close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అగ్గిరాజేస్తున్న ఆస్పత్రి

నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలలు

అగ్నినిరోధక పరికరాలు కనిపించవు

ఎల్‌బీ నగర్‌ ఘటనతోనైనా మేల్కోవాలి

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ, నిజామాబాద్‌ అర్బన్‌

జిల్లా ఆస్పత్రిలో శిథిలమై రంధ్రం పడిన అగ్ని నిరోధక పైపులైను

‘‘హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లోని షైన్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఆస్పత్రులను చూస్తే ఇక్కడా అలాంటి ఘటనలు జరగవచ్చని తెలుస్తోంది. అగ్నిమాపక నిబంధనలు ఏ మాత్రం పాటించట్లేదు. కనీసం అగ్ని నిరోధక పరికరాలు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల నీటి సదుపాయం కూడా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. వీటిల్లో ఏ చిన్న ఘటన జరిగినా పెను ప్రమాదంగా మారుతుంది.’’

‘‘జిల్లాలో మొత్తం 320 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఇందులో 135 నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడిలోనే ఉన్నాయి. ఈ భవనాలు అగ్నిమాపక నిబంధనల ప్రకారం నిర్మించాల్సి ఉండగా ఎవరూ పాటించట్లేదు. చాలా వరకు నివాస భవనాల్లోనే నడుపుతున్నారు. ప్రస్తుతం ఐదులోపు ఆస్పత్రులు మాత్రమే అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌వోసీ(నిరభ్యంతర పత్రం) కలిగి ఉన్నాయంటే రోగులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తుంది.’’


15 మీటర్లు పైబడి ఉంటే...

15 మీటర్లు పైబడి ఉన్న ఆస్పత్రి భవనాలకు ఎన్‌వోసీ తప్పనిసరి. ఇలాంటివి పదికి పైగా ఉన్నాయి. వీరెవరూ ఎన్‌వోసీ తీసుకొనేందుకు ముందుకు రావట్లేదు. కనీసం అగ్ని నిరోధక పరికరాలనైనా ఏర్పాటు చేయట్లేదు.

తాజాగా నిజామాబాద్‌లోని మూడు ఆస్పత్రులకు అగ్నిమాపకశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్‌వోసీ ఎందుకు తీసుకోలేదని అడిగారు. యాజమాన్యాల నుంచి వివరణ వచ్చిన అనంతరం చర్యలు తీసుకొనే వీలుంది.


మరీ ఇంత దారుణమా..?

* ఖలీల్‌వాడి ఆస్పత్రుల కేంద్రంగా మారింది. ఇక్కడ ఏ భవనం కూడా అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా లేదు.

* రెండు భవనాల మధ్య కనీసం 6 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. ఒక భవనంలో ప్రమాదం జరిగినా ఇంకో దానిలోకి వ్యాపించకుండా ఉంటాయి. పైగా అగ్నిమాపక వాహనం చుట్టూ తిరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

* కొందరు కేవలం ఆరోగ్యశ్రీ అనుమతుల కోసమే అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత వాటి నిర్వహణ పట్టించుకోవట్లేదు.

* పలు ఆస్పత్రుల వద్దకు అగ్నిమాపక వాహనం వెళ్లే పరిస్థితి లేదు.

* కొన్నింటికి కేవలం మెట్లు మాత్రమే ఉన్నాయి. అత్యవసర ద్వారాలు, స్టెర్‌కేస్‌ సౌకర్యాలు లేవు.

* కొందరు మొక్కుబడిగా పరికరాలు ఉంచి వదిలేస్తున్నారు. పక్కా విద్యుత్తు వ్యవస్థ కూడా ఉండట్లేదనే విమర్శలున్నాయి. ఇదే కారణంతోనే గతంలో పలు ఆస్పత్రుల్లో విద్యుదాఘాతాలు చోటు చేసుకొన్నాయి.

* ఇళ్లను వైద్యశాలలుగా మార్చి కొనసాగిస్తున్నారు. వీటిల్లో కనీస భద్రతా చర్యలు ఉండట్లేదు.


పిల్లల విభాగాల్లో..

చిన్న పిల్లల విభాగాల్లో రాత్రివేళల్లో సిబ్బంది ఏమరపాటుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎన్‌సీయూ, వార్డుల్లో రాత్రివేళ పర్యవేక్షణ ఉండట్లేదు. చిన్నపాటి ఘటన జరిగినా పెద్దదిగా మారే ఆస్కారం ఉంది. పలు వైద్యాలయాల్లో చిన్నపిల్లలు మాత్రమే ఉంటున్నారని దొంగల భయంతో గదులకు తాళాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతి.


సర్కారు దవాఖానాలో..

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అగ్ని నిరోధక పరికరాలు లేవు. ఇక్కడ నిత్యం 5 వేల మందికి తగ్గకుండా వస్తుంటారు. రోగుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఏడంతస్తుల భవనం ఉన్నా కనీస పరికరాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి.

* నీటి సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. ఇక పైపులైన్లు పూర్తిగా శిథిలమయ్యాయి. పలు చోట్ల రంధ్రాలు ఏర్పడడంతో ట్యాంకుల నుంచి నీటి సరఫరా కావట్లేదు.

* స్ప్రింక్లర్లు, అలారం పరికరాలు పని చేయట్లేదు.

* ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఇదేం పద్ధతి?

ఆస్పత్రుల్లో అగ్నికి దోహదపడే ఎలాంటి పనులు చేయరాదు. చాలా చోట్ల వంటలు చేసుకొనేందుకు అనుమతిస్తున్నారు. సిలిండర్లు, గ్యాస్‌ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వీటి విషయంలోనూ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి.


నిబంధనలు ఇవీ...

* భవనానికి రెండు వైపులా దారి ఉండాలి. ఒకవైపు మెట్లు ఉంటే మరోవైపున ర్యాంపు ఉండి తీరాలి.

* పొగ ద్వారా ప్రమాదాన్ని గుర్తించే అలారం డిటక్టర్‌ను ఏర్పాటు చేయాలి.

* భవనం పైఅంతస్తులో 20 వేల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకు ఉండాలి.

* అగ్ని నిరోధక సిలిండర్లను ప్రతి అంతస్తులో, గదిలో ఉంచాలి.

* ఎప్పుడూ నీటి సదుపాయం ఉంచాలి

* ప్రథమ చికిత్స విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.

* నీటి పైపులైన్లు, స్ప్రింక్లర్లు బిగించాలి.

* భూభాగంలో 1.50 లక్షల సామర్థ్యం కలిగిన నీటి సంపుని ఏర్పాటు చేయాలి.


నిబంధనలు పాటించని వారిపై చర్యలు

ఆస్పత్రుల యాజమాన్యాలు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటించాల్సిందే. 15 మీటర్ల పైబడిన భవనాల నిర్వాహకులు తప్పనిసరిగా ఎన్‌వోసీ కలిగి ఉండాలి. ఇలాంటి వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. నిర్ణీత గడువులోగా పొందని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

- మురళిమనోహర్‌రెడ్డి, డివిజినల్‌ అగ్నిమాపకశాఖ అధికారి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.