close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

పరిష్కార యోచన.. పౌరుల సూచన

ఇరుకు రహదారులపై ప్రభుత్వం దృష్టి
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి యత్నం
పౌరులు, సంఘాల నుంచి సలహాల స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్‌

మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిపై టోలిచౌకీ గెలాక్సీ ప్రాంతంలో యూటర్న్‌ ఉంది. ఇక్కడే కొద్దిదూరంలో ఎడమ వైపు ఏళ్ల కిందట రోడ్డు తవ్వేసి వదిలేశారు. అక్కడిదాకా మూడు లైన్లు ఉండే రహదారి ఇక్కడ మాత్రం రెండులైన్లకు కుంచించుకుపోయింది. కారణమేంటో తెలియదు కానీ నాలుగైదేళ్లుగా ప్రధాన రహదారి ఎడమవైపు కాస్త మట్టిరోడ్డుగా మారింది. ఇంతవరకు బాగు చేయడం లేదు. దీనికి తోడు అక్కడే కుడివైపు యూటర్న్‌ ఉండటంతో నేరుగా వెళ్లే వాహనాలు ఇక్కడ సాఫీగా వెళ్లడం లేదు. ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

నగరంలో అధికార యంత్రాంగం దృష్టి పెడితే ఇరుకుగా మారిన రహదారుల సమస్యలను పరిష్కరించవచ్చు. బాగోలేని రహదారులు, ట్రాఫిక్‌ సమస్యలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో ఇటీవల బాధ్యతలు చేపట్టిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వీటిపై దృష్టిపెట్టారు. ఇప్పటివరకు ఇలాంటి సమస్యలపై అధికారులే పరిష్కారాలు ఆలోచించేవారు. ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే... ప్రజలు, వేర్వేరు సంఘాలను తమ దృష్టిలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి సూచనలను ప్రభుత్వం ఆహ్వానించింది. మూడురోజుల క్రితం స్థిరాస్తి వ్యాపారుల సంఘాలతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ ఇరుకుగా ఉన్న రహదారులకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ మార్గాలను, లింకులను సూచించాలని కోరారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని 28 రహదారులతో పాటు ఇతర ఇరుకు రహదారుల సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని కోరారు. ఇరుకుదారులపై మంత్రి కేటీఆర్‌ సుదీర్ఘ సమీక్ష అనంతరం ట్విట్టర్‌ వేదికగా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ముఖ్యమైన రహదారుల అనుసంధానానికి ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించారు. నెటిజన్లు కొందరు సూచనలు చేయగా.. మరికొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆన్‌లైన్‌ వేదికగా అధికారులు, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఇవీ పౌరుల సమస్యలు, సూచనలు
కూకట్‌పల్లి-హైటెక్‌ సిటీ మార్గంలో రైల్వే ట్రాక్‌ దాటేందుకు మరిన్ని మార్గాలు అవసరం. ప్రస్తుతం ఒక పైవంతెన, ఒక అండర్‌పాస్‌ మాత్రమే ఉంది. నిత్యం లక్షలాది మంది ఇక్కడ ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్నారు.
- రాజీవ్‌
నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్‌ నుంచి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు బీఆర్‌టీఎస్‌, మెట్రో రైలు రెండింటిలో ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలి.
- శ్రీకాంత్‌
మొదట పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించండి.
- శివకృష్ణ
ఎంఎంటీఎస్‌ పనులతో అల్వాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేస్తే మంచిది
-రాజీవ్‌రెడ్డి
జేఎన్‌టీయూ-హైటెక్‌ సిటీ, మియాపూర్‌-లింగంపల్లి, హైటెక్‌ సిటీ-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వరకు మెట్రో సదుపాయం కల్పించాలి.
- తరుణ్‌
నియంత్రణ లేకుండా భవన అనుమతులకు అనుమతి ఇవ్వడమే ట్రాఫిక్‌కు కారణం. ఉదాహరణకు ఐకియా చౌరస్తా చాలా రద్దీగా ఉంటుంది. నివాస ప్రాంతాల్లో రెండు లైన్ల రహదారిలో 30 వేల మంది పనిచేసే డెలాయిట్‌ భవనాలు ఉన్నాయి.
- ఓ నెటిజన్‌
అమీన్‌పూర్‌ నుంచి మియాపూర్‌ హెచ్‌ఎంటీ కాలనీకి 2 కి.మీ. రోడ్డు వేస్తే చాలు.. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకునేందుకు పది కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
- ఓ నెటిజన్‌
ఏ సమీక్షలో చూసినా భూసేకరణలో జాప్యంతో ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతుంటారు. పనులను మధ్యలో ఆపేస్తున్నారు. 90 శాతం భూసేకరణ చేశాక పనులు మొదలెట్టాలి.
- శ్రీనివాసన్‌
రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు ముందుగా ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ రెండోదశకు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలి. తెరాస ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు అవుతున్నా ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.
- మహ్మద్‌ అహ్మదుద్దీన్‌
మూసాపేట వైపు కేపీహెచ్‌బీ ఎల్‌ఐజీ/ఎంఐజీ నుంచి హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ పైవంతెనకు సమాంతరంగా ఎన్‌ఐఏ వరకు మరో ఫ్లైఓవర్‌ నిర్మిస్తే ఉపయోగకరం.
- సత్యనారాయణరెడ్డి
వేలాది మంది ఐటీ ఉద్యోగులు నిత్యం నిజాంపేట నుంచి రహేజా మైండ్‌స్పేస్‌ వరకు వెళుతుంటారు. పది కి.మీ. దూరానికి గంట నుంచి గంటన్నర పడుతోంది. రద్దీ వేళల్లో, వర్షం పడితే రెండు గంటలపైన ట్రాఫిక్‌లో గడపాల్సి వస్తోంది. నడిచి వెళ్లినా అంతకంటే ముందే గమ్యస్థానం చేరుకోవచ్చు. ఈ మార్గంలోని రహదారులు వెడల్పు చేయగలరు.
- వాసు
రాడిసన్‌ వయా రోలింగ్‌ హిల్స్‌ నుంచి ఏఐజీ, ఐకియా మార్గం  కొండాపూర్‌ వెళ్లేందుకు ఇరుకిరుకుగా ఉంది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పూర్తయితే మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ లోపు ఇక్కడ రహదారి విస్తరణ చేపట్టాలి.
- దినకర్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.