close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

నవశకంతో పేదల సంక్షేమానికి పెద్దపీట

● అర్హులైనవారికి నాలుగు రకాల కార్డులు ●

ఈనెల 20 నుంచి ఇంటింటి సర్వే


మాట్లాడుతున్న కలెక్టర్‌ వీరపాండియన్‌, పక్కన జేసీ రవి పట్టన్‌శెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో నిబంధనలను సులభతరం చేసిందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ రవి పట్టన్‌శెట్టి, డీఆర్వో పుల్లయ్యతో కలిసి శనివారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ నవశకం పేరుతో నాలుగు రకాల కార్డులు, 6 సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించనుందని చెప్పారు. ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేపడుతారన్నారు. ప్రజలందరూ వాలంటీర్లకు అందుబాటులో ఉండి సమగ్ర వివరాలను తెలపాలని కోరారు. కొత్తగా బియ్యం కార్డులు, వైఎస్‌ఆర్‌ పింఛను కానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర కార్డులను అర్హులకు అందిస్తామన్నారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం జిల్లాకు వర్తించదని పేర్కొన్నారు. ఇది కేవలం సముద్ర ప్రాంతాలు ఉన్న జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకాలకు సంబంధించి ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారని, ఈనెల 21 నుంచి డిసెంబరు 1వ తేదీ లోగా కంప్యూటరీకరణ పూర్తవుతుందని వివరించారు. డిసెంబరు 2-7 వరకు అనర్హుల ఏరివేత, డిసెంబరు 8న గ్రామ, వార్డు సభల ద్వారా అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు. డిసెంబరు 9న గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తామన్నారు. డిసెంబరు 10 నుంచి 14 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబరు 15-18 వరకు గ్రామ, వార్డు సభల ద్వారా అర్హుల ఎంపిక, 18, 19 తేదీల్లో కార్డుల ముద్రణ, డిసెంబరు 20న అర్హులైనవారికి నాలుగు రకాల కార్డులను అందిస్తామని పేర్కొన్నారు.

వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేను ఈనెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం జిల్లా కేంద్రం నుంచి జేసీ రవి పట్టన్‌శెట్టితో కలిసి వీడియో కాన్ఫరెన్సులో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించారు. ముందుగా రెండు రోజులపాటు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వేను వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 5 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 10 ఇళ్లు మాత్రమే సర్వే చేయాలన్నారు. వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్న చోట్ల సచివాలయ సిబ్బందితో సర్వే చేయించాలన్నారు. జిల్లాలో 850 మంది గ్రామ వాలంటీర్లు, వెయ్యిమంది వార్డు వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తర్వలో వీటిని భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతమున్న రేషన్‌ కార్డుల్లో ఏ ఒక్క కార్డును తొలగించకుండా.. అదనంగా కొత్తగా బియ్యం కార్డులు ఇస్తున్న విషయంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.