close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

చిట్టి చేతుల కన్నీటి కష్టం!

మహా నగరంలో పెరుగుతున్న బాల కార్మికులు
అధికార యంత్రాంగం నామమాత్రపు తనిఖీలు
చీకటిలో మగ్గిపోతున్న అమాయక బాల్యం
చేపడుతున్న చర్యలపై ఎన్‌సీపీసీఆర్‌ పెదవి విరుపు
ఈనాడు, హైదరాబాద్‌

* పదేళ్ల పిల్లాడు..ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఖరీదైన ఇంట్లో పని మనిషిగా మారాడు. తిన్నావా అంటూ అడిగే వారులేరు. జ్వరం వచ్చినా జాలి చూపే మనుషులు కనిపించరు. ఒకరోజు చోరీ చేశాడంటూ కసిదీరా కొట్టారు. భరించలేని ఆ బాలుడు బయటపడి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరాడు. ఓ యువకుడు చైల్డ్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. సంస్థ ప్రతినిధులు బాలుడిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

* పద్నాలుగేళ్ల బాలిక. ఇంట్లో పెద్ద కూతురుగా పుట్టడమే శాపమైంది. సంపాదించేందుకు ఓ ఇంట్లో ఏడాదికి రూ.15,000 జీతం నిర్ణయించి పనికి కుదిర్చారు. చలాకీగా ఉండే ఆ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాసులతో నోరునొక్కించి విషయం బయటకు రాకుండా సదరు కుటుంబం జాగ్రత్తలు తీసుకుంది.

అధిక సంతానం..పేదరికం..నిరక్షరాస్యత.. కారణాలు ఏవైనా బాల్యం బందీ అవుతోంది. ఆనందంగా గడపాల్సిన వయసులో శక్తికి మించిన పని చేస్తున్నారు. బిడ్డలు సంపాదించే కొద్దిపాటి డబ్బులకు ఆశపడిన తల్లిదండ్రులు తప్పొప్పులు వదిలేస్తున్నారు. మరోవైపు ఇంట్లో ఇబ్బందులతో బయటకు వచ్చిన బాలబాలికల నిస్సహాయతను ఆసరా చేసుకుని దళారులు వారిని నేరస్థులుగా మార్చుతున్నారు. బాలకార్మికులకు నగరం చిరునామాగా మారింది. అధికారుల నామమాత్రపు తనిఖీలతో బడిలో ఉండాల్సిన బాల్యం ప్రమాదకరమైన పరిశ్రమల్లో మగ్గుతోంది. ఉన్నతాధికారులు పలుమార్లు మందలించినా, బాలహక్కుల సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నా మార్పు రావట్లేదు. తాజాగా గ్రేటర్‌ జిల్లాల్లో పర్యటించిన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) కూడా నగరంలో బాలకార్మికుల వ్యవస్థ నివారణకు చేపడుతున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. వీధి బాలలు, బాల కార్మికులకు వసతి కల్పించే పలు స్వచ్ఛంద సంస్థలు నిబంధనలు పాటించట్లేదని తనిఖీల్లో గుర్తించారు. లెక్కకు మించి పిల్లలను చూపుతూ తప్పుదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలోనూ 12 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవని గుర్తించారు. వారికి నోటీసులు జారీచేసిన అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం గమనార్హం.

తూతూ మంత్రం.. తనిఖీల మంత్రం
2017లో రాచకొండ పోలీసులు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించారు. వీరిలో 320 మంది తెలంగాణ వారు కాగా 490 మంది బాలబాలికలను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పని చేయిస్తున్నట్టు నిర్ధారించారు. మరో ముగ్గురు పిల్లలు మాయమైనట్లు గుర్తించారు. హోటళ్లు, మెకానిక్‌ దుకాణాలు, దుకాణాలు తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్న 279 మంది బాలురు, 38 మంది బాలికలను గుర్తించి స్వేచ్ఛ కల్పించారు. కొందరికి పునరావాస కేంద్రాల ద్వారా రక్షణ అందించారు.  గ్రేటర్‌ పరిధిలో ఇటుక బట్టీలు, రసాయనిక పరిశ్రమలు, గాజుల తయారీ, హోటళ్లలో పెద    ఎత్తున బాల కార్మికులు పనిచేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఆపరేషన్‌ ముస్కాన్‌, స్మైల్‌ పేరిట తనిఖీలు చేపడుతున్నాయి. అక్కడ దొరికిన పిల్లలను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చుతున్నారు. కొందరిని నగరంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొదట్లో సజావుగా కొనసాగిన తనిఖీలు ప్రస్తుతం నామమాత్రంగా మారాయి. అధికారులు కూడా ఏవో కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పని భారం పెరగడంతో పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడినట్లు ఓ ఉన్నతాధికారి వివరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.