close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

రక్తనిధి.. హతవిధి!

నిలోఫర్‌ ఆసుపత్రిలో దుస్థితి
కీలక యంత్రాలుకరవు
రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే

నిలోఫర్‌ ఆసుపత్రి తరచుగా వార్తలకెక్కుతోంది. ఇక్కడ పది రోజుల క్రితం చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చా యి. అయిదారేళ్లుగా ఆరోపణలు ఉన్నాయని, అంతా చట్టానికి లోబడే సాగుతోందని  వైద్యులు వివరించారు. దీనంతటికీ కార ణం ఇద్దరు వైద్యుల నడుమ ఉన్న ఆధిపత్య పోరేనని తేలింది. స్పందించిన ప్రభుత్వం విచారణకు అప్పుడే త్రిసభ్య కమిటీని నియమించింది. పోలీసులు సైతం పరిశీలన జరుపుతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి రక్తం అవసరమై.. ఆమెకు ఏ గ్రూప్‌ రక్తం ఎక్కించాల్సి ఉంటుందో పరీక్షించి, ‘ఓ నెగిటివ్‌’గా నిర్ధరించి, శాంపిల్‌ ఇచ్చి బయట బ్లడ్‌ బ్యాంక్‌కు పంపించారు. అక్కడున్న నిపుణులు అది ‘ఓ’ పాజిటివ్‌’ అని, మరోమారు డాక్టర్లతో సంప్రదించాలని వెనక్కి పంపించారు. నాలుక్కరుచుకున్న నిలోఫర్‌ ఆసుపత్రి పాథలాజికల్‌ ల్యాబ్‌ సిబ్బంది ‘ఓ’ పాజిటివ్‌’ రక్తమే తీసుకురండి.. అని చెప్పి పంపించారు. ఇలా రక్తం తీసుకురావడంలోనే సమయమంతా వృథా కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో బంధువులు ఆందోళనకు దిగారు. అంటే.. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఫలానా రోగి రక్తం గ్రూప్‌ ఏమిటో తేల్చే నిపుణులు లేరా, బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ అధికారి ఏమైనట్లు, ఎక్కడున్నట్లు.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆ పద్ధతి ఇప్పుడేదీ?
నిలోఫర్‌లోని రక్తనిధి కేంద్రం పూర్తిస్థాయిలో పని చేస్తోందా.. అంటే అది జవాబు దొరకని ప్రశ్న. ఇది వరకైతే ఆసుపత్రికి వచ్చే రోగులను పరీక్షించిన వైద్యులు ఎవరికైనా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుందా.. అనేది తెలుసుకునేవారు. వారి తాలూకు తల్లిదండ్రులు, ఇతర బంధువులను పిలిపించి, వారి అంగీకారంతోనే ఆ చిన్నారికి సరిపడా అవసరమైన గ్రూప్‌ రక్తాన్ని సేకరించేవారు. రక్తనిధి కేంద్రంలో జాగ్రత్త చేసిన అనంతరం అక్కడ రోగిది, రక్తం ఇచ్చిన దాతది ఒకటే గ్రూప్‌ రక్తం అయినప్పటికీ ‘క్రాస్‌ మ్యాచింగ్‌’ చేసి ఒక నిర్ణయానికి వచ్చేవారు. అనంతరమే అవసరమైనప్పుడు సదరు రోగికి ఎక్కించేవారు. ఇప్పుడా పరిస్థితి ఉందా.. అంటే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ మాత్రం.. ఉందనే అంటున్నారు. మరి ఈ పద్ధతి ఉన్నప్పుడు మళ్లీ బయటనుంచి ఎందుకు తెప్పిస్తున్నారంటే ‘కొన్ని అరుదైన గ్రూపుల రక్తం కోసం’ అని చెబుతున్నారు. రక్తనిధి కేంద్రం కూడా బాగా పనిచేస్తోందంటున్నారు. కాకపోతే తమ దగ్గరకు వచ్చే రోగుల సంఖ్య వందల్లో ఉండటంతో అడపాదడపా కొరత ఏర్పడుతోందని వైద్యులు వివరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు పంపించాల్సి వస్తోందని అంటున్నారు.

ఈ ప్రశ్నలకు బదులివ్వాలి
డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఇటీవల రక్తకణాలు పడిపోయాయి. వైద్యులు కోరిన మేరకు ఆ చిన్నారి బంధువులు అవి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నిలోఫర్‌ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తం నుంచి ఆ రక్తకణాలు వేరు చేసే యంత్రం లేదంటూ.. అక్కడి వైద్య సిబ్బంది ప్రైవేటు కేంద్రానికి పంపించారని సమాచారం. ‘మా రక్తనిధి కేంద్రంలో అన్ని రకాల అత్యాధునిక యంత్రాలూ ఉన్నాయి’ అని చెబుతున్నప్పుడు.. రక్తం నుంచి ప్లేట్‌లెట్స్‌ వేరు చేయడానికి బయటకు ఎందుకు పంపిస్తున్నారన్నదే ప్రశ్న. దీనికి ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు.‘రక్తనిధి కేంద్రంలో నిపుణులు ఉన్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో, ఉన్న యంత్రాలు సరిపోవడం లేదు. అందుకే మరో అత్యాధునిక యంత్రం కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది’ అని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చిన్నారుల్లో పచ్చకామెర్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటివారికి అవసరమైతే రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు రెండు లేదా మూడు యూనిట్ల రక్తం అవసరముంటుంది. కానీ రక్తనిధి కేంద్రంలో మట్టుకు కొరతే ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.