close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఉపాధి రంగాలకు ప్రాధాన్యం

మంత్రి దయాకర్‌రావు!

సదస్సులో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, పక్కన కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యే అరూరి తదితరులు

రూరల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామాలలో విద్య, వైద్యం, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ఆయా రంగాల అభివృధ్దికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రూర్బన్‌ మిషన్‌ పథకంపై బుధవారం ఇక్కడ కలెక్టర్‌ ఎం. హరిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజావసరాలకు అనుగుణంగా చరిత్రలో నిలిచిపోయే పనులకు రూపకల్పన చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో పనులు రూపొందించి నివేదిక అందించాలని తెలిపారు. ప్రజా భాగస్వామ్యం అభివృధ్ది నిజమైన అభివృద్ది అనిపించుకోదని హితవు పలికారు. పర్వతగిరి మండలం గత 15 సంవత్సరాలుగా పురా పథకం ఎంపికకు ప్రతిపాదనలలో ఉందని, ఎట్టకేలకు ఈ ఏడాది రూర్బన్‌ మిషన్‌ పథకంలో క్లస్టర్‌గా మారడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల భాగస్వామ్యంతో పనులు చేపడతాయన్నారు. ఈ పథకంలో దాదాపు రూ. 50 కోట్ల వరకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో పర్వతగిరి మండలం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు.పర్వతగిరి మండలాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దాలంటే విద్యా, వైద్యం, ఉపాధి కల్పన రంగాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అవసరమైన పనులు చేపట్టాలన్నారు. ఓపెన్‌ జిమ్‌లు, పార్కుల నిర్మాణం, ఆధునిక మార్కెట్‌లు వంటివి చేపట్టాలన్నారు. గిరిజన మహిళల ఉపాధి కోసం ఏఏ రంగాలలో పనులు చేపట్టాలో నివేదిక రూపొందించి అమలు చేయాలన్నారు. చదువుకుంటున్న యువతతోపాటు చదువు మద్యలో ఆపేసిన నిరుద్యోగులను గుర్తించి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి బాటలు వేయాలని మంత్రి సూచించారు.

నిధులు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీ దయాకర్‌

శ్యాంప్రసాద్‌ ముఖర్జి రూర్బన్‌ మిషన్‌ పథకంలో మంజూరైన రూ. 30 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ దయాకర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు మంజూరు చేయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రిగా దయాకర్‌రావు తన సొంత మండలమైన పర్వతగిరికి ఈ పథకం తీసుకురావడానికి కృషి చేశారన్నారు. మహిళలకు, యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన పనులు, ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ : కలెక్టర్‌ ఎం. హరిత!

గ్రామాలలో ఇటీవల నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్‌ హరిత తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ప్రత్యేక అధికారులు అనునిత్యం పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు. రూర్బన్‌ పథకంలో పర్వతగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో, తండాలలో ప్రజల అవసరాలను గుర్తించి పనులు రూపొందించాలని, యుద్ద ప్రాతిపదికన డీపీఆర్‌ రూపొందించాలన్నారు. ప్రధానంగా డంపింగ్‌ యార్డుల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, పాఠశాలలు, అవసరం ఉన్న గ్రామాలలో పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నేటి నుంచి 10 రోజులలో మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించి 27 ప్రభుత్వ శాఖల నుంచి చేపట్టనున్న పనుల నివేదిక నాకు అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజల రుణం తీర్చుకుంటా: అరూరి రమేష్‌

నాకు ఓటు వేసి గెలిపించిన పర్వతగిరి మండల ప్రజల రుణం తీర్చుకోవడానికి రూర్బన్‌ మిషన్‌ పథకం మంచి అవకాశంగా భావిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దయాకర్‌రావు కృషి వల్ల ఈ పథకం కింద పర్వతగిరి మండలం ఎంపికైందన్నారు. మండల పరిధిలోని 33 గ్రామాలలో ప్రజలకు అవసరమైన, చిరకాలం గుర్తుండే పనులకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. రూర్బన్‌ పథకంలో మంజూరైన రూ. 30 కోట్ల నిధులతో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం వచ్చే విధంగా పనులు చేపట్టి పర్వతగిరిని ఆదర్శ మండలంగా తీర్చిదిదద్దడాకి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో శిక్షణ ఐఏఎస్‌ సంతోష్‌, డీఆర్‌డీఓ సంపత్‌రావు, జడ్పీ సీఈఓ రాజారావు, డీపీఓ నారాయణరావు, ఆర్డీవో మహేందర్‌జీ, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.