close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

రెక్కలుడిగిన బర్డ్‌ 

తగ్గుతున్న శస్త్రచికిత్సల సంఖ్య 
ప్రభ కోల్పోతున్న ఆస్పత్రి

గతం: ఆ ఆస్పత్రి నిత్యం వేకువజాము నుంచి సాయంత్రం దాకా రోగులతో   కిటకిటలాడేది. ఓపీలు.. శస్త్ర  చికిత్సలు.. పరిపాలన అంతా సజావుగా సాగేది. వైద్యులు, సిబ్బంది బాధ్యతలకు కట్టుబడేవారు. ఉత్తమ సేవలతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. 


వర్తమానం: రోగుల రాక పడిపోయింది. ఓపీ తగ్గింది. శస్త్ర చికిత్సలు మృగ్యమయ్యాయి. ‘ఇక్కడ మాత్రమే చేస్తారు’ అని చెప్పుకొనే చికిత్సలు అరుదైపోయాయి. మొత్తంగా ఆ ఆస్పత్రి.. వైద్యుడు లేని వైద్యాలయంగా మారింది. 


ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోని బర్డ్‌ ఆస్పత్రిలో నాలుగున్నర నెలల్లో మారిన పరిస్థితి.

తిరుపతిలోని బాలాజీ దివ్యాంగుల శస్త్ర చికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం(బర్డ్‌) తితిదే ధార్మికేతర సేవానిరతికి తలమానికంగా నిలిచిన వైద్యశాల. పోలియో బాధితులు, రహదారి ప్రమాద క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేసి.. కృత్రిమ అవయవాలు అమర్చి వారిని మామూలు మనుషులను చేసిన అత్యున్నత స్థాయి ఆస్పత్రి. మోకీళ్ల మార్పులు, తుంటి, భుజం ఎముకలకు శస్త్ర చికిత్సలకు దేశంలోనే ప్రసిద్ధి పొందింది. వెన్నెముక శస్త్రచికిత్స అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆస్పత్రిగా పేరుగాంచింది. తితిదే సహకారంతో ఒనగూరిన ఆధునిక వసతులు, భారీ భవన సముదాయంతో 350 పడకల ఆస్పత్రి స్థాయికి ఎదిగింది. ఎముకల చికిత్సకు సంబంధించి ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించే ఈ ఆస్పత్రి.. నాలుగు నెలలుగా ఉన్నట్టుండి తన ప్రభ కోల్పోతోంది.


మారిన పరిస్థితులు
మొన్నటి వరకు బర్డ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ జగదీష్‌ 20 ఏళ్లుగా ఇక్కడే సేవలందించారు. ఆయన గతంలోనే ఉద్యోగ విరమణ చేసినా.. తితిదే పదవీకాలం పొడిగిస్తూ వచ్చింది. గత ప్రభుత్వంలో రెండేళ్లపాటు పొడిగించారు. అది ఈ ఏడాది మే నాటికి పూర్తియింది. ఆ తరువాత తితిదే ఆయణ్ను తిరిగి నియమించలేదు. డాక్టర్‌ జగదీష్‌ లేని లోటు ఆస్పత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని రోగులు అంటున్నారు. జగదీష్‌ విధుల్లో లేనందున క్లిష్టమైన కేసులను తీసుకోవడం లేదని స్వయాన అక్కడి ఉన్నతాధికారే అంగీకరించడం గమనార్హం. డాక్టర్‌ జగదీష్‌ తర్వాత పూర్తిస్థాయి సంచాలకుడ్ని నియమించలేదు. ప్రస్తుతం ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఈ కారణంగా సేవలు పూర్తిస్థాయిలో అందకపోగా.. రోగులు, చికిత్సల సంఖ్య తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్‌ రికార్డుల్లో హెచ్చుతగ్గులు కాస్త అటూఇటూ ఉన్నా.. కీలకమైన తుంటి శస్త్రచికిత్సలు, కీళ్లమార్పిడి చికిత్సల్లో తగ్గుదల కన్పిస్తోంది.

సగటున నెలలో 230కి పైగా శస్త్ర చికిత్సలు జరిగేవి. సెప్టెంబర్‌ 15 వరకు కేవలం 65 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నమోదయ్యాయి.  ఏడువేల మంది శస్త్రచికిత్సలకు పేర్లు నమోదు చేసుకున్నా.. నెలవారీ ఆపరేషన్లకు స్పందన కరవైంది. మూడు నెలల్లో ఒక్క వైద్యశిబిరమూ  నిర్వహించలేదు. ఆస్పత్రిలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. గతంతో ఉదయం ఆరుగంటలకే ఓపీ ప్రారంభం అవుతుండగా.. ప్రస్తుతం కొందరు వైద్యులు ఉదయం 9 గంటలకు ఓపీ ప్రారంభించి.. 11 తర్వాత వెళ్లిపోతున్నట్లు రోగులు వాపోతున్నారు. సిబ్బంది సమయపాలనపై పర్యవేక్షణ కొరవడింది. ఒకరిద్దరు అధికారులు కొన్ని రోజులుగా కార్యాలయాలకు సరిగ్గా రావడం లేదని తెలిసింది. గతంలో ప్రధాన భూమిక పోషించిన వైద్యులు సైతం ప్రస్తుతం చొరవ చూపడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.


తగ్గుతున్న రోగుల సంఖ్య
బర్డ్‌ ఆస్పత్రికి సాధారణ రోగులతోపాటు తితిదే ఉద్యోగులు వస్తుంటారు. ఓపీకి వచ్చిన వారిని పరిశీలించి అవసరం మేరకు ఆస్పత్రిలో చేర్చుకుంటారు. తర్వాత శస్త్రచికిత్సలు చేస్తారు. 


క్లిష్టమైన శస్త్ర చికిత్సలు ఆపేశాం
ప్రైవేటు ఆస్పత్రిలో సాధ్యం కాకుండా ఇక్కడికి వచ్చే క్లిష్టమైన కేసులను తీసుకోవడం లేదు. డాక్టర్‌ జగదీష్‌ ఉన్నప్పుడు రిస్క్‌ కేసులను డీల్‌ చేసేవారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇది వరకటిలాగే ఆపరేషన్లు, ఓపీలు కొనసాగుతున్నాయి. వైద్యులు, సిబ్బంది వారి వారి విధులు సక్రమంగానే నిర్వహిస్తున్నారు. రోటీన్‌గా జరిగే పనులు యథావిధిగా సాగుతున్నాయి. తితిదే నిర్వహణలోని ఆస్పత్రి అయినందున ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. నూతన బర్డ్‌ డైరెక్టర్‌ కోసం తితిదే నోటిఫికేషన్‌ ఇచ్చింది. త్వరలో నియామకం జరుగుతుంది.

- డాక్టర్‌ వెంకారెడ్డి, బర్డ్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.