close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

పెద్దల బాట.. పిల్లల వికాసానికి బాసట

తల్లిదండ్రులపై నమ్మకమే బాలలకు పునాది
 ఎదిగే వయసుకు తగినట్టుగా జీవన నైపుణ్యాలు
 వ్యక్తిగత ఇష్టాలు.. వారిపై రుద్దొద్దు

బోసి నవ్వులను ఆస్వాదిస్తారు.. తప్పటడుగులు సరిచేస్తారు.. చిట్టిపొట్టి మాటలకు మురిసిపోతారు.. బిడ్డల పసితనపు    అనుభూతులను తల్లిదండ్రులు ఆనందంగా చవిచూస్తారు. పిల్లలు ఎదిగేకొద్దీ.. కఠినంగా ఉండాలా! స్నేహంగా మెలగాలా! స్వేచ్ఛనివ్వాలా! క్రమశిక్షణతో పెంచాలా! ఇలాంటి ఎన్నో  సందేహాల మధ్య సతమతమవుతూనే ఉంటారు. ఈ సందిగ్ధతకు  ‘కన్న బిడ్డలతో తల్లిదండ్రులుగా మెలగడమే’ పరిష్కార మార్గమని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. వారి మనోవికాసానికి అడ్డుగోడగా కాకుండా.. కొత్తగా నాటే మొక్కకు అంటుగా మారి.. పిల్లల మనోవికాసానికి బాసటగా నిలువాలంటున్నారు.

పిల్లలు సాధించే విజయాలకు తల్లిదండ్రుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. దానికి కొలమానంగా బహుమతులుగా ఇవ్వడాన్ని తగ్గించాలి. తరగతి పెరిగే కొద్దీ బహమానం విలువ వందల నుంచి రూ. వేలు, లక్షలకు చేరుతుంది. మాటలతో మెప్పుకోలు, పొగడ్త, దగ్గరకు తీసుకుని హత్తుకోవడం వంటివి.. ఆయా సందర్భాలకు అనుగుణంగా స్పందించాలి.

బొజ్జలో ఉండగానే బుజ్జగింపులు

కాబోయే తల్లిదండ్రుల్లో చాలా మంది.. కడుపులో బిడ్డ మానసిక, శారీరక ఆరోగ్యంగా ఉండాలని యోగాకు సమయం కేటాయిస్తున్నారని శిక్షకురాలు జి.జెస్సీనాయుడు వివరించారు. పిల్లల పెంపకంలో అమ్మానాన్నలిద్దరూ ఒకేతాటిపై ఉండాలనే అంశమూ ఈ శిక్షణలో దాగిఉందన్నారు. ఈ తరం పిల్లల వేగానికి తగినట్టుగానే పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు న్యూరోసైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి.

అనుకరణే తొలి పాఠం

మా అబ్బాయి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు.. మా పాప తరచూ అబద్దాలు చెబుతుంది.. చాలా చిన్నవిగా కనిపించే ఈ సమస్యలకు పసితనంలోనే పునాది పడుతుందంటున్నారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు ఆరే సునీత. 0-5 ఏళ్ల మధ్య పిల్లలు తల్లిదండ్రులు, బంధవులు, చుట్టుపక్కల తాము గమనించే అంశాల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, సోదరులను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. మనమెలా ఉన్నా పిల్లలకు ఏమీ తెలియదులే అన్న అపోహను పెద్దలు వీడాలి. మెదడు అభివృద్ధి చెందే 0-5 సంవత్సరాల వయసులో పిల్లల ప్రవర్తనకు సంబంధించిన బీజం వేయాలంటున్నారు నిపుణులు. ఆట పాటలు, కథలు చెప్పటం ద్వారా నైపుణ్యాలకు బాటలు వేయాలని సూచిస్తున్నారు.

గారాబం వద్దు.. క్రమశిక్షణకూ హద్దు

6 నుంచి 12, 13 సంవత్సరాల మధ్య వయసులో పిల్లల్లో శారీరక మార్పులు మొదలవుతాయి. ప్రవర్తనా మారుతుంది. మొండితనం, తమ మాటే చెల్లుబాటు కావాలనడం, కోపం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. కీలకమైన ఈ సమయంలోనే అమ్మానాన్నల తీరు పిల్లల భవితను నిర్దేశిస్తుంది. కొందరు అతి గారాబం చేస్తారు. కొందరు కఠిన క్రమశిక్షణతో పెంచేందుకు ప్రాధాన్యమిస్తుంటారు. ఏదైనా హద్దులో ఉండాలంటున్నారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు సునీత. గారాబం చేస్తూనే.. అవసరమైన సమయంలో క్రమశిక్షణ కూడా నేర్పించాలి. పిల్లలు ఏది కోరినా వెంటనే కొనివ్వడం అలవాటుగా మారింది. అడగ్గానే కాళ్లముందు వాలిపోతుందనే భావనకు పునాది వేస్తున్నారు. అలా కాకుండా.. వారి కోరిక తీర్చడానికి ఆలస్యం చేయాలి. దాని అవసరం ఎంత ఉందనేది వివరించాలి.

స్వేచ్ఛనివ్వాలి.. కానీ..

ఆధునికత పేరుతో పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నాం. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉండే అవకాశమిస్తున్నాం. వీటిలో హద్దులు విధించాలి. ఆడుకునేందుకు బయటకు వెళుతున్నామని చెబితే ముందుగానే సమయం నిర్దేశించాలి. స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాలం, వీడియో గేమ్‌లు వంటి వాటి విషయంలోనూ అరగంట, గంట వీలును బట్టి ముందే సమయాన్ని సూచించాలి.

చేటు చేసే మాటలతో భద్రం

పిల్లలతో ప్రతికూలంగా మాట్లాడకూడదు. తల్లిదండ్రులే వారి బలహీనతలను బహిరంగపర్చడం సరికాదు. అవన్నీ వారి మనసులో నాటుకుపోతాయి. పెద్దయ్యాక.. కుటుంబం/ఉద్యోగ బాధ్యతల్లో మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదమూ ఉంది. మా పిల్లలు.. సమయానుగుణంగా నడుచుకోగలరు.. సర్దుకుపోగలరంటూ సానుకూలంగా చెప్పడం అలవరచుకోవాలి.

బాక్సింగ్‌లో  కొత్త మెరుపు

చిన్నప్పుడు వేలుపట్టి నడిపించిన తండ్రి శిక్షణలోనే బాక్సింగ్‌లో రాణిస్తూ అలవోకగా బంగారు పతకాలు సాధిస్తున్నాడో బుడతడు. షేక్‌పేట మారుతీనగర్‌కు చెందిన ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి పిట్లం ద్వారకేశ్‌దీ ప్రతిభ. షేక్‌పేట ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో తండ్రి పి.వినేష్‌బాబు శిక్షణలోనే అతడు సాధన చేస్తుండటం విశేషం. వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో రాణిస్తూ పోటీల్లో బంగారు పంచ్‌లు విసిరి జాతీయ పోటీలకు ఎంపికవుతూ వస్తున్నాడు. త్వరలో జరిగే జాతీయ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ప్రతిరోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల అభ్యాసం చేస్తానని ద్వారకేశ్‌ తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తీసుకురావడమే లక్ష్యమని చెప్పాడీ బాక్సింగ్‌ బుల్లోడు.

వ్యర్థాలపై సాంకేతిక అస్త్రం

బుద్దిగా చదవాలి.. మార్కులు.. ర్యాంకులూ రావాలి. అక్కడితో ఆగకుండా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలంటున్నారీ బుడతలు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్య, భార్గవ్‌లు.. వ్యర్థాలను సకాలంలో తొలగించేందుకు ఉపకరించే సాధనానికి రూపమిచ్చారు. ఉపాధ్యాయుల తోడ్పాటుతో ఈ ఆవిష్కరణకు ప్రాణంపోశారు. అదే టెక్‌బిన్‌.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంతో డస్ట్‌బిన్‌లో చేరే వ్యర్థాలను సకాలంలో తొలగించడం తేలికవుతుందంటున్నారు. టెక్‌బిన్‌ పరిజ్ఞానాన్ని డస్ట్‌బిన్‌లో ఉంచాలి. 80శాతం వ్యర్థాలు నిండగానే యాప్‌నకు సమాచారం వస్తుంది. వెంటనే స్పందించి దాన్ని శుభ్రం చేయవచ్చంటున్నారు. సెన్సార్ల సహాయంతో పనిచేసే ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారీ చిన్నారులు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.