close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

సందేశాలతో వల.. చిక్కితే విలవిల!

 నగదు జమ అవుతోందంటూ గాలం..
 ఆన్‌లైన్‌ వేదికల పేరుతోనూ మోసాలు
 సదా అప్రమత్తతతోనే స్వీయ భద్రత
రోజుకో కొత్త రూపంతో సైబర్‌ నేరగాళ్లు
పలు రకాల సందేశాలతో వల వేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.. నగదు

మీ ఖాతాలోకి వస్తుందంటూ మభ్యపెడుతున్నారు. అచ్చం బ్యాంకు వెబ్‌సైట్‌, ఇతర ఆన్‌లైన్‌ వేదికల్లాగానే రెడీమేడ్‌ టెంప్లేట్లను రూపొందించి, అక్కడ బాధితులు నమోదు చేసే వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఖాతాల్లోంచి నగదును మాయం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.  ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఎలాంటి సందర్భంలోనైనా సమాచారం ఇతరులకు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మసలుకోవడం మంచిది. అపరిచిత నెంబర్ల నుంచి సందేశాలు, ఫోన్లు వస్తే స్పందించకపోవడం మేలు. ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని వారు సూచిస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘యువర్‌ అకౌంట్‌ ‘*******6585’ కెన్‌ బి క్రెడిటెడ్‌ విత్‌ రూ.10,25000. చెక్‌ నౌ’ అంటూ కింద ఓ లింక్‌తో’ ఓ సందేశం రావడంతో రవికిరణ్‌ ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఆ లింక్‌ క్లిక్‌ చేసిన తర్వాత తన వివరాలను నమోదు చేయమని అడగడంతో పూర్తి వివరాలను నమోదు చేశాడు. కాసేపటికే ఖాతాలోంచి నగదు విత్‌డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం రావడంతో మోసపోయానని గొల్లుమన్నాడు.

సాయికిరణ్‌కు సైతం ఇదే తరహా సందేశం వచ్చింది. ఆదాయపు పన్ను వాపసు మొత్తం రూ.15,560. ఈ మొత్తం త్వరలో మీ ఖాతాలో జమ అవుతుంది. దయచేసి మీ ఖాతా సంఖ్య ‘*****5698’ను ధ్రువీకరించండి. ఇది సరైనది కాకపోతే దయచేసి దిగువ లింక్‌ను సందర్శించండి అంటూ ఓ లింక్‌ ప్రత్యక్షమైంది. లింక్‌లో చెప్పినట్లుగా వివరాలు నమోదు చేయగానే ఖాతాలో డబ్బులు మాయమైపోయాయి.

ఇలాంటి సందర్భాల్లో జర భద్రం!
* మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతున్నామని లేదా మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ సెక్యూరిటీ వెరిఫై చేస్తున్నాం.. ఈ లింక్‌ క్లిక్‌ చేసి నిర్ధారించుకోమని వచ్చే సందేశాలకు వెనకాముందు ఆలోచించకుండా చాలా మంది స్పందిస్తుంటారు. లింకు క్లిక్‌ చేసిన వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే వెబ్‌సైట్‌ బ్యాంక్‌ వెబ్‌ సైటు మాదిరిగానే ఉంటుంది. మీ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు టైప్‌ చేయడం ఆలస్యం.. ఓ ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చి నిలిచిపోతుంది. కొంత వ్యవధి తర్వాత మన ఖాతాలో డబ్బు, క్రెడిట్‌ కార్డు లిమిట్‌ కూడా ఖాళీ అయిపోతాయి. అందుకే మెయిల్స్‌కు వచ్చే అన్ని లింకులను గుడ్డిగా క్లిక్‌ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* పలు రకాల ఆఫర్ల పేరిట వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లోనూ అనేక లింకులు షేర్‌ అవుతున్నాయి.. చాలా మంది ఆశపడి వెంటనే ఓపెన్‌ చేసి పేమెంట్‌ చేద్దామని చూస్తే మన డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు ఎంటర్‌ చేయమని కనిపిస్తుంది. తక్కువ ధరకే మంచి ఆఫర్‌ వచ్చిందన్న ఆలోచనలో మాత్రమే చాలా మంది ఉంటారే తప్ప అది పేమెంట్‌ గేట్‌వే కాదని గుర్తించలేకపోతున్నారు. రూ.వెయ్యికే ఐఫోన్‌, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌, స్పీకర్లు అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీటిని నమ్మకుండా ఉండటం, ఎవరికీ షేర్‌ చేయకుండా ఉండటం మంచిది.
* లక్కీడ్రాలో మీకు నగదు బహుమతి వచ్చింది.. ఫలానా చోటికి వచ్చి మీ డబ్బును తీసుకోవాలని కోరుతూ... వచ్చాక పలు ఇతర వ్యయాలు అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలియని నెంబర్ల నుంచి బహుమతులు, ఆఫర్లు ఇస్తామంటూ సందేశాలు వస్తే వాటిని పట్టించుకోకపోవడమే మంచిది.

థర్డ్‌ పార్టీ ఏజెన్సీలతోనే మన సమాచారం
బాధితుల వివరాలు నేరగాళ్ల చేతికి ఎలా చిక్కాయని పరిశీలిస్తే... ఖాతాదారుల వివరాలను, సమాచారాన్ని భద్రపరిచేందుకు బ్యాంకులు థర్డ్‌పార్టీ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. వీటిలో కొన్ని ఏజెన్సీలు సమాచారాన్ని అమ్ముకుంటూ ఉండటం నేరగాళ్లకు వరంగా మారింది. బ్యాంకుల పొరుగు సేవల సిబ్బంది ద్వారా ఖాతాదారుల వివరాలు తెలుసుకుని వారి ఖాతాలో డబ్బు కొల్లగొడుతున్నారు. అనంతరం కొత్త సిమ్‌కార్డులను తీసుకుని ఖాతాదారులకు ఫోన్‌ చేసి వివరాలు సక్రమంగా చెబుతుండటంతో బాధితులకు పెద్దగా అనుమానం రావడం లేదు.

షార్ట్‌ కోడ్‌లతో..
ఆన్‌లైన్‌ వేదికలు, బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలపై షార్ట్‌ కోడ్‌లు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, బ్యాంకులు.. అవిపంపే సందేశాలపై వాటి కంపెనీల పేర్లతో షార్ట్‌ కోడ్‌లను రూపొందించుకుంటాయి. హ్యాకర్లు అచ్చం ఇతర బ్యాంకులు, ప్రముఖ ఆన్‌లైన్‌ వేదిక షార్ట్‌కోడ్‌లను పోలిన సందేశాలను అందరికీ పంపుతున్నారు. దీంతో చాలా మంది మోసపోతున్నారు.

డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు
-నల్లమోతు శ్రీధర్‌, సాంకేతిక నిపుణులు
ఉచితంగా డబ్బులు, ఖరీధైన వస్తువులను తక్కువ ధరకు ఇవ్వరన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. డీఎన్‌డీ(డు నాట్‌ డిస్టర్బ్‌) ద్వారా ఇలాంటి సందేశాలను అరికట్టేందుకు వెసులుబాటు ఉంది. ట్రాయ్‌ ఆధ్వర్యంలోనే ఈ డీఎన్‌డీ ప్రక్రియ జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లు కూడా వీటిని అడ్డుకోవడంలో ఫెయిలవుతున్నారు. నకిలీ సందేశం వచ్చిన ప్రతీసారి టెలికాం కంపెనీ లేదా సందేశం పంపినవారు పరిహారం చెల్లించే ఏర్పాటు తీసుకురాగలిగితే ఈ ఫిషింగ్‌ సందేశాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. సందేశాల విషయంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటమే అన్నింటికీ మంచింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.