close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

పగబడుతోన్న పొగ

 నగర మహిళల్లోనూ పెరుగుతోన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌
 ఆందోళనకు గురిచేస్తున్న ధూమపానం
 వైద్యుల అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

క్యాన్సర్‌ ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నగర మహిళల్లో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. పొగాకు వినియోగంతో పురుషులు అధికశాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ఇన్నాళ్లూ భావించేవారు. మహిళల్లోనూ పెరుగుతున్న ధూమపాన అలవాటు ఈ వ్యాధికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి ఏటా కొత్తగా 67వేల ఊపిరితిత్తుల క్యాన్సర్లు నమోదవుతున్నాయి. పెద్దవయసు వారికే ఈ తరహావి వస్తుంటాయి. కానీ హైదరాబాద్‌ (ప్రాంతీయ సంరక్షణ కేంద్రంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించే క్లినికోపాథలాజికల్‌ ప్రొఫైల్‌’) లో జరిపిన అధ్యయనం విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చింది. క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించిన వెయ్యి మంది రోగులలో 49.1 శాతం మంది (466 మంది) 40-60 సంవత్సరాల మధ్య వయస్కులని తేలింది. ఇక హైదరాబాద్‌ నగరంలో క్యాన్సర్‌తో మరణిస్తున్న పురుషుల్లో అధికశాతం ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులే.

క్షయగా పొరపాటు
నగరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించలేక క్షయగా పొరబడుతున్నారని డాక్టర్‌ బాలసుబ్రమణియన్‌ తెలిపారుచెప్పారు. పొగాకు వినియోగం, సిగరెట్‌ తాగడం, గాలికాలుష్యం, బయోమాస్‌ ఫ్యూయల్‌ ఎక్స్‌పోజర్‌, పోషకాహారలోపం, వృత్తిపరమైన అంశాలు ప్రధాన కారకాలన్నారు. పొగతాగే అలవాటు లేనివారికి జీవనశైలి, పర్యావరణ కాలుష్యం వల్ల కూడా ముప్పు పొంచి ఉందని వివరించారు. అయిదేళ్ల వ్యవధిలో ధూమపానం అలవాటు లేనివారికీ క్యాన్సర్‌ వ్యాప్తి చెందడాన్ని తాను చూశానన్నారు. పొగతాగే వారి పక్కన ఉన్నవారిలో 20-30శాతం దీని బారిన పడుతున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడం, తొలిదశలో గుర్తించలేకపోవటం, అవగాహనలోపం వ్యాధి ఉద్ధృతికి కారణాలుగా వివరించారు.

ముందస్తు సూచనలు
తొలిదశలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ముదిరిన తరువాత మాత్రమే ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, ఉమ్మిపరీక్ష, ఎక్స్‌రే, లో-డోస్‌ సిటీస్కాన్‌ వంటి వాటి ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. తద్వారా సరైన సమయంలో చికిత్స అందించడమూ వీలవుతుందని డాక్టర్‌ సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ తరహా క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తిస్తే నయం చేయడమూ తేలికని వివరించారు. హైదరాబాద్‌లోనే 90శాతం మంది రోగులు ఆలస్యంగా వ్యాధిని గుర్తిస్తున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. ఆధునిక వైద్య పద్ధతుల్లో తక్కువ కోతతో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు.. కీ హోల్‌ సర్జికల్‌ టెక్నిక్‌ విధానంతో ఛాతీలో సమస్యలను గుర్తించడంతోపాటు పరీక్షిస్తారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నొప్పి తగ్గించడం, తక్కువ సమయలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వివరించారు.

లక్షణాలు ఇలా..
* తగ్గని దగ్గు, మూడువారాల తరువాత మరింత తీవ్రం కావడం
* దగ్గుతోపాటు రక్తం పడటం, ఉమ్మిరావడం
* ఛాతీలో నొప్పి, దగ్గినపుడు తీవ్రంగా ఉండటం
* గురక
* ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం
* నీరసం
* అలసట
* తరచూ బ్రాంకైటిస్‌, న్యుమోనియా బారిన పడటం వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పొగతాగడం ఆపేయాలి. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు ముఖ్యం. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. తరచూ వ్యాయాయం చేయాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.