close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు

● ఖమ్మం నగరానికి మరో రూ.50కోట్లు

● మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


నగరపాలక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు కొనసాగించాలని, అందుకోసం ప్రజాప్రతినిధులందరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరముందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం నిర్వహించిన ఖమ్మం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారిగా నగరపాలక కార్యాలయానికి వచ్చిన ఆయనను పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పుర, నగరపాలకానికి దక్కని అవకాశం ఖమ్మంకు దక్కిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.63కోట్లు వినియోగించుకునేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతించిందని, మరో రూ.50కోట్లు వినియోగించుకునేందుకు త్వరలోనే ఆదేశాలు జారీచేయనున్నట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు నగరపాలక అధికారులు కృషిచేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో గుత్తేదారులెవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.

చేసుకున్న అభివృద్ధిని నిలుపుకోవాలి

నగరపాలకంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. నగరపాలక సంస్థ పరిధి విస్తరించిన దృష్ట్యా, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మనం చేసే అభివృద్ధి పనులకు రాజకీయ పార్టీ ఓ వేదిక మాత్రమేనని, దానికనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా అర్థవంతమైన చర్చలు నిర్వహించాలని సూచించారు. తమకొచ్చిన పదవుల ద్వారా మంచి అనుబంధాలను అలవర్చుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పౌరస్పృహతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

కమిషనర్‌ను అభినందించిన మంత్రి

14 నెలలు పాటు పనిచేసిన కమిషనర్‌ జె.శ్రీనివాసరావు ఎటువంటి సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించారని మంత్రి పువ్వాడ అభినందించారు. కమిషనర్‌ జీహెచ్‌ఎంసీకి బదిలీ కావడంతో మంచి ఉద్యోగిని నగరపాలక సంస్థ, ప్రజలు దూరం చేసుకుంటున్నారని అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పనిచేసిన ఘనత శ్రీనివాస్‌కు దక్కిందన్నారు.

మంత్రికి అభినందనల వెల్లువ

కమిషనర్‌ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా కొత్తగా ఆలోచించడం, ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేసే మంత్రి జిల్లాకు దొరకడం అదృష్టమన్నారు. మేయర్‌ డాక్టర్‌ గుగులోత్‌ పాపాలాల్‌ మాట్లాడుతూ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి రావడం ద్వారా నగరపాలకానికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రజాభిమానాన్ని చూరగొన్న వ్యక్తిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ నిలిచారని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ అఫ్రోజ్‌సమీనా, కార్పొరేటర్‌ కోరారు. పువ్వాడ ఫౌండేషన్‌ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి రావడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని సీపీఐ ఫ్లోర్‌లీడర్‌ క్లెమెంట్‌ అన్నారు. అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కడం ఖమ్మం ప్రజల అదృష్టమని, నిధులు రాబట్టడంలో తన ప్రత్యేక చాటుకున్నారని తెరాస ఫ్లోర్‌లీడర్‌ కర్నాటి కృష్ణ కొనియాడారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.