close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

మనసున్న మారాజులూ.. ఆదుకోండి

మండలం కొండాపూర్‌లో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు
 పది విద్యార్థుల ప్రత్యేక తరగతులకు చేయూత
 విజయోత్తేజంలో సామాజికవేత్తల ఔదార్యమే ప్రధానం
మేడిపల్లి

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి.. ప్రతి విద్యార్థి తన భవితను మలుచుకోవడంలో తొలి పరీక్ష ఇది. ఇక్కడ మట్టిలో మాణిక్యాలెన్నో ఉన్నాయి. పేదరికం మాటున సరస్వతీ బిడ్డలెందరో ప్రతిభను చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాసింత ప్రోత్సాహమిస్తే సర్కారు బడుల్లోనూ ఉత్తమ ఫలితాలతో సత్తాచాటుతామంటున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ నేపథ్యంలో పిల్లల ఆకలి తీర్చడంలో సామాజిక వేత్తలూ, స్వచ్ఛంద సంస్థల కృషి ప్రధానం. ఈసారి కూడా విజయోత్తేజానికి ఊతమిచ్చే అవకాశం మీకు చేరువలోనే ఉంది..

మానవతావాదులూ స్పందించండి..
పదో తరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచి సత్తా చాటుకుంది. కలెక్టర్‌ శరత్‌, విద్యాశాఖ అధికారుల కార్యాచరణ, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కారణంగా పదిలో జిల్లా హ్యాట్రిక్‌ సాధించింది. ఈసారి కూడా జిల్లా అధికారులు వంద రోజులు ముందుగానే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల సమయం ముగిసిన తరువాత 4.45 నుంచి సుమారు 6 నుంచి 7 గంటల వరకు విద్యార్థుల్ని అన్ని సబ్జెక్టుల్లోనూ సందేహాలు నివృత్తి చేసి పరీక్షలకు పూర్తి సంసిద్ధుల్ని చేస్తున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులకు ఆకలిబాధ ఉండకూడదని మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఉత్తేజం కార్యక్రమాన్ని ఈసారి కూడా విజయోత్తేజం పేరిట నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు  .. గ్రామస్థులు, సామాజికవేత్తల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా విజయవంతమవుతోంది. ఏటా ఈ కార్యక్రమానికి రూ. 15 నుంచి రూ.20 లక్షల వరకు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నిధులతో విద్యార్థులకు ఆకలిబాధ తెలియకుండా ప్రతిరోజూ సాయంత్రం ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలు తయారుచేసి అందించాల్సి ఉంటుంది. ఒక్కో పాఠశాలలో 30 నుంచి 50 మంది విద్యార్థులుండగా సుమారు 60 పనిదినాల్లో వారికి సాయంకాలం అల్పాహారం ఇవ్వాల్సి ఉంటుంది. దాతలు లేనిచోట పలువురు ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా విద్యార్థులకు అవసరమైన అల్పాహారాన్ని సమకూర్చుతున్నారు.

స్పందించండి.. సాయమందించండి..
పది విద్యార్థుల అల్పాహారానికి చేయూతనిచ్చేందుకు సామాజికవేత్తలు స్పందిస్తున్నారు. జగిత్యాల, సారంగాపూర్‌ మండలాల్లో పలువురు నిత్యావసరాలను పాఠశాలలకు అందించి ఉదారత చాటుకున్నారు. ఇదే క్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సామాజికవేత్తలు పది విద్యార్థుల ఉన్నతిలో భాగస్వాములు కావాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. నగదు, నిత్యావసరాల రూపంలో విరాళాలు అందించి ప్రత్యేక తరగతుల నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.