ కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది.

ఇలా చేస్తేనే..

నూతన నిబందనల ప్రకారం ఏ గ్రామాల్లో అయినా ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేస్తే తహసీల్దారు నుంచి తొలుత నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఇంటిపై, ఇంటి స్థలంపై ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలు లేవని ఆయన ధ్రువీకరించాలి. దాన్ని తీసుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి. విలువను బట్టి అక్కడ నిర్ణీత రుసుము చెల్లించాలి. వారు రిజిస్ట్రేషను సంఖ్యను ఇస్తారు. ఆ సంఖ్యను తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు దరఖాస్తును నివేదిస్తారు. దాన్ని ఉన్నతాధికారులు ఆమోదిస్తే ఆ ఇల్లు, లేదా ఇంటి స్థలం వారి పేరున గ్రామ పంచాయతీలో నమోదవుతుంది. గిరిజనేతరుల విషయంలో ఇది సాధ్యమయ్యే ప్రక్రియకాదు.

ఇంకోవైపు ఇలా..

జిల్లాలోని గిరిజనేతర గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ రిజిస్ట్రేషను చేసుకునే అవకాశం ఉన్నా వైబ్‌సైటే తెరుచుకోవడం లేదు. దాంతో గ్రామ పంచాయతీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతోందనే సమాధానం చెబుతున్నారు. 25 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. వేయికి పైగా దరఖాస్తులు ఉన్నాయి. ఉదాహరణకు అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామ పంచాయతీ పరిధిలోనే దాదాపు వందమంది దరఖాస్తులు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

ఇబ్బందులు ఎదురవుతున్నాయి

మర్రి మల్లారెడ్డి, సర్పంచి, మొండికుంట

నాన్‌ ఏజెన్సీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాథమికంగా వెబ్‌సైౖట్‌ ఓపెన్‌ కావడం లేదు. నమోదులు జరపలేక పోతున్నాం. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. వారు పెద్దగా పట్టించుకోవడం లేదు.

చేయగలిగిందేమీ లేదు: ఆశాలత, జిల్లా పంచాయతీ అధికారి

ఏజెన్సీలో గిరిజనుల మధ్య మాత్రమే క్రయవిక్రయాలు, ఆస్తుల మార్పిడి చెల్లుతాయి. గిరిజనేతరుల నుంచి గిరిజనులు ఆస్తులు క్రయంచేసినా అవి చెలుబాటవుతాయి. వారి పేరు మీద నమోదవుతాయి. కాని గిరిజనేతరుల మధ్య క్రయవిక్రయాలు జరిగినా, గిరిజనేతరులు గిరిజనుల నుంచి క్రయం జరిపినా అవి చెల్లవు. ఈ విషయంలో చేయగలిగిందేమీ లేేదు. ప్రజలు, ప్రజాప్రతినిధులే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కనుగొనే దిశలో కృషి చేయాలి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను..

రేగా కాంతారావు, ప్రభుత్వ విప్‌

ఏజెన్సీలో అమలవుతున్న 1/70 చట్టం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ప్రస్తుత సమస్యపై నాకు అవగాహన ఉంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. గిరిజనేతరుల ఇళ్ల, ఆస్తుల సంబంధ సమస్యను లోక్‌సభలో మా పార్టీ సభ్యుల ద్వారా కేంద్రం దృష్టికీ తీసుకెళ్తాను.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.