close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

నగరయానం.. నరకప్రాయం!

రోడ్లపై కంకరరాళ్లు... గుంతలు
తరచూ స్తంభిస్తున్న రాకపోకలు
జీహెచ్‌ఎంసీతో కలిసి మరమ్మతులు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో రహదారులు పాడయ్యాయి. కొన్ని చోట్ల కంకరతేలి, గుంతలు పడగా... మరికొన్ని చోట్ల ఇసుక మేటలు వేసినట్టు సన్నటి కంకర రోడ్లపై పేరుకుపోయింది. గంటకు 20 వేల వాహనాలు రాకపోకలు సాగించే పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, బేగంపేటల్లో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు తరచూ స్తంభిస్తున్నాయి. సికింద్రాబాద్‌-మాదాపూర్‌, కూకట్‌పల్లి- ఎల్బీనగర్‌ మార్గాల్లో నిమిషాల తరబడి ట్రాఫిక్‌ ఆగిపోతుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు స్వయంగా రంగంలోకి దిగారు. ఎక్కువగా ట్రాఫిక్‌జాం అవుతున్న ప్రాంతాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో అక్కడ తారుతో గుంతలను పూడ్చుతున్నారు. బేగంపేట, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మాసాబ్‌ట్యాంక్‌ పైవంతెనలపై వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగేలా మరమ్మతులు చేయిస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్‌ పైవంతెనపై చాలా చోట్ల గుంతలున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి ఈనెల 15వ తేదీ రాత్రి పైవంతెనపై వాహనాల రాకపోకలను నిలిపేసి మరమ్మతులు చేయించారు. ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితి ఉందో అక్కడ మరమ్మతులు చేపట్టాలంటూ ఉన్నతాధికారులకు తెలిపారు.

153 చోట్ల తీవ్ర ఇబ్బందులు
వర్షాల వల్ల నగరంలోని 153 చోట్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు నివేదిక ఇచ్చారు. ప్రధానంగా ఆబిడ్స్‌, కోఠి, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, బేగంపేట, ఎస్సార్‌నగర్‌, ఖైరతాబాద్‌లు వీటిలో ఉన్నాయి. సాధ్యమైనంత వేగంగా అక్కడ మరమ్మతులు చేపట్టాలని వివరించారు.

మెహిదీపట్నం-మాసాబ్‌ట్యాంక్‌-బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 మార్గంలో ఎక్కువ సేపు వాహనాలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.
అమీర్‌పేట-పంజాగుట్ట మార్గంలో ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ నుంచి బిగ్‌బజార్‌ వరకూ, పంజాగుట్ట మెట్రో రైల్‌ స్టేషన్‌ నుంచి పంజాగుట్ట కూడలి వరకూ రద్దీ వేళల్లో వాహనాలు రోజూ నిముషాల తరబడి ఆగిపోతున్నాయి.
పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్‌ కూడలి వరకూ నిమ్స్‌ ఆసుపత్రి, ఆర్టీఏ కార్యాలయం వద్ద సాయంత్రం వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మరమ్మతులు ప్రధాన ప్రాంతాలకే పరిమితం
జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రధాన ప్రాంతాలైన కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లలో మాత్రమే రహదారులను బాగు చేస్తున్నారు. పంజాగుట్ట, చిక్కడపల్లి, లక్డీకాపూల్‌, అంబర్‌పేట, వెస్ట్‌మారేడ్‌పల్లి, ఇంపీరియల్‌ గార్డెన్స్‌, నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతాల్లో రోడ్లపై కంకర తేలినా, గుంతలున్నా పట్టించుకోవడం లేదు. పంజాగుట్ట, నెక్లెస్‌ రోడ్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, గోల్కొండ క్రాస్‌రోడ్స్‌ మార్గాల్లో వాహనదారులు అదుపుతప్పే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.