close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

ఎన్నాళ్లీ వేదన?

ప్రణాళిక లోపం.. పనుల్లో జాప్యం

మిషన్‌ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తం

అవసరం లేకున్నా రోడ్డు తవ్వకాలు

కొరవడిన పర్యవేక్షణ

న్యూస్‌టుడే, పరిగి

పక్కపక్కనే సిమెంట్‌ రోడ్డు తవ్వకాలు

మిషన్‌ భగీరథను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత నీటిని అందించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలన్నది ఆయన సంకల్పం. పనులు సకాలంలో పూర్తి చేసి ఎద్దడి అన్నది లేకుండా చూడాలని ఇప్పటికే చాలా సార్లు అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతో అస్తవ్యస్తంగా సాగుతున్నాయి...

 

రిగి డివిజన్‌లో భగీరథ పనులు నాలుగు నెలల కిందటే పూర్తికావాల్సి ఉన్నా, విపరీత జాప్యం జరుగుతోంది. ప్రధాన పైప్‌లైనువి పూర్తయినా అంతర్గతంగా గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో పురోగతి మందగించింది. ఇంకా రోడ్ల తవ్వకాలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చినా చుక్కనీరు రావడం లేదు. దీంతో గ్రామాల్లో బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ పేరుతో రోడ్లను తవ్వేయడంతో అవి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. పట్టణంలో ఈ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నా, ఎవరూ పట్టించుకోడం లేదు.

గంజ్‌రోడ్డులో నీరు రాక ఇలా కట్టిపడేశారు

ఒకే కాలువ ద్వారా కనెక్షన్‌ ఇచ్చే అవకాశం ఉన్నా..

ఒకే కాల్వలో ఇద్దరికి పైప్‌లైన్‌ కనెక్షన్లను వేర్వేరుగా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రతి ఇంటి వద్ద సిమెంట్‌ రోడ్లను తవ్వేశారు. పరిగిలోని బీసీ కాలనీ, ఖాన్‌ కాలనీ, బాహర్‌పేట కాలనీలకు చెందిన ప్రజలు తాగునీటికి గతంలో చాలాసార్లు రోడ్డెక్కారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి బోర్లు వేయించారు. ఆ వనరులే చాలా వరకు ఎద్దడి సమస్యను తీరుస్తున్నాయి. మూడు నెలల కిందట నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనులు పూర్తి చేసినా పైపుల ద్వారా మాత్రం సురక్షిత తాగునీరు అన్నది కలగానే మిగిలిపోయింది. దీంతో ముఖ్యమంత్రి కలలు కల్లలే అవుతున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు.

ఎద్దడి నివారణలో భాగంగా

ఎద్దడి నివారణలో భాగంగా పరిగి మండలంలోని జాఫర్‌పల్లి సమీపాన నీటి శుద్ధి ప్లాంటు నిర్మాణ పనులను గతంలోనే పూర్తి చేశారు. అక్కడి నుంచే తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకర్గాల ప్రజలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరగపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాలు కురవకపోవడంతో పరిగి నియోజకవర్గంలో భూగర్భ జలాలు ఇంకా పెరగలేదు. ఇప్పటికే బోర్లలో నీరు తగినంత మేరకు రావడం లేదు. ఇప్పటి నుంచే పనులు ప్రణాళికతో చేపడితే ఎద్దడి సమస్య రాకుండా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

లక్ష్మిదేవిపల్లిలో పూర్తికాని ట్యాంకు నిర్మాణం

ప్రతి వ్యక్తికి వంద లీటర్లు

పరిగి నియోజకవర్గంలోని పరిగి, కుల్కచర్ల, దోమ, పూడూరు మండలాల్లో 148 పంచాయతీలు ఉన్నాయి. 338 గ్రామాల్లో 2,27,263 మంది జనాభా నివసిస్తోంది. ప్రతి వ్యక్తికి వంద లీటర్ల చొప్పున నీటిని అందించాల్సి ఉంది. ఈ క్రమంలో 23 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. ఇందుకోసం 322 భూ ఉపరితల ట్యాంకులను మంజూరు చేశారు. ఇందుకోసం వెచ్చిస్తున్న వ్యయం రూ.119 కోట్లు. వాస్తవానికి పనులు ఇప్పటికే పూర్తికావాల్సి ఉంది. గుత్తేదారుల కొరత, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం తదితర సమస్యలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ట్యాంకర్లతో సరఫరా

మిషన్‌ భగీరథ పనుల జాప్యం కారణంగా పురపాలక శాఖ అధికారులు మార్చి మొదటి వారం నుంచి దాదాపు జులై వరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. నిత్యం సుమారు ఆరు నుంచి 8 ట్యాంకర్ల చొప్పున ఐదు నెలల పాటు అంటే 150 రోజులకు రోజుకు ఒక ట్యాంకరుకు రూ.450 చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన చేసిన ఖర్చు దాదాపు రూ.4.5లక్షలు. మరికొందరు నీటి ట్యాంకర్లను స్వతహాగా కొనుగోలు చేసి తమ అవసరాలను తీర్చుకున్నారు. ఈలోపు వర్షాలు కురిసి వినియోగం తగ్గిపోయింది. కొన్ని బోర్లలో నీరు కొద్దిమేర రావడంతో వాటిని మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.

జాఫర్‌పల్లిలో నీటి శుద్ధిప్లాంటు

కనెక్షన్లు నిరుపయోగం

సిద్ధాంతి కాలనీ, బాహర్‌పేటలో కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, బీసీ కాలనీ, మందుల కాలనీలో ఇచ్చిన కనెక్షన్లు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇదేమంటే ఈరోజు రేపంటూ మూడు నెలలుగా తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆయా కాలనీలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. ఇటీవల జరిగిన పరిగి మండల సర్వసభ్య సమావేశంలోనూ పలువురు ప్రజా ప్రతినిధులు మిషన్‌ భగీరథ పనుల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.

త్వరగా పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయి

- సుబ్రహ్మణ్యం, డీఈఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం

మిషన్‌ భగీరథ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా 317 ట్యాంకులకు ఇప్పటివరకు 247 పూర్తికాగా మిగతా 70 ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి త్వరగానే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కేవలం 15 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మిగతా మొత్తం పూర్తయింది. పరిగిలో జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా పనులు కొంత పెండింగ్‌లో పడ్డాయి. అవి త్వరగానే పరిష్కారం కానున్నాయి. బాహర్‌పేటలో 1.5కెఎల్‌ ట్యాంకు నిర్మాణం పూర్తికాగానే పట్టణంలో సగం వరకు పంపిణీ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు

పడాలి ఆధునిక అడుగులు... పంచాలి విజ్ఞాన వెలుగులు

పుస్తకాల అధ్యయనం ఒక తపన... తీరని విజ్ఞాన దాహం... పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైనది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా భావిస్తారు. పుస్తకాలను చదివేందుకు వారికి ఒక స్థలమంటూ ఉండదు.. బస్సులు, రైళ్ల కోసం నిరీక్షిస్తున్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కూడా పుస్తక పఠనాన్ని వదలరు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో అలమరాలో ఉండాల్సిందే. ఆర్థిక స్థోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో, స్నేహితుల దగ్గరో సంపాదించి చదివేదాకా వారికి నిద్ర పట్టదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.