icon icon icon
icon icon icon

పోస్టల్‌ ఓట్లకు పాట్లు.. కుప్పంలో ఓటర్ల కాళ్లు మొక్కిన వైకాపా నాయకులు

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకోసం వైకాపా శ్రేణులు పడరాని పాట్లు పడుతున్నాయి. వైకాపాకు ఓటు వేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ, ఉపాధ్యాయుల కాళ్లు మొక్కుతూ, సాష్టాంగ ప్రణామాలు చేశారు.

Published : 08 May 2024 06:08 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకోసం వైకాపా శ్రేణులు పడరాని పాట్లు పడుతున్నాయి. వైకాపాకు ఓటు వేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ, ఉపాధ్యాయుల కాళ్లు మొక్కుతూ, సాష్టాంగ ప్రణామాలు చేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. ఆ చిత్రాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ సమస్యలపై గొంతెత్తి అరిచినా.. పోరాడినా పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు ఓట్ల కోసం కాళ్లపై పడుతోందని ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీల నాయకులు పేర్కొంటున్నారు.

పోస్టల్‌ బ్యాలట్లు మారడంపై ఈసీ చర్యలు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకు సంబంధించి జరిగిన పొరపాటుకు బాధ్యులైన నాదెండ్ల తహసీల్దారు వరకుమార్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు రిటర్నింగ్‌ అధికారి నారదమునికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై ఉగ్యోగులు భగ్గుమన్నారు. కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రంలో మంగళవారం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు అవకాశం కల్పించారు. ఓటరు జాబితాల్లో కొందరి పేర్లు లేకపోవడంతో నిరసన తెలిపారు. దీంతో వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. వీరందరూ బుధవారం ఇక్కడే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పడంతో గందరగోళానికి తెరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img