close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

విద్యార్థుల..తెలుగువెలుగులు!

‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం
మాతృభాషపై రాష్ట్రస్థాయి పోటీల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నారులు
- న్యూస్‌టుడే, బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఈనాడు’ - ‘హాయ్‌బుజ్జీ’ , ‘తెలుగు వెలుగు’, ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫైనల్‌ పోటీల్లో పాల్గొన్న పలువురు చిన్నారులు తెలుగు భాషపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పోటీలు హైదరాబాద్‌ సోమాజీగూడలోని ‘ఈనాడు’ కార్యాలయంలో సందడిగా సాగాయి. తెలుగు భాషలో పట్టు సాధిస్తేనే విజ్ఞానాన్ని మరింతగా పెంచుకోవడానికి వీలుపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పోటీల అనంతరం విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారిలా..

తెలుగు లేనిదే అభివృద్ధి లేదు
- రాహుల్‌, సిద్ధార్థ హైస్కూలు, సూర్యాపేట

తెలుగు మన మాతృభాష. అది లేకపోతే అభివృద్ధి అనేదే లేదు. మనం మాట్లాడే భాషలోనే మనం ఏదైనా నేర్చుకోగలం. మాతృభాష లేకుండా ఇంకేదీ నేర్చుకోలేం. అందుకే తెలుగు ఉండాల్సిందే. మనం మాట్లాడే భాషలోనే విద్యాభ్యాసం సాగాలి. ముందు భాషను అర్థం చేసుకుంటేనే పాఠ్యాంశాల్లోని విషయాలను గ్రహించగలం.

తెలుగు కనుమరుగవుతోంది
- శ్రీవర్ష, రమణ హైస్కూలు, వరంగల్‌

ఆంగ్ల భాష మీద ఇష్టంతో చాలామంది తెలుగును పట్టించుకోవడం లేదు. మనం మాట్లాడే భాషలోనూ ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం మిళితమవుతున్నాయి. అచ్చమైన తెలుగు వినిపించడం లేదు. మన భాషలో ఇతరులవి చేర్చుకోవడం కాకుండా, తెలుగులోని మరుగున పడిన పదాలను వెలుగులోకి తీసుకురావాలి.

విదేశీయులు మెచ్చుకున్న భాష మనది
- స్నేహ, వికాస్‌ స్కూల్‌, హైదరాబాద్‌

మనం మన భాషను నిర్లక్ష్యం చేస్తున్నాం. కాని ఇతరులు మన తెలుగును మెచ్చుకొని కీర్తించారు. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరు తెచ్చుకున్న భాష మనది. దేశంలోని పరాయి రాష్ట్రాల వారు కూడా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. గుండ్రటి అక్షరాలతో చూడముచ్చటైన తెలుగు లిపి మరెవరికీ లేదు.

తెలుగు తెలుగే
- అమృత చందన, మోడర్న్‌ హైస్కూల్‌, మహబూబ్‌నగర్‌

మాతృభాషలో పట్టు సాధిస్తే, ఇంకే విషయాన్ని అయినా తెలుసుకోవడం సులువు అవుతుంది. తల్లిలాంటిది తెలుగు భాష. అమ్మను మించిన వారు ఉండరన్నట్లు, మన భాషను మించింది మరోటి ఉండదు.

 

ఆంగ్లంతోపాటు తెలుగు కావాలి
- అన్వేష్‌, ఎం.జె.పి.స్కూలు, అదిలాబాద్‌

ఆంగ్లంపై ఇష్టం మంచిదే. కాని మన భాష తెలుగు కూడా కావాలి. ఆంగ్లంలో మాట్లాడితే గొప్ప అనుకుంటున్నాం కనుక అది నేర్చుకోవాలి. కాని తెలుగును వదులుకోవడం మంచిది కాదు. తెలుగులో పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నంతగా ఆంగ్లంలో సాధ్యం కావడం లేదు.

మాలో విజ్ఞానాన్ని వెలికి తీశారు

- పి.కీర్తిక (మొదటి విభాగంలో ప్రథమ విజేత), 7వ తరగతి, ఖమ్మం
‘ఈనాడు’ నిర్వహించిన పోటీలతో తెలుగుభాషను ఎంతో నేర్చుకొనేందుకు అవకాశం దక్కింది. భిన్నమైన పరీక్షల ద్వారా మాలో ఉన్న విజ్ఞానాన్ని వెలికితీశారు. నిజంగా తెలుగులో మాకు ఇంత పరిజ్ఞానం ఉందా అనిపించింది. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా తెలుగును మరింత సరళంగా రాయడం, మాట్లాడటం నేర్చుకున్నా. కలివిడితత్వం అలవడింది.

ఎన్నో కొత్త పదాలను నేర్చుకున్నా..

- సీహెచ్‌.దాక్షాయణి (మొదటి విభాగంలో మూడో బహుమతి విజేత), 6వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోరగాన్‌(పి), నిజామాబాద్‌ జిల్లా
ఈ పోటీల్లో పాల్గొన్నాక తెలుగుపై మరింత అవగాహన కలిగింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతానని ఊహించలేదు. ఎన్నో కొత్త పదాలను నేర్చుకున్నాను. అతిశయోక్తి అనుకోకపోతే భాషపై పట్టు సాధించినంత ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అయిన నాకు ఈ అవకాశం లభించడం ఆనందదాయకం.

మన భాషను ప్రోత్సహించాలి
- వర్షిత, అమరావతి టాలెంట్‌ స్కూల్‌, సికింద్రాబాద్‌

విజ్ఞానం పెంచుకోవడానికి ఎన్ని భాషలను నేర్చుకున్నా, మాతృభాషలో ఉన్న సౌకర్యం మరెందులోనూ ఉండబోదు. భాషలో ప్రావీణ్యం పెంచుకోవడానికి సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటాను. ‘ఈనాడు’ పత్రిక చదవడం ద్వారా చాలా ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయ తెలుగు పదాలను తెలుసుకోగలుగుతున్నాను.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.