close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

విద్యుత్తు సమస్యల పరిష్కారమే లక్ష్యం

వేదిక ఛైర్‌పర్సన్‌ ఈశ్వరయ్య

ధర్మపురి, న్యూస్‌టుడే: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించడమే తమ వేదిక లక్ష్యమని రాష్ట్ర విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఛైర్‌పర్సన్‌ ఈశ్వరయ్య అన్నారు. ధర్మపురి విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఇప్పటివరకు 195 సమస్యలపై వచ్చిన పిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. ధర్మపురి పట్టణంలో విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు పూర్తయిన తర్వాత సరఫరాలో అంతరాయాలుండవని చెప్పారు. ధర్మపురి 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2015 పుష్కరాల సమయంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం ప్రత్యేక ఫైబర్‌ లైన్‌ను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం పని చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే విచారణ జరిపి విద్యుత్తు లైన్‌కు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. గతంలో రాయికల్‌ మండలం మైతాపూర్‌లో 19.05.2019న విద్యుదాఘంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని అతడి బంధువులు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యులు ఇ.గణపతిరెడ్డి, ఆర్‌.చరణ్‌దాస్‌, ఎస్‌ఈ వేణుమాధవ్‌, ఎస్‌ఏఓ శ్రీనివాస్‌, డీఈ హరికృష్ణ, ఏడీఏ జవహర్‌నాయక్‌, ఏఈ మనోహర్‌, పలువురు ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్వహణపై ప్రచారం కరవు
ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదికకు ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ధర్మపురి, బుగ్గారం, రాయికల్‌, బీర్‌పూర్‌, పెగడపల్లి, వెల్గటూర్‌ మండలాల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయా మండలాల్లో ప్రచారం చేయలేదు. అధికారులు మొక్కుబడిగా ఒకరోజు ముందు ప్రకటన విడుదల చేసి వేదిక నిర్వహించారు. దీంతో వినియోగదారులు రాక అధికారులు, సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. తక్కువ మంది హాజరు కావడంతో మొక్కుబడిగానే నిర్వహించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.