close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

క్రమబద్దీకరణ.. నామమాత్రం

దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు
నాలా ఛార్జీల చెల్లింపునకు తప్పని ఇబ్బందులు
ఈ నెల 3 వరకు అందిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల తీరు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌(కరీంనగర్‌)

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)కు సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికే దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండగా వచ్చిన దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌ ముప్పు తిప్పలు పెడుతోంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర, పురపాలికల్లోని విలీన గ్రామాలకు, మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న అక్రమ లేఅవుట్ల స్థలాలు(ఎల్‌ఆర్‌ఎస్‌) పథకం ద్వారా స్థలాలుక్రమబద్ధీకరించుకోవడానికి పురపాలక శాఖ అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని ప్రారంభించి 50 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రారంభించిన ఈ పథకాన్ని పట్టణ ప్రణాళిక విభాగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై అవగాహన కల్పిస్తున్నా అంతగా ఆసక్తి చూపడం లేదనేదీ దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది.

తగ్గుతున్న దరఖాస్తులు
ఒకప్పుడు స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి దరఖాస్తుదారులు పోటీ పడి దరఖాస్తు చేసేవారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వందల సంఖ్యలో వచ్చేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి రోజులు గడుస్తున్నా, ఈ గడువు సమీపిస్తున్నా దరఖాస్తుల సంఖ్య ఆశించిన స్థాయిలో వచ్చేలా లేదు. దీనికి ప్రధాన కారణం ఖాళీ స్థలంపై పన్ను(వీఎల్‌టీ) మదించడం, వీఎల్‌టీని ప్రతి ఆరు నెలలకోసారి ఆస్తిపన్ను మాదిరిగా చెల్లించాల్సి రావడంతో పెండింగ్‌ దరఖాస్తుదారులు ఆసక్తి చూపడం లేదు. విలీన గ్రామాల్లో స్థల మార్పిడీకి నాలా పన్ను చెల్లించాల్సి ఉండడంతో పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడానికి సొంత ప్లాట్లు ఉన్న యజమానులు ముందుకు రావడం లేదంటున్నారు. ఈ నెల 3 వరకు కరీంనగర్‌లో 22, జమ్మికుంట 7, హుజూరాబాద్‌ 23, చొప్పదండి 2, కొత్తపల్లి 4, సుడా పరిధిలో 4 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా పెద్దపల్లిలో 28, మంథనిలో 20, సుల్తానాబాద్‌లో 2 దరఖాస్తులు రాగా, జగిత్యాలలో 1, రాయికల్‌లో 3, ధర్మపురిలో 5, కోరుట్లలో 14, మెట్‌పల్లిలో 6 దరఖాస్తులు, సిరిసిల్లలో 1, వేములవాడలో 2 దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చాయి.

క్రమబద్ధీకరణకు చివరి అవకాశం
-రవీందర్‌రెడ్డి, ప్రాంతీయ ఉప సంచాలకులు
దరఖాస్తులు పెంచడానికి అవగాహన కల్పిస్తున్నాం. అక్రమ లేఅవుట్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో లేఅవుట్‌ లేని స్థలాలపై లావాదేవీలు నిలిపివేయడం జరుగుతుంది.

ఆన్‌లైన్‌ సమస్యలు
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం వచ్చే దరఖాస్తుదారులను ఆన్‌లైన్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. ఒకవేళ పని చేసినా, ఎన్ని గంటలు ఆన్‌లైన్‌ పని చేస్తుందో తెలియదు. దరఖాస్తుదారులకు ఓటీపీలు రావడం లేదు. లింకు డాక్యుమెంట్లు అధికంగా ఉన్నట్లయితే అందులో ఉన్న డేటా సరిపోవడం లేదు. గంటల తరబడి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతుండటంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలనే ఉత్సాహం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తహసీల్దార్‌ చుట్టూ ప్రదక్షిణలు
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లోని అనధికారిక స్థలాలు క్రమబద్ధీకరించుకోవాలంటే ముందుగా ఆ స్థలాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ భూమి ఉంటే, నివాసిత స్థలంగా మార్పు చేసుకోవడానికి ‘నాలా’ పన్ను తహసీల్దార్‌ కార్యాలయాల్లో కచ్చితంగా చెల్లించాల్సి వస్తోంది. ఆ కార్యాలయాల్లో దరఖాస్తు చేస్తే రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని ఓ దరఖాస్తుదారుడు వాపోయారు. ఈ పన్ను చెల్లించడానికి కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చితే అప్పటికప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సర్వేయర్లు అంటున్నారు. తహసీల్దార్‌ చుట్టూ తిరగలేక దరఖాస్తుదారులు మళ్లీ రావడం లేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.