close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

మేడారం

నవజాత శిశువును విక్రయించిన కన్న తండ్రి
ఐసీడీఎస్‌ అధికారుల చొరవతో తల్లి ఒడి చేరిన పసికందు
తల్లి చెంతకు బిడ్డకు చేర్చుతున్న అంగన్‌వాడీ సిబ్బంది, పోలీసులు (అంతర్‌చిత్రంలో తల్లి ఒడి చేరిన శిశువు)

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను కన్న తండ్రే తాగిన మైకంలో డబ్బులకు ఆశపడి విక్రయించిన వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి శివారు తిమ్మాపురం గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. పుట్టిన నాలుగు రోజులకే ఆ ఆడ శిశువును అంగట్లో విక్రయించాడు ఆ కన్నతండ్రి.. ఐసీడీఎస్‌ అధికారులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. చత్తీస్‌గఢ్‌ నుంచి మడకం సింగరాజు, సునీత దంపతులు ఏడేళ్ల క్రితం అటవీశాఖ కార్పొరేషన్‌లో వెదురు నరికే పనుల కోసం ఈ గ్రామానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. సునీత మళ్లీ గర్భిణి కావటంతో పురుడు పోసుకునేందుకు అశ్వారావుపేట సామాజిక ఆసుపత్రికి ఈనెల 6న వెళ్లారు. ఆరోజు రాత్రి ఆరో సంతానంగా ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకున్న ఆసుపత్రి సిబ్బంది సోమవారం రాత్రి ఏడు గంటలకు డిశ్ఛార్జి చేశారు. సింగరాజు అప్పటికే ఆసుపత్రిలో పరిచయం అయిన అశ్వారావుపేట డ్రైవర్స్‌ కాలనీకి చెందిన బాజీ అనే వ్యక్తికి రూ.20 వేలకు ఆ పసికందును విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు. అంతేకాదు... అతని వద్ద నుంచి అడ్వాన్సుగా రూ.15 వేలు తీసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సింగరాజు ఆసుపత్రి నుంచి సునీత బయటకు వచ్చిన వెంటనే ఆమె నుంచి బిడ్డను బలవంతంగా లాక్కుని డబ్బులిచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని సునీతను బెదిరించాడు. దీంతో భయపడిన సునీత మిగతా పిల్లలను తీసుకుని భర్తతో కలసి ఇంటికి వెళ్లింది. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచరు తాటి సుజాత పసికందు వివరాలను నమోదు చేసుకునేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సునీత ఏడుస్తూ కనిపించడంతో ఎందుకు ఏడుస్తున్నావు, బిడ్డేదని ప్రశ్నించింది. ఇంకేముంది కన్నతల్లి బోరున విలపిస్తూ జరిగిందంతా తెలిపింది. దీంతో అంగన్‌వాడీ టీచరు ఈ సమాచారాన్ని తమ సూపర్‌వైజరు సౌజన్యకు తెలపగా ఆమె పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. వారి సాయంతో శిశువును కొన్న వ్యక్తి ఇంటికి వెళ్లారు. తమకు బిడ్డలు లేనందున అతను ఇస్తాననడంతో తీసుకున్నట్లు బాజీ తెలిపారు. ఇలా పిల్లలను కొనుగోలు చేయకూడదని బిడ్డలు లేకుంటే చట్టపరంగా దత్తత తీసుకోవాలని అధికారులు సూచించి పసికందును తల్లి ఒడి చేర్చారు. దీంతో కథ సుఖాంతమైంది.

మడిమి సింగరాజు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.