close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

తొలి పీఠం.. ఎవరి కైవసం!

● వైరాలో ఆసక్తికర పోరు ●

తెరాసలో ధీమా ●

సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రతిపక్షాలు

ఈనాడు, ఖమ్మం

జిల్లా కేంద్రానికి సమీపంలో ఖమ్మం-అశ్వారావుపేట, ఖమ్మం-భద్రాచలం ప్రధాన రహదారికి ఇరువైపులా విస్తరించిన పట్టణం వైరా. ఖమ్మం మీదుగా అటు మధిర, ఇటు కొత్తగూడెం, మరో వైపు సత్తుపల్లి వెళ్లాలంటే వయా వైరా వెళ్లాల్సిందే. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన వైరా పురపాలకంలో తొలి పీఠం ఎవరి కైవసం అవుతుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తొలి దఫా ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు తొలి ఛైర్మన్‌ అవుతారన్న అంశాలు పట్టణ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

తెరాస.. తెరాస గెలుపు ధీమాతో ప్రచార పర్వం కొనసాగిస్తోంది. ఈనెల 7న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నేతలు ఎమ్మెల్యే రాములునాయక్‌ అధ్యక్షతన పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఇక్కడ పురపోరులో విజయావకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. వైరా సర్వతోముఖాభివృద్ధి తెరాసతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ఇటీవలే రూ.20 కోట్ల పనులకు చేసిన శంకుస్థాపన వివరాలు వెల్లడించారు. రానున్న రోజుల్లో వైరా పురపాలకం అభివృద్ధి చెందాలంటే తెరాసకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. అధికార తెరాస 20 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం చేసుకుంది. మరో 19 స్థానాల్లో మెజారిటీ కంటే అధికంగా 80 శాతం స్థానాలను కైవసం చేసుకుంటామని వెల్లడిస్తోంది. ఎమ్మెల్యే రాములునాయక్‌, బొర్రా రాజశేఖర్‌ తదితరులు ఎన్నికల్లో అన్నీ తామై నడిపిస్తుండగా.. పార్టీ ముఖ్యనేతలు తరచూ ప్రచారం నిర్వహిస్తూ.. తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇటీవలే వైరాలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

కూటమి.. కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ కూటమిగా ఏర్పడ్డాయి. మూడు పార్టీలు కలిపి 17 స్థానాల్లో అధికార పార్టీతో పోటీ పడుతున్నాయి. తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా పార్టీల్లో ఉన్న నేతలు, అభిమానులు నామినేషన్లు వేశారు. గెలిపించాలని ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కూటమికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్‌, తెదేపాకు స్థానికంగా బలమైన నేతలు చొప్పుకోదగ్గ స్థాయిలో లేరు. మేమున్నాం అనే నేతలు ఉన్నప్పటికీ అందరినీ ఒకతాటిపై నడిపించి, పార్టీ ఓటర్లను గెలుపు దిశగా మలిచే నేతలు తగ్గారు. దీంతో పార్టీనే నమ్ముకొని పని చేస్తున్న వారంతా నయా రాజకీయాలకు ఎదురొడ్డాల్సి వస్తోంది. తెదేపాకు నమ్మకమైన నేతలు, కార్యకర్తలు ఉన్నప్పటికీ విజయం దిశగా అడుగులు వేసి నడిపించేవాళ్లు లేకుండాపోయారు. అయినప్పటికీ స్థానికంగా ఉన్న ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు బలంగా పోటీనిస్తున్నారు.

ఒంటరిగానే భాజపా, సీపీఎం

పురపాలకంలోని 20 వార్డుల్లో మూడో వార్డు ఏకగ్రీవం కాగా మిగతా 19 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తోంది. సీపీఎం కూడా అదే బాటలో పయనిస్తోంది. భాజపా అన్ని వార్డులో పోటీ చేయాలని భావించినప్పటికీ 08 వార్డులకే పరిమితమై తమ అభ్యర్థులను నిలిపింది. ప్రధాని మోదీ పట్టణీకరణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో అభ్యర్థులు పాల్గొంటున్నారు. సీపీఎం కూడా 08 వార్డులకే పోటీ చేస్తోంది. ఆ వార్డుల్లో ఎర్రజెండా సత్తా ఏమిటో చూపించాలని భావిస్తోంది.

 


మొత్తం ఓటర్లు 23,226

 

పురుషులు: 11,119

మహిళలు: 12,105

ఇతరులు: 2

ఎస్సీలు 5,101

ఎస్టీలు 1,238

బీసీలు 11,270

ఓసీలు 5,615


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.