close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

అవస్థలే సమస్తం.. నిరీక్షణ సశేషం!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల్లో నిర్లక్ష్యం
అంతులేని ఓపికుంటేనే ఓపీ చిట్టీ చిక్కేది
నాలుగు మందులు రాస్తే.. ఇచ్చేది రెండే
నిధుల విడుదలలోనూ జాప్యం
వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత

పేరుకే పెద్దాసుపత్రులు.. ఎక్కడికెళ్లినా అంతులేని నిరీక్షణ.. అంతకుమించి అవస్థలను భరిస్తేనే చికిత్స అందే దైన్యం... రోగుల నుంచి డబ్బులు వసూలుచేసే నిమ్స్‌నుంచి గాంధీ, ఉస్మానియా వాటి పరిధిలోని నిలోఫర్‌, ఈఎన్‌టీ, ఫీవర్‌... ఇలా నగరంలోని ఏ  సర్కారు ఆసుపత్రిలో చూసినా ఇందుకు భిన్నమైన పరిస్థితి లేదు. గతంతో పోలిస్తే రోగుల తాకిడి 20-30 శాతం పెరిగినా సరే.. ఆ మేరకు వసతులు కల్పించడంలో ఏళ్లుగా నిర్లక్ష్యంతో రోగులు నిత్యం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.  ఇక ఇక్కడి పారిశుద్ధ్య పరిస్థితిపై ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి ఈల రాజేందర్‌ వైద్యులతో జరిపిన ముఖాముఖిలో.. సమస్యలను ఏకరవు పెట్టినా తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రధాన ఆసుపత్రులను ‘ఈనాడు’ బృందం పరిశీలించింది. ఆయా దవాఖానాల్లో పరిస్థితులు...రోగులు ఎదుర్కొనే కష్టాల వివరాలు ఎలాగున్నాయంటే.....

ఈనాడు, హైదరాబాద్‌
ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, సుల్తాన్‌బజార్‌, అమీర్‌పేట, నల్లకుంట - న్యూస్‌టుడే

నగరంలోని ఓ కార్యాలయ ఉద్యోగిని మంగళవారం పాము కాటు వేసింది. ఉస్మానియాకు తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ఆసుపత్రిలో చేరాలన్నారు. విచారణ కేంద్రంలో వివరాల నమోదుకు అరగంట పట్టింది. తోడుగా వచ్చిన వ్యక్తి సెలైన్‌ సీసా పట్టుకొన్నాడు. ఇలా ఆసుపత్రిలో చేరేందుకే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి.
‘మూత్రం లో మంటగా ఉండటంతో ఉదయమే వచ్చాను. రెండు గంటల తర్వాత ఓపీ చీటీ దొరికింది. మరో గంట వైద్యుడి కోసం నిరీక్షించాను. మూడు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 12 కావడంతో ఓ ల్యాబ్‌ వారు మరుసటి రోజు రావాలని చెప్పగా ఇంకో ల్యాబ్‌కు తాళం వేసే ఉంది..’ -ఉస్మానియాకు వచ్చిన కొత్తపేటవాసి సలీముద్దీన్‌ ఆవేదన ఇది.
‘కుమారుడికి తీవ్ర జ్వరంతో నిలోఫర్‌కు తీసుకువచ్చా. ఓపీ చీటీ దొరకడం కష్టమని నగరంలోనే ఉండే నా సోదరుడికి ముందే చెప్పా. అతను తెల్లవారు జామునే వచ్చి క్యూలో ఉంటే 10 గంటలకు దొరికింది. వైద్యుడి కోసం మరో గంట, పరీక్షలు, మందులకు మరో గంట పట్టింది. -మంచిర్యాల వాసి  శ్రీనివాస్‌ నిట్పూర్పు.

ఉస్మానియా ఆసుపత్రి
రెండు, మూడు రోజులు తిరగాల్సిందే

ఉస్మానియాలో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజూ రెండువేల మంది అవుట్‌ పేషెంట్‌ రోగులు చికిత్సలు పొందుతున్నారు. పరీక్షల కోసం కొన్నిసార్లు రెండుమూడు రోజులు తిరగాల్సివస్తోందని వాపోతున్నారు. ఉదయం 8 గంటలకు చీటి కోసం దాదాపు రెండు గంటలు నిరీక్షించాల్సిందే. ఆయా విభాగాల్లోని నిపుణుల వద్ద మరో గంట వేచిచూడాలి. రోగ నిర్ధరణ పరీక్షలకు వెళితే అదే పరిస్థితి. ఇంతా చేసి.. మధ్యాహ్నం 12 దాటితే శాంపిళ్లు తీసుకోవడం లేదు.
* జనరల్‌ మెడిసిన్‌, సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్‌, న్యూరాలజీ, న్యూరోసర్జరీ తదితర ఓపీ విభాగాల్లో వైద్యులు, ఇతర విభాగాల్లో కొందరు సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజవుతున్నారు. 
* రోగుల నుంచి సేకరించే రక్త, మూత్ర, ఎక్స్‌రేవంటి రోగ నిర్ధరణ పరీక్షల నమూనాలు వైద్య సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థినులు ఆయా కేంద్రాల్లో అందించాలి. ఆ పనిని కొందరు రోగులకే పురమాయిస్తున్నారు. మూడు భవనాల్లో ఏ విభాగం ఎక్కడ ఉందో తెలియక రోగులు ఆందోళనకు గురవుతున్నారు. 
* ఆస్పత్రిలో ప్రస్తుతమున్న పడకలు సరిపోవడం లేదు. రద్దీతో వార్డుల్లో కింద పడకలు వేసి సర్దుబాటు చేస్తున్నారు. ఐసీయూలు, ఆర్‌ఐసీయూ, ఎంఐసీయూల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరతా వేధిస్తోంది. అత్యవసర మందుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
* దాదాపు 250మంది పారిశుద్ధ్య సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేస్తున్నా జనం రద్దీతో పారిశుద్ధ్యం అంతంత మాత్రమే.
* వైద్యులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది కొరత వేధిస్తోంది. అదనంగా 200మంది వరకు నర్సులు కావాలి. అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల ఖాళీలూ ఉన్నాయి. 

గాంధీ ఆసుపత్రి
ఎంతో ఓపికుండాల్సిందే..

* గాంధీలో.. వైద్యులు నాడిపట్టడం నుంచి నిర్ధరణ పరీక్షలు, సర్జరీల వరకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చిటీ తీసుకునే దగ్గరి నుంచే తిప్పలు షురూ. ప్రస్తుతం ఈ కేంద్రాలు 11ఉన్నాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా నిర్వహిస్తున్నా రద్దీ తప్పడం లేదు. మరో 5 కౌంటర్లు అవసరం.
* వ్యాధి నిర్థారణ కేంద్రాల వద్దా గంటల పాటు వేచిచూడాల్సిందే. సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ తదితర యంత్రాలన్ని అందుబాటులో ఉన్నా రద్దీకి సరిపోవడంలేదు. ఒక ఓపీ చిటీ తీసుకుని లోపలికి వెళ్లి మళ్లీ బయటకు వచ్చేందుకు ఆరేడు గంటల కంటే ఎక్కువే సమయం పడుతోంది. కొన్నిసార్లు రెండో రోజు రాక తప్పడం లేదు.
* చిన్నా చితకా శస్త్ర చికిత్సల కోసం ఓపీలో ఉన్న ఆపరేషన్‌ థియేటర్ల వద్ద కూడా రోగులు బారులు తీరుతున్నారు. నిర్ధరణ పరీక్షల్లో జాప్యం ప్రభావం శస్త్ర చికిత్సలపైనా పడుతోంది.
* గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ తదితర విభాగాలకు ఇటీవల కాలంలో రోగుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సేవలు అందుబాటులో లేవు.
* మూడు నెలలుగా విషజ్వరాలు, గన్యా, డెంగీ రోగుల తాకిడి అదనంగా ఉండటంతో పడకలు సరిపోవడంలేదు. స్ట్రెచర్లు, వీల్‌ ఛైర్లు సరిపడా లేవు. వీటినే ఆసుపత్రి సామగ్రి తరలించేందుకు వినియోగిస్తుండటం గమనార్హం. ఇక ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ ఘోరంగా ఉంది.

నిలోఫర్‌ ఆసుపత్రి
వైద్యులను కలవడమే గగనం!

* చిన్న పిల్లలు, మహిళలకు సంబంధించిన వ్యాధులను పరీక్షించే నిలోఫర్‌ ఆస్పత్రిలో వైద్యుడిని కలవడం కన్నా కష్టమైన పని మరొకటి ఉండదు. అత్యవసర సేవల్లో మినహా సాధారణ పరీక్షలు, చికిత్స పొందడానికి వెళ్లేవారికి గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. ఔట్‌ పేషంట్లుగా వైద్య సేవలు పొందాలంటే ఆస్పత్రి పని వేళలు ప్రారంభానికి మూడుగంటల ముందే చేరుకోవాల్సిందే.
* ఐదు ఓపీ కౌంటర్లున్నాయి. ఇందులోనే చిన్నారులు, మహిళల విభాగాలున్నాయి. వీటిలో వైద్యులు పరీక్షలు చేయడానికి ఉదయం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటారు. రోజువారీ ఓపీలను చూడడానికి వీరికి సమయం సరిపోవడం లేదు. వైద్యుల సేవల సమయాన్ని పెంచాల్సి ఉంది.  ః అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవడానికీ రెండురోజులు తిరగాల్సి వస్తోంది. ఎంఆర్‌ఐ పరికరం లేదు.
* ఆస్పత్రిలో వెంటిలేటర్లు, ఫొటోథెరపీ పరికరాలు కొన్ని పనిచేయడం లేదు. కనీసం 70-80 ఫొటోథెరపీ(లైట్‌థెరపీ) పరికరాలు అవసరం.
* న్యూరో, ఆర్థోపెడిక్‌ సర్జన్లు లేక అత్యవసర సమయాల్లో పిల్లలను ఉస్మానియా, గాంధీకి తరలిస్తారు. ఇలా తిప్పడంతో ఇన్‌ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయి.

ప్రసూతి ఆసుపత్రి..
పాట్లు పరిపాటి

* సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నిత్యం రద్దీనే. ఓపీలో పేరు నమోదుకే గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన వసతులు లేకపోవడంతో నిల్చోలేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు.
* ఉదయం 8.30గంటలకు ఓపీ ప్రారంభమవుతుంది. అంతవరకు గర్భిణులు నిరీక్షించాల్సిందే. నిత్యం 1200నుంచి 1500 ఓపీ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఉదయం 6 గంటలకే వస్తారు. గేటు తెరవక పోవడంతో అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి.
* 160 పడకల ఇన్‌ పేషెంట్‌ విభాగంలో 250 వరకు గర్భిణులు, బాలింతలు అవస్థల మధ్య చికిత్స పొందుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో పడకపై ఇద్దరు ఉండాల్సిన పరిస్థితి.
* పేట్లబురుజులోని మరో ప్రసూతి ఆస్పతిలోనూ  రద్దీ కొనసాగుతోంది. పారిశుద్ధ్యం సరిగా లేదు.
* గేటు వద్దే నిరీక్షణ, గేటు తెరిచాక అవసరమైన మేరకు బెంచీలు లేక నిండు గర్భిణులు, బాలింతలు నిల్చోలేక సొమ్మసిల్లి పోతుంటారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు ఆలస్యంగా రావడంతో సేవల్లో కొంత జాప్యం జరుగుతోంది.

ఫీవరాసుపత్రి
కాస్త మెరుగైందంతే..

* అన్ని రకాల జ్వరాల చికిత్సలకు రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా నల్లకుంట ఫీవరాసుపత్రికి పేరుంది.గతంలో వందల్లో వచ్చే రోగుల సంఖ్య ప్రస్తుతం వేలకు చేరడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
* రోగుల రద్దీతో ఓపీ, వైద్యుల కౌంటర్లు పెంచినా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఓపీ ప్రారంభ సమయం ఉదయం 9గంటలు..రెండుగంటల ముందే రోగులు వస్తుంటారు. ప్రస్తుతం సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కోనసాగుతోంది.
* కొందరు వైద్యులు సమయపాలన పాటించరని ఇక్కడి సిబ్బందే చెబుతున్నారు. దీంతో పనిభారం హౌజ్‌ సర్జన్లు, జూనియర్‌ వైద్యులపై పడుతోంది. కొందరు వైద్యులు మధ్యాహ్నం ఒంటిగంట వరకే ఉంటున్నారని రోగులు వాపోతున్నారు.
నిత్యం 2000 మంది వరకు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తీవ్రతను బట్టి 30నుంచి 100 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు.

నిమ్స్‌ ఆసుపత్రి
డబ్బులు చెల్లించినా సేవల్లో నిర్లక్ష్యమే

* పంజాగుట్టలో ఉండే నిమ్స్‌ ఆసుపత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆ స్థాయిలో వసతులు మాత్రం లేక అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పరిపాలన విభాగ వైఫల్యంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
* సకాలంలో ఓపీలు ప్రారంభం కావడం లేదు. ఓపీకార్డు పొందడానికే రెండుచోట్ల మూడు గంటలు పడుతోంది. ఉదయం 9 దాటితే తప్ప వైద్యులు కనిపించడం లేదు. గతంలో 1200మంది రోగులు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య రెండింతలు పెరిగింది. ఓపీ కేంద్రాలు, పరీక్షల కౌంటర్లు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు.
* వైద్యులు ఒక్కోరోజు ఒక్కో యూనిట్‌లో ఉంటారు. ఉదయం ఓపీకి వచ్చిన వారికి వ్యాధి నిర్ధరణ పరీక్షల నివేదికలు సాయంత్రం ఐదు తర్వాత అందుతాయి. ఆ సమయానికి వైద్యులు ఉండరు. దీంతో మర్నాడు రావాల్సిందే. ఆ రోజు సంబంధిత వైద్యుడు యూనిట్‌లో లేకపోతే మరో రోజు నిరీక్షణ తప్పదు. ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌, ఈఎమ్‌ఎన్‌జీ, కలర్‌ డాప్లర్‌ పరీక్షలకు తిప్పలతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
* రోగుల ద్వారా వచ్చే ఫీజులతో నెలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఆ స్థాయిలో సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు.
* ఇటీవల మంచాలు కొన్నా వాడకుండా ఖాళీ గదుల్లో వృథాగా ఉంచారు. ఎమర్జెన్సీ భవనం ఐదో అంతస్తుతో పాటు పలు చోట్ల వృథాగా వదిలేశారు.

ఈఎన్‌టీ ఆసుపత్రి
ఓపీకి గంటలు.. శస్త్రచికిత్సకు నెలలు

* కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆసుపత్రి ఓపీలో చికిత్స కోసం వచ్చే రోగుల పాట్లు వర్ణనాతీతం. నిత్యం 1200-1500 మంది వస్తుంటారు. ఉదయం 8.30 గంటలకు నమోదు కౌంటర్‌ ప్రారంభమవుతుంది.
* ఒక్కో కేంద్రమే ఉండటంతో దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే చేరుకుని నిరీక్షిస్తుంటారు. నమోదుకు గంట నుంచి రెండు గంటలు.. అనంతరం చికిత్సకు మరో గంట, పరీక్షలు అవసరమైతే ఆయా కేంద్రాల వద్ద మరో గంట నిరీక్షించాల్సిందే. మందుల కౌంటర్‌ వద్దా నిరీక్షణ తప్పదు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి 8-10 నెలల గడువు తేదీగా రాసి పంపుతున్నారు. తగినన్ని ఆపరేషన్‌ థియేటర్లు లేకే ఈ పరిస్థితి. అనస్థీషియా ఇచ్చే వైద్యులూ కరవే.
* ఓపీ, రిజిస్ట్రేషన్‌ల కంప్యూటరీకరణతో పాటు నిర్మిస్తున్న ఓటీ కాంప్లెక్స్‌ అందుబాటులోకి వస్తే అన్నింటా నిరీక్షణ తప్పే అవకాశముంది.


 
 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.