గుండె తరుగుపోతుందికొత్త దోపిడీకి తెరలేపిన మిల్లర్లు
కడ్తా పేరుతో కొనుగోళ్లు
తూకం వేసేటప్పుడు రెండు కిలోలు తప్పనిసరి
న్యూస్టుడే, కామారెడ్డి వ్యవసాయం

ఆరుగాలం శ్రమించి పండించిన పంట విక్రయించే సమయంలో వ్యాపారులదే పైచేయి అవుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలున్నప్పటికీ దోపిడీ ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో అకాల వర్షాల బారిన పడిన పంట కొంత రంగు మారింది. సకాలంలో ఎండ లేదు. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు ససేమిరా అంటున్నారు. సరకుతో వచ్చిన లారీని నాలుగైదు రోజులు ఆపి షరతులతో తీసుకుంటున్నారు. క్వింటాలుకు అనధికారికంగా 2-4 కిలోలు కోత విధించి సరకు దించుకుంటున్నారు. లేదంటే ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. రంగు మారిన ధాన్యాన్ని ‘బీ’ గ్రేడ్ కింద సేకరించొచ్ఛు కానీ అలా తీసుకునేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా తూకం వేసే సమయాల్లో 40 కిలోల బస్తాకు కిలో చొప్పున తీస్తున్నారు. క్వింటాలుకు రెండున్నర కిలోలు దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు మిల్లర్లు సరకు బాగా లేదని మరో రెండున్నర కిలోలు తగ్గిస్తున్నారు. మొత్తంగా క్వింటాలుకు రూ.అయిదు కిలోలు కోత విధిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు దాదాపు రూ.100 నొక్కేస్తున్నారు. అంటే సర్కారు సేకరించే 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో రూ.32 కోట్ల వరకు అన్నదాత ఆదాయానికి గండిపడుతోంది.