close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

సమ్మె ఆగినా.. బస్సు సాగేనా?

సిటీ బస్సుల సామర్థ్యంపై అనుమానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 48 రోజులు.. కదలకుండా ఉంటే ఏమవుతుంది? జీవం ఉన్న మనుషులే నిర్జీవులవుతారు. అలాంటిది ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఎంటీ? ఇప్పుడు నగర ప్రయాణికులను ఇదే ప్రశ్న తొలిచేస్తోంది. ఆర్టీసీ సమ్మె ఆగినా.. సిటీ బస్సు ప్రయాణాలు సాగేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో మెజార్టీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుమ్ము కొట్టుకుపోయి.. టైర్లలో గాలిపోయి.. బ్యాటరీ సామర్థ్యం కోల్పోయి.. నెడితేగాని ఇంజిన్‌ ప్రారంభం కాని పరిస్థితికి ఎన్ని బస్సులు చేరాయో అనే సందేహాలు ఇప్పుడు ప్రయాణికుల్లో కలుగుతున్నాయి.

పరుగు అందుకునేనా..!
2010లో సమకూరిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు తరచూ నడిరోడ్డున ఆగిపోయిన ఘటనలు గతంలో చూశాం. ఇప్పుడు 48 రోజులుగా 1,250 బస్సులు కదలలేదు. ఈ బస్సులు ఇప్పుడు ఇంజిన్‌ ఆన్‌ చేస్తే సహకరిస్తాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఆర్డినరీ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరంలోని దాదాపు 1,750 బస్సులు కాలపరిమితి ముగిసినవంటూ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాత్కాలిక సిబ్బంది వాటిని నడిపారు. పైగా వర్కుషాపులూ పని చేయకపోవడంతో వాటి నిర్వహణ మూలనపడింది. రోజూ తాత్కాలిక కార్మికులు విధులకు హాజరయ్యే ముందు.. బస్సు బాగుందో లేదో చూసుకొని, తీసుకెళ్లి నడిపారు. ఇలా మూలనపడిన బస్సులు నగర వ్యాప్తంగా వందల్లో ఉంటాయి. ఇలాంటి వాటిని మళ్లీ నడిపించడం ఆర్టీసీకి కత్తిమీద సామే. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులను ప్రత్యేక శిక్షణ పొందిన అనుభవం గల డ్రైవర్లు మాత్రమే నడపగలరు. సమ్మె ప్రారంభమైన రోజు నుంచి వీటిని బయటకు తీయలేదు. వీటిలో 132 బస్సులు ముషీరాబాద్‌ డిపో-2లో ఉన్నాయి. వీటికి తాత్కాలిక సిబ్బందికి ఇచ్చే సాహసం చేయలేదు. మిగతా డిపోల్లో ఆర్డినరీ బస్సులు, అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఉండటంతో సమ్మె కాలంలో వాటిని బయటకు తీశారు.

వారం రోజులు చాలు..
‘ఇప్పటికే 50 శాతం బస్సులు నడుస్తున్నాయి. మిగిలిన బస్సుల్లో చాలావాటికి సాంకేతిక ఇబ్బందులు లేవు. సమ్మె కాలంలో కొన్ని బస్సులు పాడైనా..అవి ఎక్కువ సంఖ్యలో లేవు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నడిచే బస్సులనే తాత్కాలిక సిబ్బందికి అప్పగించాం.. ఇప్పుడా బస్సులతో సమస్యలు లేవు. ఇక ఏవైనా మరమ్మతులకు గురైతే, వాటిని వారం రోజుల్లో సిద్ధం చేసేస్తాం..’ అంటూ అధికారులు చెబుతున్నారు. మెకానిక్‌ సిబ్బంది విధుల్లో చేరితే రాత్రి, పగలూ పని చేసి బస్సులను సిద్ధం చేస్తామని చెబుతున్నారు.

హుషారుగా వచ్చి... నిరాశగా వెళ్లారు
కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి ముందుకొస్తే తాము చేరడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కంటోన్మెంట్‌, పికెట్‌ డిపోలకు చెందిన కార్మికులు గురువారం ఉదయం హుషారుగా విధుల్లోకి చేరడానికి వచ్చారు. ఆయా డిపో మేనేజర్లు కృష్ణమూర్తి, ప్రణీత్‌లను కార్మికులు కలిసి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందలేదని డీఎంలు పేర్కొనడంతో కార్మికులు నిరాశగా వెనుదిరిగారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు కంటోన్మెంట్‌ డిపో ఎదుట బైఠాయించి, చెవుల్లో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.