close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

అధికారిపై ప్రేమ..ఆదాయం పక్కదోవ

నెక్లెస్‌ రోడ్డుపై హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యం

సందర్శకులు అవస్థల పాలవుతున్నా, రూ.కోట్లలో ఆదాయానికి గండి పడుతున్నా.. హెచ్‌ఎండీఏకు పట్టడం లేదు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ(బీపీపీఏ) తీరుపై విమర్శలొస్తున్నా కన్నెత్తి చూడటం లేదు. పైగా గతంలో బాధ్యతల నుంచి తప్పించిన అధికారికే మళ్లీ టెండర్ల కేటాయింపు, ఇతర కీలక అంశాలు అప్పగించడం  గమనార్హం.

ఈనాడు, హైదరాబాద్‌

కాసేపు సేదతీరేందుకు ఆ రోడ్డు బాటపట్టే అనేకమందికి ఆహ్లాదం దూరమైపోయింది. క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండానే యంత్రాంగం హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎటువంటి విమర్శలు తలెత్తినా ఖాతరు చేయడం లేదు. 92 ఎకరాల్లోని సంజీవయ్య పార్కును ఏకంగా పిల్లల పార్కుగా మార్చేశారు. భారీ జాతీయ జెండాను చూడాలనుకున్నా; రాక్‌ గార్డెన్‌, గులాబీ వనం(రోజ్‌ గార్డెన్‌), సీతాకోకచిలుకల ఉద్యానం(బటర్‌ ఫ్లై పార్కు), హెర్బల్‌ గార్డెన్‌ను సందర్శించాలనుకున్నా పక్కనే 14 ఏళ్లలోపు పిల్లలుండాల్సిందే! లేదంటే లోపలికి అనుమతించడం లేదు. పోనీ లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌కు వెళ్దామనుకుంటే అక్కడి పరిస్థితి మరోలా ఉంది. సేదతీరడం అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎందరినో అమితంగా ఆకట్టుకునే రైలు, మచాన్‌ ట్రీ, హంటెడ్‌ హౌజ్‌, టవర్లు, బంగీ జంప్‌ వంటి వినోద కేంద్రాలను సైతం మూసేశారు. దీంతో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులూ నిరాశకు లోనవుతున్నారు.

రూ.2 కోట్ల వరకు గండి
నెక్లెస్‌రోడ్డు పరిధిలోని పార్కులు, పీపుల్స్‌ ప్లాజా, తదితర చోట్ల టెండర్ల ద్వారా వినోద కేంద్రాలను నిర్వహించే బాధ్యతను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లోని ట్రైన్‌కు రూ.6 లక్షలు, టవర్‌కు రూ.4లక్షలు, క్యాంటీ¨న్‌కు రూ.9లక్షలు, బంగీ జంప్‌కు రూ.3.5 లక్షలు ప్రతినెలా బీపీపీఏకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన అన్ని పార్కుల్లోని వినోద కేంద్రాలు, క్యాంటీన్లపై రూ.50 లక్షలదాకా ప్రతినెలా ఆదాయం సమకూరుతుంది. మూడు నెలలకు బదులుగా.. ఏడాది అద్దెను ముందస్తుగానే చెల్లించాలంటూ సంస్థకు చెందిన ఓ అధికారి మెలిక పెట్టారు. ఒకేసారి చెల్లించలేమని సంబంధితులు చేతులెత్తేయడంతో నాలుగు నెలల కిందట వినోద పరికరాలను మూసేశారు. కొత్తగా టెండర్లను ఆహ్వానించి వేరేవారికి దుకాణాలు కేటాయించే వరకైనా అవకాశం ఇవ్వాలని కోరినా.. అతీగతీ లేదు. ఫలితంగా అద్దెల రూపేణా వచ్చే రూ.2 కోట్లమేరకు ఆదాయానికి గండి పడినట్లయింది.

దీని వెనక మతలబు ఏమిటో..
రూ.కోట్ల ఆదాయానికి గండిపడేలా నిర్ణయం తీసుకున్న అదే అధికారిపై టెండర్ల కేటాయింపులోనూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 12 ఏళ్ల నుంచి లుంబినీ పార్కులో లేజర్‌ షో నిర్వహణను బీపీపీఏనే చూసుకుంటోంది.   ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం సమకూరే దాని నిర్వహణ బాధ్యతను అకస్మాత్తుగా ఓ ప్రైవేట్‌ సంస్థకు రూ.1.11 కోట్లకే అప్పగించడంపైనా సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఇదీ కాకుండా సదరు సంస్థకు ‘మేలు చేసేలా’ టికెట్‌ పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు వినవస్తోంది. నెక్లెస్‌రోడ్డులో చేపట్టిన ఓ ప్రాజెక్టులో నష్టాలు రావడంతో షో నిర్వహణను తమకు అప్పగించాలంటూ సదరు సంస్థ అప్పట్లో కోరింది. 11 నెలల నుంచి ఒప్పందం చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఈ కాంట్రాక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు. లుంబినీ పార్కులోని వాటర్‌ ఫౌంటెయిన్‌ నిర్వహణ బాధ్యతను అనుభవం లేని ఒక సంస్థకు రూ.కోటిన్నరకు పైగా మొత్తానికి కట్టబెట్టినట్లు వెల్లడైంది. సదరు అధికారి వ్యవహారశైలిపై అంతటా దుమారం రేగడంతో, బీపీపీఏ బాధ్యతల నుంచి తప్పించి అప్పట్లో మరొకరికి వాటిని అప్పగించారు.

మళ్లీ చక్రం తిప్పుతున్న వైనం
కొంతకాలం దాకా బీపీపీఏ కార్యకలాపాలకు దూరంగా ఉన్న అధికారి మళ్లీ రంగంలోకి దిగి వ్యవహారాలు  సాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ టెండర్ల వ్యవహారాన్ని అనధికారికంగా ‘పర్యవేక్షిస్తున్నారు’. వారూ వత్తాసు పలుకుతుండటంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో బాగానే ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆధునికీకరించేందుకు రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలవడంపై సాక్షాత్తు బీపీపీఏలోని వారే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈలోగా అదే గార్డెన్‌లో కొత్తగా వినోద కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు రూ.1.5 కోట్లతో మరో టెండర్‌ పిలవడం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.