close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

సినిమా

ఈ ఎస్వీయూకు ఏమైంది?

హాల్‌ టికెట్ల నిండా తప్పులే

పరీక్ష కేంద్రంలో సరిదిద్దుతామంటూ దాటవేత

ఎస్వీయూ - న్యూస్‌టుడే

ఎస్వీయూలో అర్థశాస్త్రం మూడో సెమిస్టర్‌ చదువుతున్న వి.అశోక్‌కుమార్‌ శనివారం హాల్‌ టికెట్‌ అందుకున్నాడు. ఇతను ‘ఓపెన్‌ ఎలక్టివ్‌’లో భాగంగా సాంస్కృతిక రంగానికి సంబంధించిన ‘జానపద నృత్యం’ పేపర్‌ను ఎంచుకున్నాడు. ఈ విద్యార్థికి అధికారులు ఇచ్చిన హాల్‌టికెట్లో ఈ పేపర్‌ అదృశ్యమైంది. హాల్‌టికెట్లో మొత్తం ఆరు పేపర్లు పొందుపర్చాల్సి ఉండగా కేవలం ఐదే ముద్రించారు. ఆందోళన చెందిన అశోక్‌కుమార్‌ ఎస్వీయూ పరీక్షల కార్యాలయాన్ని సంప్రదించగా.., తామిచ్చిన హాల్‌టికెట్‌ను పట్టుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లాలని.., అక్కడే ఆరో పేపర్‌ను పెన్నుతో రాసిస్తామంటూ అధికారులు ఉచిత సలహా ఇచ్చారు.

ఎస్వీయూ పరిధిలో ఇటీవల ప్రారంభమైన డిగ్రీ పరీక్షల హాల్‌టికెట్లలో వెలుగుచూసిన తప్పిదాలు మరువకముందే పీజీ పరీక్షల్లోనూ అదే తరహా నిర్లక్ష్యం వెలుగుచూసింది. హాల్‌టికెట్లలో విద్యార్థుల ఫొటోలు క్రమపద్ధతిలో లేకపోవడం, సబ్జెక్టులకు సంబంధించిన పేర్లు తారుమారు కావడం, మరికొన్ని సబ్జెక్టుల పేర్లు పూర్తిగా కనుమరుగవడం, సైన్స్‌ సబ్జెక్టు విద్యార్థులకు ఆర్ట్స్‌ సబ్జెక్టు పేపర్లను పొందుపర్చడం.. ఇలా ఒకటా రెండా తమ లీలావిన్యాసాలు అన్నీచూపించారు ఎస్వీయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారులు. ఇష్టానుసారంగా హాల్‌టికెట్లను ముద్రించేసి.. వాటిని విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమానికి శనివారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు పుస్తకాలపై శ్రద్ధపెట్టి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు హాల్‌టికెట్లు అందుకోగానే.. అందులోని సాంకేతిక తప్పిదాలను చూసి, బిత్తరపోతూ పరీక్షల కార్యాలయం వైపు పరుగులు పెట్టారు. పరీక్షల కార్యాలయం సిబ్బంది విద్యార్థుల ఫిర్యాదులను విని, ‘మీరంతా ఇవే హాల్‌టికెట్లను తీసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లండి. అక్కడ మా సిబ్బంది వాటిని పెన్నుతో సరిచేసి ఇస్తారం’టూ సలహాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రం వరకూ ఎందుకంటూ తమకు తామే హాల్‌టికెట్‌లపై తమకు సంబంధించిన సబ్జెక్టులను వారికి వారే పెన్నుతో రాసుకోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం హాల్‌టికెట్లపై ఎలాంటి చేతిరాతలు ఉండకూడదు. అధికారుల తప్పిదాలతో విద్యార్థులే స్వయంగా సరిచేసుకోవడం చర్చనీయాంశమైంది. పీజీ పరీక్షలు అంటే.. ఇంత నవ్వులాటా? అన్న చర్చ సాగుతోంది.

పదేపదే సాంకేతిక సమస్యలు

హాల్‌టికెట్ల ముద్రణలో గతంలో డిగ్రీ, ప్రస్తుతం పీజీ పరీక్షల్లో సాంకేతిక తప్పిదాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో అధికారులు తరచూ విఫలమవుతూనే ఉన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే క్రమంలో విద్యార్థులు, వారి మాతృ కళాశాలల సిబ్బందే సబ్జెక్టులను ఎంపిక చేస్తారని, వారు ఎంపిక చేసిన విధంగానే హాల్‌టికెట్ల ముద్రణ జరుగుతుందని క్యాంపస్‌లోని పరీక్షల నియంత్రణ కార్యాలయం వాదిస్తోంది. కళాశాలలు, విద్యార్థులు మాత్రం ఈ వాదనను తిప్పికొడుతున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేటప్పుడు తాము సరైన పద్ధతిలోనే సబ్జెక్టులను పొందుపరుస్తున్నామని, తామేం సబ్జెక్టులను చదువుతున్నామో తమకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు..? పరీక్షల కార్యాలయంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నెపం వేయడం తగదని విద్యార్థులు, కళాశాలలు వాదిస్తున్నాయి. అధికారులు, విద్యార్థుల మధ్య వాదులాడుకోవడం మాని.. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి.. పొరపాటు ఎక్కడ జరిగిందో తేల్చాల్సిన అవసరం ఉంది. విద్యార్థి ప్రతిభకు కొలమానం మార్కులేనని.. అలాంటిది పరీక్షల నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే ఇక తమ చదువులకు సార్థకత ఎక్కడిదని విద్యార్థులు వాపోతున్నారు.

రేపటి నుంచే పీజీ పరీక్షలు

ఎస్వీయూ పరిధిలో జిల్లావ్యాప్తంగా పీజీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం పద్నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలన్నింటినీ ప్రభుత్వ కళాశాలలకే పరిమితం చేశారు. పీజీ పరీక్షలకు దాదాపు 6,700 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాలను పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఫర్నీచరు ఏర్పాటును చేయాల్సిందిగా ఎస్వీయూ అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.