close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

‘కారు’చౌక ఆశ.. మోసపోయాక గోస!

ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఆగని మోసాలు
రూ. లక్షల్లో నగదు బదిలీ.. ఆపై ఫోన్లు స్విచ్ఛాఫ్‌
సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా మేలుకోని బాధితులు
ఈనాడు, హైదరాబాద్‌

‘మారుతీ అల్టో.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ తక్కువ ధరలకే ఇస్తున్నాం..’ అంటూ ఓఎల్‌ఎక్స్‌ పేరిట వెబ్‌సైట్‌లో వచ్చిన ప్రకటనలను నమ్మి మోసపోతున్న ఘటనలకు అడ్డు పడటం లేదు. ఓఎల్‌్ఎక్స్‌ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా అమాయకులు నష్టపోతూనే ఉన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని మిలటరీ కార్యాలయాల్లో పనిచేస్తున్నామని నేరస్థులు తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. మోసపోతున్న బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో ఓఎల్‌ఎక్స్‌ యాజమాన్య ప్రతినిధులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు రప్పించారు. ప్రకటనలు ఆపేయాలని లేదా హెచ్చరికలు జారీ చేయాలని.. లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను గుర్తించి తామే తొలగిస్తామంటూ యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. కొద్దిరోజులు తప్పుడు ప్రకటనలు ఆగినా... తర్వాత పరిస్థితి యథాతథంగా మారింది. రోజుకు సగటున నలుగురు బాధితులు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిందితుల ఖాతాల్లో నగదు జమ చేశాక అది తిరిగిరాదని.. వాహనం చేతికి వచ్చాకే పూర్తి నగదు ఇస్తామని ప్రకటనకర్తలకు కరాఖండిగా చెప్పాలంటూ పోలీసు అధికారులు బాధితులకు అవగాహన కల్పిస్తున్నారు. 


ఇక్కడి రిజిస్ట్రేషన్‌ నంబర్లే..

రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన సైబర్‌ నేరస్థులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో  రిజిస్ట్రేషన్‌ చేయించిన బుల్లెట్‌ బైక్‌లు, కార్ల ఫొటోలను ప్రకటనల్లో ఇస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌, రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్టరైన కార్లు, బైకుల ఫొటోలు సేకరించారు. అసలు ధరలో 50 నుంచి 60 శాతానికే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు బయానా పుచ్చుకున్నాక వాహనాన్ని పంపుతున్నామని, మిగిలిన డబ్బులు పంపించేయాలని సూచిస్తున్నారు. కార్లు కొనుగోలు చేసిన వారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమాశ్రయం పార్కింగ్‌లో వాహనం ఉందని.. వెళ్లి తీసుకోండని సూచిస్తున్నారు. తక్కువ ధరలకే కార్లు వస్తున్నాయన్న ఆశతో క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లలో కొందరు సైబర్‌ నేరస్థుల సూచించిన ఖాతాల్లో నగదు బదిలీ చేసి మోసపోతున్నారు. 


‘కారు’మేఘం

తార్నాకలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సేల్స్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ వారం క్రితం వెబ్‌సైట్‌లో ఐ10 కారు విక్రయ ప్రకటన చూశారు. ప్రకటనలో ఉన్న నంబరుకు ఫోన్‌ చేయగా.. రూ. 3 లక్షలకు ఇస్తానని అవతలి వ్యక్తి చెప్పాడు. ముందస్తుగా రూ. 75 వేలు పంపించాలని సూచించాడు. అంతా బాగుందనుకున్న వరప్రసాద్‌ నిందితుడి ఖాతాలో రూ. 75 వేలు జమ చేశాడు. ఆ నగదు తన ఖాతాలో పడగానే అవతలి వ్యక్తి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.


‘బుల్లెట్‌’ వేగంతో మాయం

డిగ్రీ చదువుకుంటున్న అహ్మద్‌ బిన్‌కు బుల్లెట్‌ అంటే ఇష్టం. ఇటీవల వెబ్‌సైట్‌లో ప్రకటన చూసి.. ప్రకటనకర్తను సంప్రదించాడు. రూ.77 వేలకు బుల్లెట్‌ ఇస్తానని అతను చెప్పాడు. ముందుగా రూ.47 వేలు ఇస్తే రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని నమ్మించాడు. అతని ఖాతాలో అహ్మద్‌ బిన్‌ రూ.47 వేలు జమ చేశాడు. బుల్లెట్‌ కోసం ఫోన్‌ చేయగా.. అవతల రింగే కాలేదు. మోసపోయానని తెలుసుకున్న అహ్మద్‌ బిన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


కారుతో వస్తానని పరారు

కామాటిపురలో నివాసముంటున్న ఫర్హాన్‌ అలీ వారం రోజుల క్రితం ఓఎల్‌ఎక్స్‌లో మారుతీ ఆల్టో కారు అమ్మకపు ప్రకటనను చూశాడు. రూ. 1.32 లక్షలకే కారు విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించడంతో అతని నంబర్‌కు ఫోన్‌ చేశాడు. తాను సికింద్రాబాద్‌లో ఉంటున్నానని అవతలి వ్యక్తి చెప్పాడు. బయానాగా రూ. 42 వేల నగదు జమ చేస్తే... కారు సహా చార్మినార్‌కు వస్తానని, మిగిలిన రూ. 90 వేలు ఇచ్చి కారు తీసుకోవాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఫర్హాన్‌.. రూ. 42 వేల నగదు నిందితుడి ఖాతాలో జమ చేశాడు. గంటలు.. రోజులు గడిచినా అతడు రాలేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.