close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

బుద్ధికి బాటలు.. భవితకు మెట్లు

పిల్లల పెంపకంలో కన్నవారికి సవాళ్లు
వయసుల వారీగా సమస్యలు
క్రమశిక్షణకు హద్దు.. అతి గారాబం వద్దు
తప్పొప్పుల విచక్షణపై అవగాహన
యుక్తవయసుకు చేరాక మనసెరిగి సుద్దులు
అమ్మానాన్న ఉద్యోగులైతే మరిన్ని జాగ్రత్తలు
ఈనాడు, హైదరాబాద్‌

వేలెడంత లేడు.. అప్పుడే ఎదురు మాట్లాడుతున్నాడు.
చేతిలో సెల్‌ఫోన్‌ తీసుకుంటే చాలు.. గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
బాబోయ్‌.. వీడి కోపం తట్టుకోవడం మా వల్ల కాదు.
నిన్నటి వరకూ బుద్ధిగా ఉన్న కుమార్తె ఎందుకిలా మొండిఘటంగా మారింది.
పుస్తకాలకు పరిమితమైన పిల్లాడు అకస్మాత్తుగా సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయాడు.
ఇంటికొచ్చింది మొదలు స్నేహితులతో ఛాటింగ్‌..

... నడక నేర్చిన బుడతల నుంచి కళాశాలకు వెళ్లే యుక్తవయసు పిల్లలతోనూ  చికాకులే.. వీళ్లను పెంచడం మామూలు వాళ్ల వల్ల కాదంటూ తలపట్టుకునే తల్లిదండ్రులు. పిల్లలున్న ప్రతి ఇంటా ఇలా ఏదో ఒక సమస్య వినిపిస్తూనే ఉంటుంది. బిడ్డల్ని దారికి తెచ్చేందుకు అల్లాఉద్దీన్‌ అద్భుతదీపం వంటిది దొరికితే బావుండునంటూ భావించే కన్నవారూ లేకపోలేదు.‘అమ్మా.. నువ్వు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచగలనా’! యాభై ఐదేళ్ల తల్లితో.. పాతికేళ్ల కుమార్తె వ్యక్తం చేసిన ఆందోళన.. ఈ తరం అమ్మానాన్నల్లో సహజంగా కనిపించే భయానికి ఉదాహరణ. భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో ఈ ఇబ్బంది తీవ్రంగా మారుతోంది. వెరసి.. చిన్నారులు ఉన్న ప్రతి కుటుంబంలోనూ పిల్లల పెంపకం సవాల్‌గా మారింది. నిన్న..మొన్నటి వరకూ కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమైన భయం.. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులనూ కలవరపాటుకు గురి చేస్తోంది. వయసుల వారీ వస్తున్న మానసిక మార్పులు..బిడ్డల ప్రవర్తనలో తేడాలు.. దగ్గరగా గమనిస్తూ వారికి తగినంత సమయం కేటాయిస్తూ.. మనసెరిగి సుద్దులు చెపితే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు మనస్తత్వ నిపుణులు.

పెంపకంలో తేడాలే.. అసలు సమస్య.
‘పిల్లలతో ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రులు పెంచే విధానంలో తేడాలే సమస్యలకు కారణమ’ని మనస్తత్వ నిపుణురాలు డాక్టర్‌ పూర్ణిమ నాగరాజ అన్నారు. ముఖ్యంగా భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో పెంపకం మరింత సవాల్‌గా మారింది. ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ కొద్దిపాటి జాగ్రత్తలతో ఎలా అధిగమించవచ్చో వివరించారిలా...

పసితనంలో ఇలా...
మూడేళ్లు నిండకుండానే చదువులు. ఒకటో తరగతికి రాగానే ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులంటూ ఒత్తిడి.అతి క్రమశిక్షణతో గాడిన పెడుతున్నామనే అభిప్రాయానికి గురవుతున్నారు. బక్కగా ఉంటే బొద్దుగా కావాలని.. లావుగా కనిపిస్తే తగ్గాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. పిల్లల రంగు, పొట్టి/పొడవు, జుట్టు (బాడీ షేమింగ్‌) ప్రతి అంశాన్ని వేలెత్తి చూపుతూ బాల్యాన్ని ‘యాంగ్టైటీ ఫోబియా’కు గురిచేస్తున్నారు. నువ్వు అందంగా లేవు.. పెళ్లికావాలంటే బాగా చదవాలంటూ ఆడపిల్లలతో మరింత కఠినంగా వ్యవహరిస్తుంటారు.


యుక్తవయసుకు వచ్చాక

పిల్లల ఇష్టంతో సంబంధం లేకుండా కన్నవారు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఏం చదవాలి. ఎలాంటి ఉద్యోగం చేయాలనేది నిర్ణయిస్తున్నారు. పిల్లల సామర్థ్యం గుర్తించకుండానే ఒత్తిడి పెంచుతున్నారు. చుట్టూ జరిగే సంఘటనలను తమ బిడ్డలతో పోల్చుకుంటూ మరింత ఒత్తిడికి గురవుతున్నారు. యుక్తవయసులో స్నేహాలు, ప్రేమలు, క్రష్‌లు, అలవాట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు బయటివారికంటే సొంతవారితోనే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సెల్‌ఫోన్లు, పోర్న్‌సైట్లు, సామాజిక మాధ్యమాలకు తేలికగా ఆకర్షితులవుతున్నారు.


నేను చిన్నపుడు ఇంజినీరింగ్‌ చేశాను. నువ్వూ చేయాలనే తండ్రి..తనకేమో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలని కోరిక. బయటకు చెప్పలేక.. ఇల్లు వదలి వెళ్లిపోయింది ఓ అమ్మాయి. పక్కింట్లో పిల్లలు 12-14 గంటలు చదువుతున్నారని, టాపర్‌గా ఉన్నారనే ఆలోచన పిల్లలపై తల్లిదండ్రులు మరింత ఒత్తిడికి గురిచేసేందుకు కారణమవుతోంది. దీంతో ఇంటి నుంచి పారిపోవడం, బడికి డుమ్మా కొట్టడం వంటివి పెరుగుతున్నాయి.


పొగడాలా.. వద్దా..

తప్పు చేసినపుడు దండించే తల్లిదండ్రులు.. బిడ్డలు ఏదైనా విజయం సాధించినపుడు అభినందించేందుకు వెనుకాడతారు. వారిని పొగిడితే కొమ్ములు వస్తాయి.. విమర్శిస్తేనే దారికి వస్తారనే భావన కొందరు కన్నవారిలో ఉంది.. ఇంట్లోని వారే ప్రేమ చూపకపోతే ఎలా అంటారు డాక్టర్‌ పూర్ణిమనాగరాజ్‌. చిన్నపాటి విజయాలు సాధించినపుడు ఇచ్చే ప్రశంస భవిష్యత్‌పై సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది అంటారామె.


తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ ర్యాంకు

విజయవాడ: విజయవాడ వన్‌ టౌన్‌ ప్రాంతంలో వస్త్ర వ్యాపారి కొత్తమాసు శ్రీనివాసరావు, రాధాకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు దినేష్‌కుమార్‌ని ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు మూడు పాఠశాలల్లో చదివించారు. బడి మారినప్పుడల్లా దానికి పక్కకే ఇల్లు మారేవారు. పిల్లల పెంపకంలో తల్లి బాగా శ్రద్ధ చూపారు. ఇంటర్‌లో చేర్పించినప్పుడే ఐఐటీ కోచింగ్‌  ఇప్పించారు.మంచి ర్యాంకు రావడంతో వరంగల్‌ నిట్‌ కళాశాలలో ఐఐటీలో చేర్పించారు. 2010-2014 వరకు అక్కడ చదివి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భారత పెట్రోలియం కంపెనీలో ఏడాదికి రూ.10.5 లక్షలు ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో దినేష్‌కుమార్‌ సివిల్స్‌(ఐఏఎస్‌)చదవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులతో చెప్పడంతో.. వారు ఎంత కష్టం వచ్చినా తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాలని కోరారు. ఆ మేరకు శిక్షణకు దినేష్‌ దిల్లీ వెళ్లారు. పట్టుదలతో  ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రయత్నంలోనే దేశంలోనే 6వ ర్యాంకు సాధించారు తెనాలి పట్టణంలో సబ్‌ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.


ఆటలు దూరమై.. ఊబకాయం చేరువై..

8-15 ఏళ్ల వయసులో 30-35శాతం మంది విద్యార్థులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. ఇంట్లో వంట చేసే తీరికలేక పాఠశాల క్యాంటీన్‌లో తినమంటున్నారు. జంక్‌ఫుడ్‌ అలవాటుతో బరువు పెరుగుతున్నారు. విద్యాలయాల్లో క్రీడా తరగతులు అటకెక్కడంతో శారీరక శ్రమ దూరమైంది. ఇంటి వద్ద స్నేహితులతో ఆడుకునేందుకు పంపడం లేదు. దీంతో నగరాలు, పట్టణాల్లోని చిన్నారులు అధికబరువు, థైరాయిడ్‌ సమస్యల బారిన పడుతున్నారు. పిల్లల అభిరుచి మేరకు చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, క్రీడాంశాల్లో ప్రవేశం కల్పించడం ద్వారా ఓటమిని తట్టుకునే మనోనిబ్బరం, శారీరక శ్రమ అలవాటవుతుంది.


ఆలుమగలు ఉద్యోగులైతే..

ఉదయం లేచింది మొదలు తీరిక లేకుండా శ్రమిస్తారు.  అలసిపోయి ఇల్లు చేరతారు. ఇలాంటపుడు పిల్లలపై దృష్టిసారించడం  క్లిష్టమైన సమస్య.భార్యభర్త ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేస్తుంటారు. అవకాశం ఉన్నపుడు తాతబామ్మలను తీసుకురావడం పరిష్కారమార్గం. వారితో గడపడం వల్ల పిల్లలు మానవ సంబంధాలు, జీవన నైపుణ్యాలను గ్రహిస్తారు.సాయంత్రం ఇల్లు చేరగానే ఆలుమగల్లో ఎవరో ఒకరు పిల్లలతో ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మాట్లాడాలి. ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.


ఆత్మీయతకు ప్రతిరూపాలు

పిల్లల మనసు తెల్ల కాగితం వంటిది. మంచి చెడులు.. తెలియని వయసు. పెద్దవాళ్లు అక్కడ ఏది రాస్తే అదే మార్గంలో నడుస్తారు. ఉన్నతంగా ఎదిగేందుకు.. ఉత్తమ పౌరులుగా మలిచేందుకు తల్లిదండ్రుల ప్రభావం కీలకమని  డాక్టర్‌ పూర్ణిమ వివరించారు. చదువులో ముందంజలో ఉండడం ఒక్కటే కాదు.  ఆరోగ్యం, మనోవికాసం సక్రమంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతారు.


పెంపకంలో భిన్న కోణాలు..

పిల్లల పెంపకం నియంత్రణ చుట్టూ తిరుగుతుందంటారు చిన్నారుల మనస్తత్వతవేత్త  అమెరికాకు చెందిన డయానా బాయురిండ్‌. బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనే ఆలోచన ఒక్కటే అయినా తల్లిదండ్రులు భిన్నంగా వాటిని వ్యక్తపరుస్తారని తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ తాము నడిచే మార్గంపై సానుకూల ధోరణిలో ఉంటారని కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ మోతుకూరి రాంచందర్‌  ఇలా విశ్లేషించారు...

పిల్లల కోరికలు తీర్చేవారు
ఈ కోవకు చెందిన తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. వారిని ఎక్కువగా డిమాండ్‌ చేయరు.. ఏమీ ఆశించరు. వారికి బాగా చేరువ కాగలరు. బిడ్డలతో స్నేహితులుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చదువు, తరగతిలో సాధించే మార్కుల ప్రసక్తి తీసుకురారు.  స్వతంత్రంగా నడచుకునేందుకు బాటలు వేస్తారు. తాము కోల్పోయిన బాల్యపు ఆనందాల్ని వారికి అందించాలనుకుంటారు.
ఫలితం: ఇటువంటి పెంపకంలోని చిన్నారుల్లో స్వీయగౌరవం అధికం. సామాజిక నైపుణ్యాలు ఉంటాయి. నిరుత్సాహానికి గురయ్యే సందర్భాలు ఎక్కువ. పాఠశాలలో రాణింపు పేలవంగా ఉంటుంది..

నియంతృత్వం
ఈ తరహాలో తాము చెప్పిందే పిల్లలకు వేదం అని అమ్మనాన్నలు బలంగా భావిస్తారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే సహించరు. ఎంత పెద్ద శిక్షలైనా విధించేందుకు వెనుకాడరు. భయపెడదామనే ఆలోచన తప్ప వీరిలో బాధ్యత కనిపించదు.
ఫలితం: ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలకు కోపావేశాలు ఎక్కువ.  భయం నీడలో చదువు, నైపుణ్యాలు అలవరచుకుంటారు. స్వీయ గౌరవం తక్కువ. నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. ప్రతి చిన్న విషయానికీ పక్కవారిపై ఆధారపడతారు. మానసిక ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉంటుంది.

అధికారం
పిల్లలు ఎలా నడవాలి.. ఏ విధంగా చదవాలి.. ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి.. వంటి నియమాలు జారీ చేస్తారు. అధికారాన్ని ప్రదర్శిస్తూనే కాస్త స్వేచ్ఛ ఇస్తారు. ప్రాథమిక అవసరాలను తీర్చుతుంటారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంటారు. అతి క్రమశిక్షణ కనిపిస్తున్నా   ఇబ్బంది వస్తే అండగా నిలుస్తుంటారు.
ఫలితం: మొదట్లో కాస్త ఇబ్బంది పడినా చిన్నారులు క్రమంగా అలవాటవుతారు.  శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నతంగా రాణిస్తారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేది కూడా ఇటువంటి వాతావరణంలో పెరిగినవారేనని అధ్యయనాలు చెబుతున్నాయి.


పెద్దవాళ్లతోనే అసలు సమస్య
-సి.ఎ.ప్రసాద్‌, అధ్యక్షుడు ప్రజా చైతన్యవేదిక, ఆంధ్రప్రదేశ్‌

పిల్లలకు అనుకరించడం ఇష్టం. పెద్దలు ఏమి చేస్తుంటే అదే చేస్తారు. ఇప్పుడు పెద్దవాళ్లు సమయం దొరికితే సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. చిన్నారులూ అదే చేస్తున్నారు. ఇంట్లో పిల్లలకు ఏదో ఒక వ్యాపకం అలవాటు చేసి, బుర్రకు, చేతికి పని కల్పిస్తే అనవసర అంశాల జోలికి వెళ్లరు.  పెంపకంలో సవాళ్లు బిడ్డల వల్ల కాదు.. పెద్దవాళ్లతోనే అని భావించాలి. ఇప్పటికీ పలు పాఠశాలలు వినూత్నరీతిలో విద్యాబోధన చేస్తున్నాయి. పాఠాలను పాటలు, డ్రామా, కథల రూపంలో బోధిస్తున్నాయి. విద్యార్థులకు సృజనాత్మకత, ఏకాగ్రత.. పని, చదువు రెండూ కలసి ఉన్నచోట మాత్రమే అలవడతాయి.


అమ్మాకూతుళ్లం కాదు.. స్నేహితులం
- డాక్టర్‌ పూర్ణిమ నాగరాజ

నాకు ఒక కుమార్తె.. డాక్టర్‌ దృతి. తనను ఎప్పుడూ కొట్టలేదు. అనవసరంగా తిట్టలేదు. తను బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. స్నేహితురాలిగా నడచుకుంటాను. తనకు ఎదురయ్యే అనుభవాలను నాతో పంచుకుంటుంది. ఓవిధంగా నాది కూల్‌ పేరెంటింగ్‌. పసితనం నుంచే ఇంటి పనులు నేర్పించాలి. లోకజ్ఞానం తెలియజేయాలి. మనసు ప్రశాంతంగా ఉన్నపుడు పిల్లలు చెప్పే విషయాలను వినగలం. తల్లిదండ్రులు తమ మాట వింటున్నారనే అభిప్రాయం కలిగినపుడు వారు కూడా పెద్దల మాట ఆలకిస్తారు. నాణ్యమైన సమయాన్ని వారికి కేటాయించి కొద్దిసేపు గడిపితే..పెంపకంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను తేలికగా అధిగమించవచ్చు.


పిల్లలకు అన్ని అంశాల్లో మార్గదర్శనం
- కె.శ్రీనివాస్‌, ఉప సంచాలకులు, కరీంనగర్‌ జిల్లా కోశాగార శాఖ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: ‘‘నా సతీమణి చండీరాణి భూపాలపల్లి జిల్లా టేకుమల్ల ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. మా పిల్లలు శ్రీవరుణ్‌ 9వ తరగతి, శ్రీచరణ్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు.  వారికి ర్యాంకుల కంటే విలువలు ముఖ్యమనేది నేర్పించాం. జీవితంలో ఎదగాలన్నా, ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నా ఎలా ముందుకు సాగాలో ఎప్పటికప్పుడు సూచించాం. ఉద్యోగ నిర్వహణలో ఇద్దరం నిమగ్నమై ఉంటాం కాబట్టి చదువుల్లో వారిని ప్రోత్సహించేందుకు అవసరమైన మేరకు ట్యూషన్లు పెట్టించాం. వారి కెరీర్‌ను ఏ దిశగా మలచుకోవాలో సలహాలిస్తూనే ఆసక్తి గల రంగాలవైపు ప్రోత్సహించాం. కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడేందుకు నిర్ణీత సమయం నిర్దేశించాం. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే స్ఫూర్తివంతమైన కథనాలు, విషయాలను పిల్లలకు ప్రేరణ కలిగేలా వివరించాం. మా పెద్ద బాబు ఇంజినీరింగ్‌లో ముందుకు సాగుతున్నాడు. చిన్నబాబు జ్ఞాపకశక్తి పోటీల్లో ‘ఇండియన్‌ ఓపెన్‌’ కేటగిరీలో కాంస్య పతకం సాధించి ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీలకు ఎంపికయ్యాడు.’’


అపోహలు వీడాలి.. భరోసా ఇవ్వాలి

* పిల్లల్ని బయటకు పంపితే చెడిపోతారనే ధోరణి వీడాలి.
* ఎక్కడో ఆడపిల్ల తప్పు చేస్తే తమ ఇంటికి అన్వయించుకోవడం మానాలి.
* పసితనంలో పిల్లల్ని అమ్మా,నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం  చాలా అవసరం
* తల్లిదండ్రుల స్పర్శ బిడ్డలకు మనోధైర్యాన్ని ఇస్తుంది.
* పిల్లలు మాట వినరనేది ఒట్టిమాట. ప్రేమ, అప్యాయత చూపించండి మీ చెంత వాలిపోతారు.
* ఇరుగు, పొరుగు వారితో అతి స్నేహం (ఓవర్‌ సోషలైజ్‌) చేయమని ఒత్తిడి తేవద్దు.
* యుక్త వయసుకు వచ్చాక పిల్లలకు లైంగికవిద్య చాలా అవసరం. స్నేహం, ప్రేమ,ఆకర్షణ గురించి అవగాహన కల్పించాలి.
* అబ్బాయి/అమ్మాయి ఇద్దరికీ సమాన నిబంధనలు విధించాలి. ఎవరూ ఎక్కువ/తక్కువ కాదని తెలియజెప్పాలి
* మానవ సంబంధాలు, భావ వ్యక్తీకరణ లేకపోవడం వల్లనే మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు.


చిన్నారులతో  సవాళ్లు ఇవీ..

* సమయపాలన లేకపోవడం
* ఆహారపు అలవాట్లు
* దుస్తుల ఎంపిక
* ఖరీదైన సెల్‌ఫోన్లు కావాలనడం
* ఇంటిపనుల్లో సాయం చేయకపోవడం
* ఇష్టానుసారం డబ్బులు ఖర్చు చేయడం
* అర్ధరాత్రి దాటాక నిద్ర
* బంధాలకు విలువ ఇవ్వని తీరు
* బాధ్యతలను విస్మరించడం
* అతి స్వేచ్ఛను కోరుకోవడం
* ఎవ్వరినీ లెక్కచేయని తత్వం
* అతి బద్దకం
* ఇతరులపై ఆధారపడడం


కొన్ని చిట్కాలు మీకోసం...

ఈతరం పిల్లల నుంచి ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు డాక్టర్‌ గీతా చల్లా ఇలా వివరించారు.
*  విలువలు నేర్పించలేం కాబట్టి ఆదర్శ వ్యక్తులను చూసి నేర్చుకునే వీలు కల్పించాలి.
*  ఇంట్లో తయారయ్యే ఆహారాన్ని ప్రత్యేకమైన రీతిలో వండే ప్రయత్నం చేయాలి.
*  ఫ్యాషన్‌, ట్రెండ్‌ను అనుసరిస్తూనే హుందాతనం వీడకుండా నియంత్రించాలి.
*  సెల్‌ఫోన్‌ వాడకాన్ని పూర్తిగా నివారించలేం. వాడే సమయాన్నైనా తగ్గించాలి.
*  కుటుంబ నిర్ణయాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయాలి.
*  పిల్లలు చేసే ప్రతి ఖర్చునీ వారిచేతే విశ్లేషణ చేయించాలి.
*  పిల్లల్లో సానుభూతిని పెంచాలి. దీనివల్ల పరిస్థితులు, మనుషులను అర్ధం చేసుకునే శక్తి పెరుగుతుంది. సర్దుకుపోయే తత్వం అలవడుతుంది.
*  స్వేచ్ఛ ఇస్తూనే అందుకు పరిధి నిర్ణయించాలి. (ఉదా: నీకు నచ్చిన దుస్తులు కొనుక్కో...కానీ రూ.2వేలు దాటకూడదు).

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.